logo

ఉద్యమాల గడ్డపై.. త్యాగధనుల స్మృతిలో..!

ఉద్యమాల గడ్డగా పేరొందిన భీమవరంలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వారోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద, ప్రజా సంఘాల భాగస్వామ్యంతో జులై 4వ తేదీ వరకు వేడుకలు జరగనున్నాయి. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల జీవిత చరిత్రలు, త్యాగాలను తెలియజెప్పేలా

Published : 27 Jun 2022 05:31 IST

నేటి నుంచి భీమవరంలో అల్లూరి జయంతి వారోత్సవాలు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే

సీతారామరాజు విగ్రహం ఏర్పాటుచేయనున్న ఏఎస్‌ఆర్‌ పార్కు
 

ఉద్యమాల గడ్డగా పేరొందిన భీమవరంలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వారోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద, ప్రజా సంఘాల భాగస్వామ్యంతో జులై 4వ తేదీ వరకు వేడుకలు జరగనున్నాయి. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల జీవిత చరిత్రలు, త్యాగాలను తెలియజెప్పేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అల్లూరి సీతారామరాజు కుటుంబం నివసించిన పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో వేడుకలను ప్రారంభిస్తారు.
* తొలిరోజు పట్టణంలోని డాక్టర్‌ బీవీరాజు మార్గ్‌లో విష్ణు ఎడ్యుకేషనల్‌ సొసైటీకి చెందిన విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. 1000 మందితో భారీ ప్రదర్శన చేపట్టేలా విద్యా శాఖ అధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. చింతలపాటి బాపిరాజు స్మారకోన్నత పాఠశాల ప్రాంగణంలో రోజూ సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు, దేశభక్తి గీతాలాపన కార్యక్రమాలు ఉంటాయని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్‌.వెంకటరమణ చెప్పారు.
* 29న 125 అడుగుల పొడవైన జాతీయ జెండాతో ఊరేగింపు, 30న సైకిల్‌ యాత్ర నిర్వహిస్తారు.
ఎందరో మహనీయులు
స్వాతంత్య్రోద్యమ కాలంలో ఆంగ్లేయుల తుపాకీ గుళ్లకు బలైన భరతమాత ముద్దుబిడ్డలను భీమవరం పట్టణం కళ్లారా చూసింది. అలనాడు మహాత్మా గాంధీ పిలుపు మేరకు భీమవరం పరిసర ప్రాంతాలకు చెందిన ఉద్యమకారులంతా ఒకేచోటకు చేరుకునేవారు. ఉద్యమం ఎలా సాగాలో, నాయకత్వం వహించేవారి మాట జవదాటకుండా ఎలా నడుచుకోవాలో ముందుగానే నిర్ణయించుకునేవారు. పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు కోసం కాకుండా స్వాతంత్య్ర సాధననే లక్ష్యంగా ఉద్యమించిన వారు ఎందరో ఉన్నారు.

పిన్న వయసులోనే..

1942 ఆగస్టులో జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో భీమవరంలో పెద్ద ఎత్తున నిరసనలు ప్రదర్శనలు జరిగాయి. మహాత్ముని పిలుపు మేరకు పట్టణానికి చెందిన డాక్టర్‌ సుభద్రాదేవి తల్లిదండ్రులు ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యారు. అదే సమయంలో సుభద్రాదేవి భీమవరం కోర్టు ఆవరణలోకి వెళ్లి ఉద్యోగాలు వదిలి ఉద్యమంలోకి రావాలంటూ మేజిస్ట్రేటు ఎదుట బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో ఆమె రెండేళ్ల కారాగార శిక్షకు గురయ్యారు. రాయవెల్లూరులోని మహిళా కారాగారానికి తీసుకెళ్లారు. ఆ జైలులో ఉన్న వారిలో అతిపిన్నవయస్కురాలు కావడంతో అప్పటి మద్రాసు గవర్నరు ఆమె శిక్షను తగ్గించి మూడు నెలల తర్వాత విడుదల చేశారు. ప్రస్తుతం 94 ఏళ్ల వయసులోనూ ఆమె సేవలను కొనసాగిస్తున్నారు.
రెండో బార్డోలిగా.. పన్నుల నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న వారిలో అత్యధికులు పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవారే. ఆ ఉద్యమాన్ని గుజరాత్‌లోని బార్డోలిలో మహాత్మాగాంధీ ప్రారంభించారు. వెనువెంటనే ఇక్కడి నాయకులు ఆ ఉద్యమాన్ని చేపట్టి విజయవంతంగా నిర్వహించడంతో భీమవరాన్ని రెండో బార్డోలి అని మహాత్ముడు కొనియాడారు.

* 1942 ఆగస్టు 17న భీమవరం తాలూకాఫీసు ప్రాంగణం క్విట్‌ఇండియా సమావేశానికి వేదికైంది. ఉద్యమ నాయకులు భూపతిరాజు సుబ్బతాతరాజు, కాంగ్రెస్‌ కార్యదర్శి గొట్టుముక్కల రామచంద్రరాజు, ఉద్యమకారులు ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ సమయంలో జరిగిన పోలీసుల కాల్పుల్లో భీమవరం మండలం చినఅమిరం గ్రామానికి చెందిన బలరామరాజు అమరుడయ్యారు. వేమూరి హనుమంతరావు, తనికెళ్ల చలపతి, డాక్టర్‌ పాలకోడేటి సత్యనారాయణశర్మ, ముష్ఠి సుబ్రహ్మణ్యం, తటవర్తి కృష్ణమూర్తి ఉద్యమంలో పాల్గొన్నారు.
విప్లవ జ్యోతి.. సాయుధ పోరాటంతోనే స్వాతంత్య్ర సాధ్యమని నమ్మిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు బాల్యంలో ఆయన కుటుంబం పాలకోడేరు మండలం మోగల్లులో నివసించింది. నరసాపురం, భీమవరం మండలంలోని కొవ్వాడ అన్నవరం గ్రామాల్లోనూ కొద్ది రోజులు ఉన్నారు.

శాసనోల్లంఘన ఉద్యమంలో..
శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా 1932 జూన్‌ 27న భీమవరంలో సమావేశాన్ని పసల కృష్ణమూర్తి అధ్యక్షతన జరపాలని నిర్ణయించారు. ఈ విషయం తెలిసి ఉద్యమకారులు పోలీసులు అక్కడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అంజిలక్ష్మి, కాళీపట్నం కొండయ్య, గారపాటి సత్యనారాయణ, ఉద్దరాజు మాణిక్యాంబ, పసల కృష్ణమూర్తి తదితర యోధులు చేలగట్లు వెంబడి భీమవరం చేరుకున్నారు. తాలూకాఫీసు భవనం పైకి ఎక్కి త్రివర్ణ పతాకం ఎగురవేశారు. వందేమాతరం అంటూ నినదిస్తూ గాంధీజీకి జైకొట్టారు. ఆరు నెలల గర్భిణిగా ఉన్న అంజిలక్ష్మి కూడా జెండా ఎగురవేసి కారాగార శిక్షకు గురయ్యారు. జైలులోనే ఆమె కుమార్తెకు జన్మనివ్వగా కృష్ణభారతిగా నామకరణం చేశారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని