logo

స్వచ్ఛ జలం.. ఎంతో దూరం

పాలకోడేరు మండలంలో రేలంగి ఉత్తర, దక్షిణ పంట కాలువలకు శివారున మోగల్లు గ్రామం ఉంది. కాలువల్లో ఎగువ నుంచి కొట్టుకు వచ్చే వ్యర్థాలతో పాటు ఆక్వా సాగు ప్రభావంతో గ్రామంలో చెరువు జలాలు కలుషితమవుతున్నాయి. ఈ గ్రామ జనాభా సుమారు 11 వేలు. 1150 కుళాయి

Published : 27 May 2022 03:43 IST

బేతపూడి చెరువులో రుంగు మారిన నీరు

పాలకోడేరు మండలంలో రేలంగి ఉత్తర, దక్షిణ పంట కాలువలకు శివారున మోగల్లు గ్రామం ఉంది. కాలువల్లో ఎగువ నుంచి కొట్టుకు వచ్చే వ్యర్థాలతో పాటు ఆక్వా సాగు ప్రభావంతో గ్రామంలో చెరువు జలాలు కలుషితమవుతున్నాయి. ఈ గ్రామ జనాభా సుమారు 11 వేలు. 1150 కుళాయి కనెక్షన్లు ఉండగా వాటి ద్వారా సరఫరా చేసే నీటిని ఇంటి అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. తాగునీటి కోసం ప్రైవేటు ఆర్వో ప్లాంట్లను ఆశ్రయించాల్సి వస్తోంది.

భీమవరం మండలం శివారు గ్రామాల్లో ఎల్‌వీఎన్‌ పురం ఒకటి. ఇక్కడి ఓవర్‌హెడ్‌ ట్యాంకు శిథిలం కావడంతో కొద్ది రోజుల కిందట కూల్చివేశారు. అప్పటి నుంచి నేరుగా కాలువ నీటినే కుళాయిల సరఫరా చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. అధికారులు మాత్రం ఫిల్టర్‌బెడ్‌లో శుద్ధి చేస్తున్నామని పేర్కొంటున్నారు. ఈ నీళ్లు తాగేందుకు అనువుగా లేకపోవడంతో ప్రజలు తాగునీటి కొనుగోలు చేస్తున్నారు.

భీమవరం గ్రామీణ, పెనుమంట్ర, న్యూస్‌టుడే : చుట్టూ జలాలతో కళకళలాడే పంట కాలువలు, రక్షిత మంచి నీటి పథకాలు ఉన్నా కొన్ని గ్రామాల్లో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. కుళాయి ద్వారా సరఫరా చేసే నీరు స్వచ్ఛంగా లేకపోవడంతో స్థానికులు ప్రైవేటు ట్యాంకర్లు, ఆర్వో ప్లాంట్లపై ఆధారపడుతున్నారు.

ఇదీ పరిస్థితి.. వేసవి వేళ చెరువులను నింపడంపైనే దృష్టి పెడుతున్న యంత్రాంగం జలాల శుద్ధిపై మాత్రం దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చాలా చోట్ల ఫిల్టర్‌బెడ్లకు మరమ్మతులు చేయకపోవడం. ఓవర్‌హెడ్‌ ట్యాంకులను నెలల తరబడి చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భీమవరం, ఆకివీడు, కాళ్ల, మొగల్తూరు, నరసాపురం, వీరవాసరం, పాలకోడేరు, పెనుమంట్ర, అత్తిలి, పాలకొల్లు, పోడూరు, ఆచంట, పెనుగొండ తదితర డెల్టా మండలాల్లో చాలా చోట్ల చెరువుల్లో నీరు తరచూ రంగు మారుతోంది. పంట కాలువల్లోకి ఆక్వా చెరువుల వ్యర్థాలను వదిలేయడమే దీనికి కారణమని అధికారులు చెబుతుంటారు. దీనికి నిర్వహణ లోపాలు తోడవుతున్నాయి. చెరువులు, రక్షిత నీటి పథకాలు, ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్వహణకు జల్‌జీవన్‌ మిషన్‌ నిధులు సిద్ధంగా ఉన్నా వాటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది.

పైపుల చెరువు వద్ద నీటి కోసం పాలకోడేరు మండల వాసుల నిరీక్షణ​​​​​​​

పాలకోడేరు, మోగల్లు, విస్సాకోడేరు, పెన్నాడఅగ్రహారం, శృంగవృక్షం, కొండేపూడి, మైప గ్రామాల్లో కుళాయిల ద్వారా సరఫరా చేసే నీరు అపరిశుభ్రంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ గ్రామాల్లో అధికశాతం మంది ప్రైవేటు కేంద్రాలకు వెళ్లి తాగునీటిని డబ్బాలతో తెచ్చుకుంటున్నారు. ● గుత్తులవారిపాలెం, వేండ్ర, వేండ్రఅగ్రహారం, మోగల్లు, పాలకోడేరు, విస్సాకోడేరు గ్రామాల ప్రజలకు సుమారు 4 కి.మీ దూరంలోని భీమవరం పైపుల చెరువు ప్రాంతంలో రక్షిత పథకం నుంచి వచ్చే నీటిని, ప్రధాన పైపులైను వాల్వుల నుంచి వచ్చే లీకేజీ నీటిని జాగ్రత్తగా పట్టుకుని తెచ్చుకుంటున్నారు. ‘స్వచ్ఛమైన తాగునీరు అందని చోట్ల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.’అని గ్రామీణ నీటి సరఫరా విభాగం జిల్లా అధికారి రామస్వామి తెలిపారు.

8 కిలోమీటర్లు వెళ్లి వస్తున్నాం

మోగల్లు పంచాయతీ పరిధి గుత్తులవారిపాలెంలో కుళాయిలకు బోరు నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని తాగితే కీళ్ల నొప్పులు వస్తున్నాయి. దీంతో పైపుల చెరువు ప్రాంతంలో ఉన్న భీమవరం పురపాలక రక్షిత పథకం నుంచి తెచ్చుకుంటున్నాం. నిత్యం ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. - జి.రామకృష్ణ, గుత్తులవారిపాలెం●

జిల్లాలో పంచాయతీ మంచి నీటి చెరువులు 274

భారీ రక్షిత మంచి నీటి పథకాలు 23

శుద్ధి చేసిన తాగునీరు అందని గ్రామాలు 88

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని