logo
Published : 24 May 2022 05:23 IST

భానుడు భగభగ

భీమవరం పట్టణం, గునుపూడి, ఉండి, న్యూస్‌టుడే: భానుడి భగభగలతో జనం విలవిల్లాడుతున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో సోమవారం కూడా 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీగా ఉండే రహదారులు భానుడి ప్రతాపంతో వెలవెలబోయాయి. కొన్ని ప్రాంతాలు నిర్మానుష్యంగా మారి లాక్‌డౌన్‌ రోజులను తలపించాయి. నరసాపురం పరిధిలో సరివి తోటకు, పలు ప్రాంతాల్లో ఎండుగడ్డికి నిప్పు అంటుకుని మంటలు వ్యాపించడంతో వేడిగాలుల తీవ్రత మరింత పెరిగింది.

శ్రమజీవులకు అవస్థలు.. ఎండ తీవ్రతతో నిత్యం రెక్కాడితే గానీ డొక్కాడని శ్రమజీవులకు అవస్థలు తప్పడం లేదు. వరి మాసూళ్లు, రొయ్యలు, చేపల పట్టుబడి పనులను తెల్లవారుజాము 5 గంటల నుంచే ప్రారంభిస్తున్నారు. మధ్యాహ్నం వేళ రెండు, మూడు గంటల పాటు పనులకు విరామమిస్తున్నారు. రెండు, మూడు రోజులుగా కొల్లేరు పరిధిలో కిక్కిసను కాల్చేస్తున్నారు. దీంతో ఉండి, ఆకివీడు, కాళ్ల పాలకోడేరు తదితర మండలాల్లో రాత్రి 8 గంటల వరకు వేడి గాలుల తీవ్రత కొనసాగుతోంది.

రహదారులన్నీ నిర్మానుష్యం.. తాడేపల్లిగూడెం: మరో నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండు వెలవెలబోయింది. తాడేపల్లిగూడెం కేఎన్‌ రోడ్డు సాయంత్రం 5 గంటలకు కూడా నిర్మానుష్యంగా కనిపించింది. కొన్ని దుకాణాలను మూసివేశారు. ఎండ ప్రభావం బ్రహ్మానందరెడ్డి మార్కెట్‌పై పడింది. లావాదేవీలు మందకొడిగా సాగాయని వ్యాపారులు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి పండ్లు వస్తున్నాయని, ఎగుమతులు భారీగా తగ్గాయని హోల్‌సేల్‌ వ్యాపారి ఎం.నాగేశ్వరరావు వివరించారు. సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ కూడా మధ్యాహ్నం వేళ ఖాళీగా కనిపించాయి.

సాయంత్రం 5 గంటలకు కె.ఎన్‌.రోడ్డు ఇలా..​​​​​​​

Read latest West godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని