logo

బరి తెగింపు

తాడేపల్లిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో మట్టి, గ్రావెల్‌ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆరుగొలను, కొత్తూరు గ్రామాల్లో తవ్వకాలను నిలిపివేయడంతో అక్రమార్కులు ఇతర గ్రామాల్లోని పంట పొలాలు, చెరువులపై పడ్డారు. అడ్డ దారిలో తవ్వకాలు

Published : 26 May 2022 03:50 IST

ఓ నేత అండతో కొనసాగుతున్న మట్టి దందా

జగ్గన్నపేటలో మాలపాడు చెరువును తవ్వుతున్న వైనం

తాడేపల్లిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే : తాడేపల్లిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో మట్టి, గ్రావెల్‌ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆరుగొలను, కొత్తూరు గ్రామాల్లో తవ్వకాలను నిలిపివేయడంతో అక్రమార్కులు ఇతర గ్రామాల్లోని పంట పొలాలు, చెరువులపై పడ్డారు. అడ్డ దారిలో తవ్వకాలు చేస్తూ వందల కొద్దీ లారీల్లో మట్టి తరలిస్తూ భారీగా సంపాదిస్తున్నారు. తవ్వకాలు జరపవద్దని అధికారులు మొరపెట్టుకుంటున్నా అక్రమార్కులు వారి మాటలను పెడచెవిన పెడుతున్నారు. ఒక చోట తవ్వకాలను అడ్డుకుంటే మరొక చోట ప్రారంభిస్తున్నారు. వారిని అదుపు చేయడంలో రెవెన్యూ అధికారులు విఫలం చెందుతున్నారు. అధికార పార్టీలోని ఓ కీలక నేత సహకారంతోనే మట్టి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఆయన ఫోన్‌ చేశారని.. వెనుతిరిగారు.. తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేట గ్రామంలో 6.90 ఎకరాల విస్తీర్ణంలో మాలపాడు చెరువు ఉంది. ఇందులో విలువైన గ్రావెల్‌ ఉండటంతో మట్టి మాఫియా కన్ను పడింది. దీంతో చెరువులోని మట్టిని గ్రామ పంచాయతీ పరిధిలోని రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు వినియోగించేందుకు తీర్మానం తీసుకున్నారు. దొరికిందే తడవుగా పదుల సంఖ్యలో లారీలు, జేసీబీలను తీసుకొచ్చి మైనింగ్‌ అనుమతులు లేకుండా తవ్వకాలు నిర్వహించారు. తీర్మానం ప్రకారం చెరువులోని మట్టిని గ్రామాభివృద్ధికి వాడకుండా తాడేపల్లిగూడెం పట్టణంలో పలు మట్టి రోడ్లు వేసేందుకు ఉపయోగించారు. నాలుగు రోజులపాటు నిర్వహించిన తవ్వకాల్లో తట్ట మట్టినీ గ్రామంలో వేయకపోవడం గమనార్హం. విషయం తెలుసుకున్న విజిలెన్సు అధికారులు మాలపాడు చెరువులో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న లారీలు, జేసీబీలను అదుపులోకి తీసుకున్నారు. ఈ లోగా అధికార పార్టీకి చెందిన ఓ నేత సంబంధిత అధికారులకు ఫోన్‌ చేయడంతో ఎక్కడి వాహనాలను అక్కడే వదిలేసి విజిలెన్స్‌ అధికారులు తిరుగుముఖం పట్టారు.

కొండ్రుప్రోలులో తవ్వకాలు

తవ్వకాలను అడ్డుకుంటాం

ఆరుగొలను, కొత్తూరు గ్రామాల్లో గ్రావెల్‌ తవ్వకాలను పూర్తిస్థాయిలో నిలిపివేశాం. అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం రాగానే ఘటన స్థలానికి చేరుకుని వాటిని అడ్డుకుంటున్నాం. అక్రమ తవ్వకాలు నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటాం. - అప్పారావు, తహశీల్దార్‌

అక్కడ ఆగింది.. ఇక్కడ మొదలైంది..

జగ్గన్నపేట మాలపాడు చెరువులో విజిలెన్స్‌ దాడులు జరిగి ఒక్కరోజు కాకముందే కొండ్రుప్రోలు గ్రామంలోని పంట పొలాల్లో అక్రమార్కులు తవ్వకాలు చేపట్టారు. పట్టపగలే తవ్వకాలు చేపట్టడం గమనార్హం. గ్రామస్థాయి అధికారులకు ఈ విషయం తెలిసినప్పటికీ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. గూడెం మండలంలో మట్టి తవ్వకాలను పూర్తిస్థాయిలో నిలిపి వేయాలని ఉన్నతాధికారులు మండల స్థాయి అధికారులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. అధికార పార్టీ అండ చూసుకుని మట్టి మాఫియా చేస్తున్న అక్రమాలకు అధికారులు బలవుతున్నారు. ముందు గొయ్యి వెనక నుయ్యి అన్న చందంగా వారు నలిగిపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని