logo

స్పందన అంతంత మాత్రమే!

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజలు తమ సమస్యను స్పందనలో అర్జీ పెట్టుకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆ మేరకు పురపాలక అధికారులకు కూడా ఆదేశాలందాయి. కానీ క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదు. మొక్కుబడిగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చిన అర్జీలను పరిష్కరించకుండా పక్కన పెడుతున్నారు.

Published : 27 Jun 2022 05:31 IST

తాడేపల్లిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే

తాడేపల్లిగూడెం: మున్సిపల్‌ కార్యాలయంలో ఖాళీగా కుర్చీలు (పాత చిత్రం)
 

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజలు తమ సమస్యను స్పందనలో అర్జీ పెట్టుకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆ మేరకు పురపాలక అధికారులకు కూడా ఆదేశాలందాయి. కానీ క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదు. మొక్కుబడిగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చిన అర్జీలను పరిష్కరించకుండా పక్కన పెడుతున్నారు. కొన్నిసార్లు ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారుల సైతం హాజరు కాని పరిస్థితి. దిగువ స్థాయిలో సిబ్బందే అర్జీలను తీసుకుంటున్నారు. జిల్లాలోని తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం తదితర పట్టణాల్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి ఆదరణ కొరవడింది. నిర్ణీత సమయంలో పరిష్కరించకపోవడంతో ప్రజల్లో విముఖత ఏర్పడింది. దీంతో స్పందనకు అర్జీలు కరవయ్యాయి. వచ్చినా అపరిష్కృతంగా మిగిలిపోయాయి.  
ఇదీ పరిస్థితి.. తాడేపల్లిగూడెం పట్టణంలో వార్డు వార్డునా.. వీధి వీధినా శతకోటి సమస్యలు ఉన్నాయి. కానీ గడిచిన మూడు వారాల్లో 23 అర్జీలు మాత్రమే వచ్చాయి. వీటిలో ఎక్కువగా ఇంటి స్థలాలు, టిడ్కో ఇళ్లు, పింఛన్లు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర సమస్యలపై ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 15కిపైగా పరిష్కారం కాకుండా ఉండటం గమనార్హం. అధికారులు వీటిపై శ్రద్ధ తీసుకోకపోవడంతో చిన్నచిన్న సమస్యలు కూడా పరిష్కారం కాకుండా మిగిలిపోతున్నాయి. అధికారులు పూర్తిస్థాయిలో స్పందించకపోవడంతో అర్జీ పెట్టుకోవడానికి ప్రజలు రావడం లేదు. దీంతో వారి కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.


ఒక్క అర్జీ రాని వైనం
తణుకు, న్యూస్‌టుడే: గత మూడు వారాల నుంచి తణుకు పురపాలక సంఘ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తుండగా ఒక్క అర్జీ కూడా రాలేదు. మున్సిపల్‌ అధికారులు స్పందన కార్యక్రమానికి అందుబాటులో ఉంటున్నా ఒక్క అర్జీ కూడా రాకపోవడం గమనార్హం. క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదు. మరికొంత మంది నేరుగా కలెక్టర్‌కు అందిస్తున్నారు.


బీమా సొమ్ము కోసం..
తాడేపల్లిగూడెంలోని రెండో వార్డుకు చెందిన షేక్‌ షాహెదా భర్త షేక్‌ మీర్జావలి గత సంవత్సరం మృతిచెందారు. వై.ఎస్‌.ఆర్‌. బీమా కోసం దరఖాస్తు చేసుకున్నా... ఇప్పటి వరకు బీమా డబ్బులు రాలేదు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తనకు బీమా సొమ్ములు ఇప్పించాలని కోరుతూ 20 రోజుల కిందట స్పందన కార్యక్రమంలో అర్జీ పెట్టుకున్నారు. రోజుల గడుస్తున్నా పరిష్కారం కాలేదు. చివరకు పురపాలక అధికారులు  బ్యాంకు అధికారులనే అడగాలని సూచించడంతో ఆమె బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.


మూడు నెలల్లో 60
పాలకొల్లు పట్టణం, న్యూస్‌టుడే: పురపాలక సంఘంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘స్పందన’లో అర్జీలు పెట్టుకునేవారు కరవయ్యారు. ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు అంటే మూడు నెలలకుగాను 60 వినతులు మాత్రమే అందాయి. 80 వేల జనాభా ఉన్న పురపాలకసంఘంలో నెలకు 20 మాత్రమే అందుతున్నాయి. వీటిలో ఎక్కువగా తాగునీరు, రహదారులు, విద్యుద్దీపాలు, సమస్యలకు సంబంధించినవి ఉంటున్నాయి. ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇప్పించాలంటూ పదుల సంఖ్యలో అర్జీలు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని