logo
Published : 24 May 2022 05:23 IST

ఇక్కడ చెరువుండాలే

పర్యవేక్షణ కొరవడిన కబ్జా పర్వం

పూడ్చి వేసిన గొల్లగూడెంలోని చెరువు 

తాడేపల్లిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే: స్వలాభం కోసం కొందరు పూడ్చేస్తుంటే.. మరికొందరు ఆక్రమించుకుంటున్నారు. వెరసి ఆనవాళ్లే లేకుండా చేస్తున్నారు. తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో చెరువుల పరిస్థితి ఇది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 101.21 ఎకరాల విస్తీర్ణంలో 25 చెరువులుండాల్సి ఉండగా.. పురపాలక రికార్డుల్లో ఇవన్నీ కానరావడం లేదు. 15 మాత్రమే నమోదై ఉండటం గమనార్హం. అధికారుల పర్యవేక్షణ లోపంతో చాలా వరకు మురుగుతో నిండిపోయి దుర్భరంగా మారాయి. పట్టించుకునేవారు లేకపోవడంతో వీటిపై అక్రమార్కుల కన్ను పడింది. భూగర్భ జలాలను పెంపొందించేందుకు చెరువులు ఎంతగానో ఉపయోగపడతాయి. దశాబ్దాల కిందట వ్యవసాయం, తాగునీటి కోసం చెరువులపైనే ప్రజలు ఆధారపడేవారు.

ఆనవాళ్లు లేకుండా చేశారు

పట్టణంలోని తాళ్లముదునూరుపాడులో సర్వే నెంబరు 79కు సంబంధించి 4.04 ఎకరాల్లో భట్టువానిగుంట చెరువు ఉంది. గతంలో ఇది స్థానికులకు మంచి నీటి అవసరాలను తీర్చేది. కుళాయిలు రావడంతో ఇది మరుగున పడింది. ఆ తరువాత కొంత కాలం వరకు చేపల పెంపకానికి పురపాలక సంఘం లీజుకు ఇచ్చేది. స్థానికులు వ్యర్థాలు వేయడంతో మురికి కూపంలా తయారైంది. ఇదే అదనుగా పలువురు పూడ్చేసి సుమారు 3.5 ఎకరాల వరకు ఆక్రమించుకున్నారు. చెరువు ఆనవాళ్లు లేకుండా చేశారు.

ఎర్ర చెరువు పరిస్థితి ఇలా..

18వ వార్డు పుంతలో ముసలమ్మ ఆలయం సమీపంలో సర్వే నెంబరు 22/2కు చెందిన ఎర్ర చెరువు 7.52 ఎకరాల్లో ఉంది. స్థానికులు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతుంటే పురపాలక అధికారులు అడ్డుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వ్యవహారం కోర్టులో నడుస్తోంది. ఈ తరహాలో పట్టణంలోని చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయి.

ఆక్రమణకు గురైన శివాలయం చెరువు

పరిరక్షణకు చర్యలు

పట్టణ పరిధిలోని చెరువు ఆక్రమణలపై దృష్టి సారిస్తాం. పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. కొండయ్య, కృష్ణుడి చెరువులను ఉద్యానాలుగా అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకొస్తాం. - బి.బాలస్వామి, కమిషనర్‌

ఆక్రమణలు ఇలా..

అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో చెరువులు నామ రూపాలు లేకుండా పోతున్నాయి. పసర్ల, సిద్ధి, బట్టువాని గుంట చెరువులు కబ్జా కోరల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. మంచినీళ్లు, అనంతమ్మ, కొత్త కర్ర, శివాలయం, కోమటివాని చెరువులు క్రమేపీ ఆక్రమణలకు గురవుతున్నాయి. కొంత మంది స్వలాభం కోసం ఎర్ర చెరువు, గొల్లగూడెం చెరువులను పూడ్చి వేశారు. కొండయ్య చెరువు, కృష్ణుడి చెరువులను పార్కులుగా అభివృద్ధి చేస్తున్నారు. నాలుగేళ్ల కిందట చేపట్టిన ఈ పనులు నేటికీ పూర్తి కాలేదు. ఊర చెరువు ఆక్రమణకు గురికావడంతో పలువురు కోర్టును అశ్రయించారు. ఇదే తరహాలో భట్టువానికుంట చెరువులో పురపాలక సంఘం చెత్తను వేయడంతో స్థానిక రైతులు కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఈ రెండు చెరువులు కోర్టు వివాదంలో ఉన్నాయి.

మొత్తం చెరువులు 25

పూర్తి కబ్జాలో 4

ఆక్రమణలకు గురైనవి 5

వివాదంలో ఉన్నవి 2

పూడ్చివేసినవి 2

పార్కులుగా అభివృద్ధి చేసినవి 2

Read latest West godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని