logo

అడుగడుగునా అవరోధాలు!

ముందస్తు సాగుకు అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్నాయి. కాలువలకు నీళ్లు వదిలి 17 రోజులు కావస్తున్నా ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ ప్రకటనలు, అధికారుల మాటలు విని నారుమళ్లు పోసిన అన్నదాతలు నీళ్ల కోసం కాలువల వద్ద పడిగాపులు కాస్తున్నారు.ప్రస్తుత ఖరీఫ్‌లో ముందస్తు సాగు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. మునుపెన్నడూ లేని విధంగా కాలువలకు ముందుగానే సాగునీరు

Updated : 27 Jun 2022 05:32 IST

 17 రోజులైనా కానరాని కృష్ణమ్మ పరవళ్లు
 కొనసాగుతున్న కాలువ మరమ్మతులు
ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే

చెత్త, గుర్రపుడెక్కతో  కృష్ణా కాలువ

ముందస్తు సాగుకు అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్నాయి. కాలువలకు నీళ్లు వదిలి 17 రోజులు కావస్తున్నా ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ ప్రకటనలు, అధికారుల మాటలు విని నారుమళ్లు పోసిన అన్నదాతలు నీళ్ల కోసం కాలువల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
ప్రస్తుత ఖరీఫ్‌లో ముందస్తు సాగు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. మునుపెన్నడూ లేని విధంగా కాలువలకు ముందుగానే సాగునీరు వదులుతున్నామని జల వనరుల శాఖ మంత్రి చెప్పారు. అయితే సకాలంలో కాలువ మరమ్మతులు పూర్తికాకపోవడంతో కృష్ణమ్మ ప్రవాహం మందగించింది. నారుమళ్లు పోసిన అన్నదాతలు నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. 10న నీళ్లు వదిలారా.. ఇంకా ఏలూరుకు చేరుకోలేదేమని రైతులు అడుగుతుంటే అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. ముందస్తులో భాగంగా ఈ నెల 10న కృష్ణా- ఏలూరు కాలువకు నీటిని విడుదల చేశారు. సాధారణంగా నీరు వదిలిన మూడో రోజుకు ఏలూరుకు చేరుతుంది. 17 రోజులైనా నీరు చేరలేదు. కాలువకు నీటిని కట్టేసిన సమయంలో చేయాల్సిన పనులను నీరు వదిలిన తరువాత ప్రారంభించారు. పనులు కొనసాగుతుండటంతో పాటు తక్కువ నీటిని విడుదల చేయడంతో దిగువకు రావడం లేదు. 

సాగుతున్న పనులు.. ఏటా ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌లో భాగంగా కాలువలు, లాకులకు మరమ్మతులు, తూడు, గుర్రపుడెక్క తొలగింపు వంటివి చేపడుతుంటారు. ఈ ఏడాది కూడా కృష్ణా- ఏలూరు కాలువలో పెరికీడు, ఏలూరు సెక్షన్ల పరిధిలో మరమ్మతులు చేపట్టారు. పెరికీడు సెక్షన్‌ పరిధిలోని కాలువలో దుక్కి దున్నడం, తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. ఏలూరు గ్రీన్‌ సిటీ నుంచి కొమడవోలు వంతెన వరకు పూడిక తొలగింపు పనుల్ని ఇటీవల మొదలుపెట్టారు. దెబ్బతిన్న పడమర లాకుల షట్టర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలి. రూ.60 లక్షల అంచనాలతో చేయాల్సిన పనులు ఇంకా మొదలు పెట్టలేదు. కృష్ణా ఏలూరు కాలువకు ఉపకాలువలైన ముప్పర్రు, మాదేపల్లి, చాటపర్రు, సీతంపేట ఛానల్‌లో తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులు చేసేందుకు రూ.30 లక్షలు అంచనాలతో అనుమతులు ఇచ్చారు. ఈ పనులను ఇంకా ప్రారంభించలేదు. ఫలితంగా రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
సాగునీటికి ఎదురుచూపులు.. కృష్ణా- ఏలూరు కాలువ కింద జిల్లాలో 55 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ముందస్తుగా సాగునీరు వదిలారని రైతులు చాలాచోట్ల వేసవి దుక్కులు దున్ని ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధమయ్యారు. విత్తనాలు చల్లి నారుమళ్లను సిద్ధం చేశారు. నీటి కోసం అధికారులను అడుగుతుంటే అదిగో ఇదిగో వస్తాయని చెబుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విత్తనాలు చల్లా.. కాలువకు నీరు వదిలారని ఆరెకరాలకు సరిపడా వరి విత్తనాలు చల్లా. ఏటా కాలువకు నీరు వదిలిన మూడు నాలుగు రోజుల్లో చేరేది. నీరు రాగానే నారుమళ్లను తడి అందించేవాళ్లం. రోజులవుతున్నా కాలువకు నీరు రాలేదు. నీరు అందకుంటే నారుమడి దెబ్బతింటుంది. మళ్లీ విత్తనాలు కొని నారుమళ్లు పోయాలంటే అదనపు భారం అవుతుంది. - శివయ్య, వెంకటాపురం
రెండు రోజుల్లో నీరు.. కాలువలకు మరమ్మతులు కొనసాగుతున్నాయి. కృష్ణా నది నుంచి ప్రస్తుతం 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీనిని 700 క్యూసెక్కులకు పెంచుతున్నారు. రెండు రోజుల్లో కాలువలకు నీరు చేరుతుంది. రైతులు నారుమళ్లకు సిద్ధం చేసుకోవచ్చు.

  - సుబ్రహ్మణ్యం, ఏఈ, ఏలూరు కాలువ

నారుమడికి సిద్ధం చేసిన పొలం
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు