logo

కార్యదర్శుల బదిలీలు ఎలా?

సాధారణ బదిలీలకు గడువు సమీపిస్తుండటంతో ఉద్యోగులు తమకు నచ్చిన చోటుకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ముందుగా ఈ నెల 17లోగా బదిలీలు పూర్తి చేయాలనుకున్నా.. గడువు తేదీని  30 వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శుల బదిలీల విషయం కమిషనర్‌ తాజా ఆదేశాలతో సంక్లిష్టంగా మారింది. గ్రేడ్‌లకు అనుగుణంగా

Published : 27 Jun 2022 05:31 IST

 కమిషనర్‌ ఆదేశాలతో సంక్లిష్టంగా మారిన ప్రక్రియ!  
 జిల్లా పంచాయతీ శాఖలో కొనసాగుతున్న కసరత్తు

ఏలూరు వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: సాధారణ బదిలీలకు గడువు సమీపిస్తుండటంతో ఉద్యోగులు తమకు నచ్చిన చోటుకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ముందుగా ఈ నెల 17లోగా బదిలీలు పూర్తి చేయాలనుకున్నా.. గడువు తేదీని  30 వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శుల బదిలీల విషయం కమిషనర్‌ తాజా ఆదేశాలతో సంక్లిష్టంగా మారింది. గ్రేడ్‌లకు అనుగుణంగా క్లస్టర్లు కేటాయించాలని ఇచ్చిన ఉత్తర్వుల అమలులో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయా క్లస్టర్లకు అనుగుణంగా గ్రేడ్‌ల వారీగా కార్యదర్శులు లేకపోవడమే ఇందుకు కారణం.
గ్రామ పంచాయతీల ఆదాయం, విస్తీర్ణాలను పరిగణనలోకి తీసుకుని గ్రేడ్‌ 1 నుంచి 4 వరకు విభజించారు. పరిపాలన సౌలభ్యం కోసం పంచాయతీలను క్లస్టర్లుగా ఏర్పాటు చేసి వాటి స్థాయికి అనుగుణంగా కార్యదర్శులను నియమించారు. ప్రస్తుత సాధారణ బదిలీలు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో 909 గ్రామ పంచాయతీలకు గాను మొత్తం 591 క్లస్టర్లు ఉన్నాయి. గ్రేడ్‌ 1 నుంచి గ్రేడ్‌ 5 వరకు 989 మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు. వీరితో పాటు జిల్లా పంచాయతీ కార్యాలయం, నాలుగు డివిజన్‌ పంచాయతీ కార్యాలయాల్లో పనిచేసే సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, టైపిస్టులు, దిగువ శ్రేణి సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం బదిలీలకు కసరత్తు సాగుతోంది. ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియలో అధికారులు నిమగ్నమయ్యారు. యాభై శాతం మందికి స్థానచలనం కలగనున్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఎవరి స్థాయిలో వారు బదిలీ కోసం నేతల సిఫార్సులు చేయించుకుంటున్నట్లు సమాచారం.

గ్రేడ్‌ల వారీగా లేరు
అధికారిక గణాంకాల ప్రకారమున్న క్లస్టర్లకు గ్రేడ్‌ 1 కార్యదర్శులు 244 మంది, గ్రేడ్‌ 2లో 145 మంది, గ్రేడ్‌ 3లో 144 మంది, గ్రేడ్‌ 4లో 58 మంది ఉండాలి. అయితే పంచాయతీల గ్రేడ్‌ల వారీ పోస్టులకు అనుగుణంగా కార్యదర్శులు లేరు. గ్రేడ్‌ 1 కేడర్‌లో 57 పోస్టులు ఖాళీలు ఉండగా.. గ్రేడ్‌ 2లో 85, గ్రేడ్‌ 3లో 28 ఉన్నాయి. గ్రేడ్‌ 4లో మంజూరైన పోస్టులు 58 ఉండగా 105 మంది పని చేస్తున్నారు. అంటే అదనంగా 47 మంది ఉన్నారు. అవసరాలకు తగ్గట్టు గ్రేడ్‌ల వారీ కార్యదర్శులు లేకపోవడంలో గతంలో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ బదిలీల విషయంలో ఒక గ్రేడ్‌ వరకు సడలింపు ఇస్తూ ఆదేశాలు జారీచేశారు. గ్రేడ్‌ 4 కార్యదర్శిని గ్రేడ్‌ 3కి, గ్రేడ్‌ 3 వారిని గ్రేడ్‌ 2కు నియమించవచ్చు. ఇలా గడిచిన రెండు మూడేళ్లుగా పరిపాలన సౌలభ్యం కోసం పంచాయతీల గ్రేడ్‌లతో నిమిత్తం లేకుండా కార్యదర్శులను నియమిస్తూ వచ్చారు. తాజాగా ఏ స్థాయి కార్యదర్శిని అదే స్థాయి పంచాయతీకి నియమించాలని స్పష్టం చేయడం సమస్యలకు కారణమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని