logo

ఆధునికీకరణ ఊసే లేదు!

కాలువల ఆధునికీకరణ పనులు ఏళ్ల తరబడి నిలిచిపోవడంతో ఇటు రైతులు, అటు స్థానికులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా రైతులకు సాగునీటిని అందించే గోస్తనీ కాలువకు ఉన్న స్లూయిస్‌ తలుపులు లేక వంతుల వారీ విధానంలో కర్షకుల

Published : 26 May 2022 03:50 IST

రూ. 8.12 కోట్ల పనులకు గ్రహణం

నిలిచిపోయిన ఎస్‌.ఇల్లిందలపర్రు లాకుల నిర్మాణం

లాకుల వద్ద ఊడిపోయిన తలుపులు

తణుకు, న్యూస్‌టుడే: కాలువల ఆధునికీకరణ పనులు ఏళ్ల తరబడి నిలిచిపోవడంతో ఇటు రైతులు, అటు స్థానికులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా రైతులకు సాగునీటిని అందించే గోస్తనీ కాలువకు ఉన్న స్లూయిస్‌ తలుపులు లేక వంతుల వారీ విధానంలో కర్షకుల అవస్థలు అన్నీఇన్ని కావు. సుమారు 25 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే సోమరాజు ఇల్లిందలపర్రు, వేల్పూరు మధ్యన ఉన్న లాకులు శిథిలస్థితికి చేరాయి.

నిలిచిన పనులు.. గోదావరి పశ్చిమ డెల్టా ఆధునికీకరణ పనుల్లో భాగంగా జలవనరుల శాఖ గోస్తనీ కాలువపై ఎస్‌.ఇల్లిందలపర్రు వద్ద లాకుల ఏర్పాటు కోసం రూ. 8.12 కోట్ల అంచనా వ్యయంతో 2018లో అప్పటి మంత్రి పితాని శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు 20 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. రూ. 60 లక్షల మేర బిల్లులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారు మధ్యలో వదిలివేశారు. పునాదుల ఊచలు సైతం తుప్పు పట్టి కనిపిస్తున్నాయి.

రైతులకు తప్పని ఇబ్బందులు.. సోమరాజు ఇల్లిందలపర్రు లాకు పరిధిలో ని సుమారు 25 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు బ్రిటిష్‌ హయాంలో లాకులు ఏర్పాటు చేశారు. అక్కడే నీటి పారుదల శాఖ అధికారులు, సిబ్బందికి ఏర్పాటు చేసిన నివాస సముదాయాలు శిథిల స్థితికి చేరాయి. లాకుల వద్ద తలుపులు మరమ్మతులకు గురవడంతో వాటిని తొలగించారు. మూడుకు ఇప్పుడు ఒకటి మాత్రమే పని చేస్తోంది. ప్రధానంగా వరదలకాలం మినహాయించి మిగిలిన సమయంలో నీటిని కిందకు వదిలేస్తారు. అక్కడి వంతెన సైతం కుంగిపోయి రాకపోకలకు అనుకూలంగా లేదు. దీంతో చుట్టు తిరిగి వెళ్లాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితిపై జల వనరుల శాఖ డీఈ కె.రవీంద్రబాబు ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ లాకుల పనులు చేపట్టేందుకు మూడుసార్లు టెండర్లు పిలిచినా ఎవరు రాలేదని తెలిపారు. మంజూరైన నిధులు కూడా వెనక్కి మళ్లాయని, కొత్తగా ప్రతిపాదించాలని వెల్లడించారు.

అసంపూర్తిగా దర్శనమిస్తున్న లాకుల పనులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని