logo

తట్ట మట్టేస్తే ఒట్టు!

తమ చిరకాల వాంఛ నెరవేరనుందని డెల్టా ప్రాంత వాసులు ఆశపడ్డారు. ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి అవసరమైన భూములు ఇచ్చేందుకు కొందరు స్వచ్ఛందంగా ముందుకు రాగా మరికొందరు అయిష్టంగానే అంగీకరించారు. అనంతరం అధికారులు

Published : 26 May 2022 03:50 IST

ఏడాది కావొస్తున్నా అడుగు ముందుకు పడని వైద్య కళాశాల పనులు

దగ్గులూరులో వైద్య కళాశాల కోసం సేకరించిన భూమి

పాలకొల్లు పట్టణం, న్యూస్‌టుడే : తమ చిరకాల వాంఛ నెరవేరనుందని డెల్టా ప్రాంత వాసులు ఆశపడ్డారు. ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి అవసరమైన భూములు ఇచ్చేందుకు కొందరు స్వచ్ఛందంగా ముందుకు రాగా మరికొందరు అయిష్టంగానే అంగీకరించారు. అనంతరం అధికారులు ఆఘమేఘాలపై శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారు. సేకరించిన భూమిలో కొంత మేర మట్టితో మెరక చేసి సభా వేదిక సిద్ధం చేయగా.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గతేడాది మే 31న ఆన్‌లైన్‌లో శంకుస్థాపన చేశారు. ఆ తరువాత ఇప్పటి వరకు తట్ట మట్టేసిన దాఖలాలు లేవు.

జిల్లాల పునర్విభజనలో భాగంగా భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా ఏర్పాటైంది. తొలుత నరసాపురంలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తే ఉభయ గోదావరి జిల్లాల వారికి అందుబాటులో ఉంటుందనే వాదన వినిపించింది. నరసాపురంతో పాటు రాజకీయ ప్రాధాన్యం ఉన్న తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం ప్రాంతాల్లో కళాశాల ఏర్పాటుకు అధికారులు స్థల పరిశీలన కూడా చేశారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే విద్యా రంగానికి చెందిన పలు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. వాటితో పోల్చితే వాణిజ్య, సాంస్కృతిక కేంద్రంగా పేరొందిన పాలకొల్లు విద్య, వైద్య రంగంలో వెనుకబడి ఉంది. ఇక్కడ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తే అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావించింది. అనంతరం 216 జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న పాలకొల్లు గ్రామీణ మండలం దగ్గులూరు-లంకలకోడేరు గ్రామాల మధ్య ఏర్పాటుకు అధికారులు భూసేకరణ చేశారు. మొత్తం 60 ఎకరాలు అవసరం కాగా 63 మంది రైతుల నుంచి సేకరించారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో కర్షకులు సైతం ముందుకు వచ్చి ఎకరా రూ.50 లక్షల చొప్పున ఇచ్చారు. కానీ సేకరించిన భూమిలో ఇప్పటి వరకు చిన్నపాటి నిర్మాణం చేపట్టలేదు.

భూసేకరణ వరకే మా బాధ్యత.. ‘భూమిని సేకరించి ఇవ్వడం వరకే మా బాధ్యత. ఆ తరువాత వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోకి వెళుతుంది’ అని పాలకొల్లు తహశీల్దార్‌ జి.మమ్మి తెలిపారు.

నిధులు మంజూరు కావాలి

‘కళాశాల నిర్మాణం కోసం భూసేకరణ పూర్తయ్యింది. పనులు ప్రారంభించేందుకు నిధులు విడుదల కావాల్సి ఉంది’ అని వైద్య ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ డీఈ ఎం.శ్రీనివాసరెడ్డి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని