logo

కౌలు రైతులకు గుర్తింపు ఏదీ ?

జిల్లాలో పంటలు సాగుచేసే వారిలో 80 శాతం మంది కౌలు రైతులే ఉంటున్నారు. వీరికి ప్రభుత్వం నుంచి సంక్షేమ ఫలాలు సక్రమంగా అందడం లేదు. ఫలితంగా చాలా మంది సాగుకు దూరమవుతున్నారు. సీసీఆర్‌ కార్డులు అందక పోవడమే దీనికి ప్రధాన కారణం.

Updated : 28 Jun 2022 07:04 IST

సీసీఆర్‌ కార్డుల అందజేత అంతంత మాత్రం

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే

జిల్లాలో పంటలు సాగుచేసే వారిలో 80 శాతం మంది కౌలు రైతులే ఉంటున్నారు. వీరికి ప్రభుత్వం నుంచి సంక్షేమ ఫలాలు సక్రమంగా అందడం లేదు. ఫలితంగా చాలా మంది సాగుకు దూరమవుతున్నారు. సీసీఆర్‌ కార్డులు అందక పోవడమే దీనికి ప్రధాన కారణం.

ఏలూరు జిల్లాలోని 28 మండలాల్లో సుమారు 1.10 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. తొలకరి పలకరించి, కాలువలకు నీళ్లు వదిలి ఖరీఫ్‌ సాగుకు అన్నదాతలు సన్నద్ధమైనా సీసీఆర్‌ (క్రాప్‌ కల్టివేషన్‌ రైట్స్‌-పంట సాగు హక్కు పత్రాలు) కార్డులు నేటికీ పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. జిల్లాలో లక్ష మందికి పైగా కౌలుదారులు ఉంటారని అంచనా వేసిన అధికారులు ఇప్పటి వరకు 18,174 మందికి మాత్రమే మంజూరుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2019లో తీసుకొచ్చిన కొత్త చట్టంతో కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎటువంటి నిబంధనలు లేకపోవడంతో భూమి యజమాని అంగీకారం లేకున్నా రెవెన్యూ అధికారులు కౌలు కార్డులు ఇచ్చేవారు. ప్రస్తుతం కార్డులు ఇవ్వనందున ప్రభుత్వం అందించే సాయం అందడం లేదు.

ప్రయోజనాలివీ

భూ యజమాని హక్కులకు భంగం వాటిల్లకుండా వాస్తవ సాగుదారులకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం సీసీఆర్‌ కార్డులు జారీ చేస్తోంది. వీటివల్ల ప్రభుత్వం కౌలు రైతులకు అందించే రైతు భరోసా, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి సాయం అందుతుంది. బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందే వీలుండటంతో పాటు రూ.లక్షలోపు రుణం తీసుకుని సకాలంలో చెల్లిస్తే సున్నావడ్డీ వర్తిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలతో పంటలకు నష్టం వాటిల్లితే ప్రభుత్వం అందించే నష్టపరిహారం పొందవచ్ఛు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తులు విక్రయించవచ్ఛు పచ్చిరొట్ట, వరి, అపరాలు తదితర విత్తనాలను రాయితీపై పొందవచ్ఛు

తూతూమంత్రంగా సభలు

కౌలు కార్డుల మంజూరుకు సంబంధించి ఏప్రిల్‌, మే నెలల్లో గ్రామ సభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలి. వాస్తవ సాగుదారులను గుర్తించి కార్డులు మంజూరు చేయాలి. వాస్తవానికి సభలను తూతూమంత్రంగా నిర్వహించి మమ అనిపిస్తున్నారు. గతంలో తహశీల్దార్‌, ఆర్‌ఐ, మండల వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో సభలు నిర్వహించేవారు. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో వీఆర్‌వో, రైతు భరోసా సహాయకుడు ఆధ్వర్యంలో సభలు నిర్వహించి కార్డులు మంజూరు చేస్తున్నారు.

అన్ని రకాలుగా నష్టపోతున్నాం..

మాదేపల్లిలో ఆరెకరాలను కౌలు చేస్తున్నా. భూయజమాని అంగీకార పత్రంపై సంతకం చేయకపోవడంతో మూడేళ్లుగా కౌలు గుర్తింపు కార్డు పొందలేకపోయా. రైతు భరోసా సొమ్ము రావడం లేదు. అతివృష్టి, అనావృష్టి సమయాల్లో బీమా పరిహారం అందడం లేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. పంటను వేరే వారి పేరున అమ్ముకుంటున్నా. - వాడవల్లి రామారావు, కౌలు రైతు, మాదేపల్లి

ప్రయోజనాలు అందడం లేదు..

మూడు ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నా. అంగీకార పత్రంపై భూ యజమాని సంతకం లేనిదే కౌలు కార్డు ఇవ్వలేమని అధికారులంటున్నారు. కార్డు లేనందున ధాన్యం విక్రయాలకు ఇబ్బందులు పడుతున్నా. రబీకి సంబంధించి రెండు ఎకరాల ధాన్యం బకాయిలు రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందడం లేదు. - ఏలూరు సుబ్బారావు, కౌలు రైతు, పోతునూరు

అవగాహన కల్పించాలి..

కౌలు రైతుల పరిస్థితులపై జిల్లావ్యాప్తంగా సర్వే చేపట్టాం. కొత్త కౌలు చట్టం గురించి చాలామందికి అవగాహన లేదు. భూ యజమానులు అంగీకార పత్రంపై సంతకాలు చేయడం లేదు. అధికారులు వారి అపోహలు తొలగించేందుకు అవగాహన కల్పించాలి. గతంలో మాదిరిగా భూ యజమాని అంగీకారంతో నిమిత్తం లేకుండా వాస్తవ సాగుదారులకు కార్డులు మంజూరు చేయాలి. -కె.శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శి, ఏపీ రైతు సంఘం

లక్ష్యం మేరకు జారీకి కృషి..

నిర్దేశిత లక్ష్యం మేరకు పంట సాగు హక్కు పత్రాలు జారీ చేసేందుకు కార్యాచరణ చేపట్టాం. ఇప్పటివరకు 18 వేలు జారీ చేశాం. కౌలుకు ఇచ్చినట్లు భూ యజమాని అంగీకారం ఇస్తే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. భూ యజమానుల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు కౌలు రైతు చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. - రామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని