మరణ వాంగ్మూలమంటూ స్వీయ వీడియో

జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన బుల్లితెర నటుడు షేక్‌ చాన్‌బాషా ‘తాను చనిపోతున్నాను. ఇదే నా మరణ వాంగ్మూలం’ అంటూ సామాజిక మాధ్యమాల్లో ఆదివారం అప్‌లోడ్‌ చేసిన స్వీయ వీడియో వైరల్‌ అయ్యింది. అనంతరం అతడు చికిత్స పొందుతున్న ఏలూరు జిల్లా కేంద్ర ఆసుపత్రి నుంచి అదృశ్యమయ్యాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు.

Updated : 27 Jun 2022 05:34 IST

సామాజిక మాధ్యమాల్లో  ఉంచిన బుల్లితెర నటుడు

డాంగేనగర్‌ : వివాదంలో ఉన్న స్థలంలో నిర్మాణం
 

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన బుల్లితెర నటుడు షేక్‌ చాన్‌బాషా ‘తాను చనిపోతున్నాను. ఇదే నా మరణ వాంగ్మూలం’ అంటూ సామాజిక మాధ్యమాల్లో ఆదివారం అప్‌లోడ్‌ చేసిన స్వీయ వీడియో వైరల్‌ అయ్యింది. అనంతరం అతడు చికిత్స పొందుతున్న ఏలూరు జిల్లా కేంద్ర ఆసుపత్రి నుంచి అదృశ్యమయ్యాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే ఎన్‌ఆర్‌పేటలో చాన్‌బాషాని గుర్తించిన కుటుంబ సభ్యులు నచ్చజెప్పి ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన నేపథ్యం ఇలా.. జంగారెడ్డిగూడెం డాంగేనగర్‌లో చాన్‌బాషా చిన్న షెడ్‌ నిర్మించారు. అయితే ఆ స్థలం తమదంటూ కొందరు ఇటీవల కూల్చారు. ఈ సందర్భంగా జరిగిన గొడవలో 28వ వార్డు కౌన్సిలర్‌ కనుమూరి లావణ్య చాన్‌బాషాను నెట్టడంతో కింద పడ్డారు. ఈ దృశ్యాలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఈ ఘటనలో అనారోగ్యానికి గురైన అతడు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా విడుదల చేసిన స్వీయ వీడియోలో తాను కట్టుకున్న షెడ్‌ను పడగొట్టి సామగ్రిని పట్టుకుపోయారని వాపోయారు. ఆ స్థలంలో శనివారం అర్ధరాత్రి నుంచి మరొకరు నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయమై పోలీసు, రెవెన్యూ అధికారులకు చరవాణి ద్వారా సమాచారం ఇచ్చినా చెప్పినా న్యాయం జరగడం లేదని ఆరోపించారు. ఇప్పటికే స్థల గొడవకు సంబంధించి 28వ వార్డు కౌన్సిలర్‌ లావణ్యతో సహా ఆరుగురిపై జంగారెడ్డిగూడెం ఎస్‌ఐ సాగర్‌బాబు సుమోటోగా కేసు నమోదు చేశారు.
ఇద్దరి పేరిట అనుభవ ధ్రువపత్రాలు
పట్టణంలోని డాంగేనగర్‌లో వివాదాస్పద స్థలం కొండగుట్ట పోరం బోకు అని ఆర్డీవో ఝాన్సీరాణి తెలిపారు. ఈ స్థలానికి గతంలో ఇద్దరి పేర్లతో అనుభవ ధ్రువపత్రాలు ఒకే తహశీల్దారు జారీ చేశారన్నారు. ఇవి అసలైనవా.. కావా అన్న విషయం పరిశీలిస్తున్నామని చెప్పారు. అర్ధరాత్రి వేళ హడావుడిగా నిర్మాణం చేస్తున్న విషయం తెలిసింది. వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు తహశీల్దారు నవీన్‌కుమార్‌ క్షేత్రస్థాయి విచారణ నిర్వహించారని పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌కు నివేదిక అందజేస్తామని ఆర్డీవో వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని