logo

అందరూ ఉన్నా ఒంటరి జీవితమే

కడుపున పుట్టిన వారే కానివారవుతున్నారు. ఆస్తులు ఇమ్మని కొందరు వేధిస్తోంటే.. ఇచ్చాక బయటకు నెట్టేసే వారు మరికొందరు. ప్రయోజకులుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను అందరూ ఉన్న అనాథలుగా మార్చేస్తూ మానవత్వానికే మచ్చ తీసుకొస్తున్నారు. ఇలాంటి వారి గురించి ఏదో సందర్భాల్లో మనం వింటూనే ఉన్నాం.

Updated : 28 Jun 2022 07:02 IST

అవసాన దశలో పండుటాకుల విలవిల

ఉంగుటూరు, న్యూస్‌టుడే

ఆస్తి పంపకం చేసిన తర్వాత కుమారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఓ తండ్రి మే 2వ తేదీన ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

కుమార్తెలు, కుమారులు ఉన్నా జంగారెడ్డిగూడేనికి చెందిన ఓ వృద్ధురాలు అనాథగానే బతుకు నెట్టుకొస్తుంది.

ఏలూరు గ్రామీణ మండలం పెద్దకోడెల ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు తనను ఎవరూ పట్టించుకోవడం లేదని రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రైల్వే పోలీసులు కాపాడి ఆమెను వృద్ధుల సంరక్షణ కేంద్రంలో చేర్చారు.

కడుపున పుట్టిన వారే కానివారవుతున్నారు. ఆస్తులు ఇమ్మని కొందరు వేధిస్తోంటే.. ఇచ్చాక బయటకు నెట్టేసే వారు మరికొందరు. ప్రయోజకులుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను అందరూ ఉన్న అనాథలుగా మార్చేస్తూ మానవత్వానికే మచ్చ తీసుకొస్తున్నారు. ఇలాంటి వారి గురించి ఏదో సందర్భాల్లో మనం వింటూనే ఉన్నాం. మనవళ్లు, మనవరాళ్లతో ప్రశాంతంగా శేషజీవితాన్ని గడపాల్సిన వారు బతుకు భారంగా నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 40 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. వారిలో సుమారు 6.75 లక్షల మంది వృద్ధులున్నారు. అయినవారు ఆదరించక.. బంధువులు పట్టించుకోకపోవడంతో వందలాది మంది వృద్ధాశ్రమాల్లో తలదాచుకుంటున్నారు.

ఆప్యాయతలు మాయం..

సమాజ పోకడ, మనిషి ఆలోచనల్లో మార్పులొచ్చాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండటంతో అందరూ కలిసికట్టుగా ఉండేవారు. కష్టసుఖాలను ఒకరికొకరు పంచుకునేవారు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవడం.. ఆదరించేవారు లేకపోవడంతో చాలామంది రోడ్డున పడుతున్నారు. కొందరు ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నారు. ఇటీవల వీటి సంఖ్య పెరుగుతోంది. నిరాదరణకు గురైనా కొందరు ఆత్మాభిమానంతో న్యాయం కోసం పోరాడుతున్నారు.

ఎవరిని సంప్రదించాలి..

ఆస్తులు కోసం తల్లిదండ్రులపై కుమారులు, కుమార్తెలు భౌతిక దాడులకు పాల్పడినా, తల్లిదండ్రులను ఒంటరిగా వదిలేసిన జిల్లా, డివిజన్‌ స్థాయిలో ఏర్పాటు చేసిన ట్రైబ్యునల్‌లను ఆశ్రయించవచ్ఛు 90 రోజుల్లో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాల్సి ఉంటుంది. టోల్‌ ఫ్రీ నంబర్‌ 14567 ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్ఛు లేదా స్థానికంగా ఉన్న వృద్ధుల సంక్షేమ సంఘాలను, పోలీసులకు ఫిర్యాదు చేయవచ్ఛు

అవగాహన కల్పించాలి..

వృద్ధులపై తరచూ జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు, వేధింపులు జరగకుండా వారిశేష జీవితానికి భరోసా కల్పించాలంటే 2007 తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం వృద్ధుల సంరక్షణ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ చట్టానికి సంబంధించి విషయాలను నోటీసు బోర్డుల్లో పెట్టాలి. వృద్ధుల సంరక్షణ కోసం రాష్ట్ర కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలి. - వెంపరాల నారాయణ మూర్తి, వృద్ధుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ఉపాధ్యక్షుడు

చట్టం ఏం చెబుతోంది..?

వృద్ధుల సమస్యలను సమీక్షించేందుకు జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలి. కలెక్టర్‌ ఛైర్మన్‌గా, ఎస్పీ, డీఎంహెచ్‌వో, ఆర్డీవోలు, ఎన్జీవోలు తదితరులు సభ్యులుగా, దివ్యాంగుల సంక్షమ శాఖ డైరెక్టర్‌ కమిటీకి కార్యదర్శిగా ఉంటారు.

నిరాదరణకు గురైన వృద్ధులకు న్యాయం చేసేందుకు డివిజన్‌ కేంద్రాల్లో ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేశారు. ఆర్డీవో ఛైర్మన్‌గా..దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కన్వీనర్‌, డిప్యూటి తహశీల్దార్‌, ఇద్దరు సీనియర్‌ సిటిజన్లు సభ్యులుగా ఉంటారు. బాధితుడు ఆశ్రయించిన మూడు మాసాల్లో కేసును పరిష్కరించి పిల్లలు, రక్త సంబంధీకుల నుంచి భరణం ఇప్పించే అధికారం ట్రైబ్యునల్‌కు ఉంటుంది. అక్కడ న్యాయం దక్కని పక్షంలో బాధితులు కలెక్టర్‌కు అప్పీల్‌ చేసుకోవచ్ఛు

2007లో తల్లిదండ్రుల పోషణ, వృద్ధుల సంరక్షణ చట్టం రూపొందించింది. ఈ చట్టంలోని సెక్షన్‌ 24 ప్రకారం తల్లిదండ్రులను ఒంటరిగా వదిలేయడం, వారిని పట్టించుకోకపోతే వారికి మూడు నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని