logo

వినోదం.. విజ్ఞానం.. వికాసం

వేసవి సెలవుల్లో బాలబాలికలు కేవలం ఆటపాటలకే పరిమితం కాకుండా పలు రకాల అంశాల్లో నైపుణ్యం సాధించేలా చేస్తున్నాయి వేసవి శిక్షణ శిబిరాలు. పలు స్వచ్ఛంద, వివిధ శిక్షణ సంస్థల ప్రతినిధులు నగరంలోని వేర్వేరు చోట్ల శిబిరాలు ఏర్పాటు చేశారు.

Published : 26 May 2022 03:50 IST

విభిన్న అంశాల్లో శిక్షణ

బొమ్మలు వేస్తున్న బాలలు

ఏలూరు అర్బన్‌, ఏలూరు తూర్పువీధి, ఉంగుటూరు, న్యూస్‌టుడే: వేసవి సెలవుల్లో బాలబాలికలు కేవలం ఆటపాటలకే పరిమితం కాకుండా పలు రకాల అంశాల్లో నైపుణ్యం సాధించేలా చేస్తున్నాయి వేసవి శిక్షణ శిబిరాలు. పలు స్వచ్ఛంద, వివిధ శిక్షణ సంస్థల ప్రతినిధులు నగరంలోని వేర్వేరు చోట్ల శిబిరాలు ఏర్పాటు చేశారు. చిత్రలేఖనం, కంప్యూటర్‌ శిక్షణ తదితర అంశాల్లో తర్ఫీదు ఇస్తున్నారు. ● ఏలూరు ఆర్ట్‌ సొసైటీ ఆధ్వర్యంలో గాంధీనగర్‌ నగరపాలకోన్నత పాఠశాలలో 22న ప్రారంభించిన శిబిరం జూన్‌ 5 వరకు కొనసాగనుంది. చిత్రకళాకారులు మజ్జి కాంతారావు, ఎం.రాంబాబు, ఎస్‌.శ్రీనివాస్‌, పి.రేణుకేశ్వరరావు, డి.మధుసూదనరావు,, ఎన్‌.రవిబాబు చిత్రలేఖనంలో తర్ఫీదు ఇస్తున్నారు. పెద్దలకు సైతం యోగా శిక్షణ తరగతులు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఉదయం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు యోగాపై 8.30 నుంచి 10 గంటల వరకు బాలలకు చిత్రలేఖనంపై తరగతులు నిర్వహిస్తున్నారు.● గాంధీ ఆంధ్ర జాతీయ మహావిద్యాలయంలో ఉచిత కంప్యూటర్‌ శిక్షణ తరగతులు వూటుకూరి కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ చదివే విద్యార్థులకు కంప్యూటర్‌ కోర్సులు నేర్పిస్తున్నారు. 9న ప్రారంభమైన ఈ శిక్షణ శిబిరం జూన్‌ 9వ తేదీ వరకు కొనసాగనుంది.● ఏఆర్‌డీజీకే పాఠశాలలో 18న ప్రారంభించారు. వాసవి క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరం ద్వారా విద్యార్థులకు ఉచిత ఆంగ్ల విద్యాబోధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రెండో బ్యాచ్‌ను జూన్‌ 1 నుంచి ప్రారంభించనున్నారు. ● కైకరం గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి వేణుగోపాలకృష్ణ ప్రసాదరావు ఏర్పాటు చేసిన శేషవేణి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ గ్రామంలోని చిన్నారులకు పలు అంశాల్లో శిక్షణ ఇస్తోంది. చదరంగం, చిత్రలేఖనం, సంగీతం, కోలాటం, భగవద్గీత, స్పోకెన్‌ ఇంగ్లీష్‌లతో పాటు ప్రతీ ఆదివారం వ్యక్తిత్వవికాసంపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.

ఎంతో ఉపయుక్తం..

ఐదో తరగతి చదువుతున్నా. గాంధీనగర్‌ నగరపాలకోన్నత పాఠశాలలోని వేసవి శిబిరానికి నిత్యం వస్తున్నాను. చిత్రలేఖనంలో ఇచ్చే శిక్షణ ఎంతో ఉపయుక్తంగా ఉంది. ఇంటివద్ద కూడా బొమ్మలు వేయడం సాధన చేస్తున్నా. భవిష్యత్తులో మంచి చిత్రకారిణిగా ఎదగాలని ఆశిస్తున్నా. - షణ్ముఖ

చదరంగం అంటే ఆసక్తి...

చదరంగం అంటే అసక్తి. వేసవి శిక్షణ ద్వారా చదరంగంతో పాటు కోలాటం, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ నేర్చుకుంటున్నా. ప్రతి ఆదివారం వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పిస్తున్నారు. ధైర్యంగా సభలు, సమావేశాల్లో మాట్లాడగలననే నమ్మకం వచ్చింది. - ఎం.నాగ శ్రీ అంబికా, పదో తరగతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని