logo

శకటానికి బకాయిల సంకటం!

కాలంతో పని లేకుండా నిరంతరం సేవలు అందించాల్సిన అగ్నిమాపక శాఖకు ఇంధన బిల్లుల బకాయిలు భారంగా మారుతున్నాయి. అగ్నిమాపక వాహనాలకు సంబంధించి 9 నెలలుగా బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. కొన్ని నెలలుగా చెల్లింపులు లేకపోవడంతో స్థానిక పెట్రోలు బంకుల నిర్వాహకులు

Updated : 28 Jun 2022 07:02 IST

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: కాలంతో పని లేకుండా నిరంతరం సేవలు అందించాల్సిన అగ్నిమాపక శాఖకు ఇంధన బిల్లుల బకాయిలు భారంగా మారుతున్నాయి. అగ్నిమాపక వాహనాలకు సంబంధించి 9 నెలలుగా బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. కొన్ని నెలలుగా చెల్లింపులు లేకపోవడంతో స్థానిక పెట్రోలు బంకుల నిర్వాహకులు ఇంధనం నింపేందుకు ససేమిరా అంటున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు కొందరు ఉద్యోగులు, సిబ్బంది బాధ్యత వహించి వాహనాలకు ఇంధనం పోయిస్తున్నట్లు సమాచారం.

జిల్లాలో కొన్నిచోట్ల ఒకేరోజు రెండు మూడు అగ్ని ప్రమాదాలు జరిగిన సందర్భాలున్నాయి. అలాంటప్పుడు వాహనాలు సకాలంలో ఆయా ప్రాంతాలకు చేరాలంటే ఇంధనం పూర్తిస్థాయిలో ఉండాలి. లీటరు డీజిల్‌ 4 కిలోమీటర్లకు సరిపోతుంది. కొన్ని గ్రామాలకు వెళ్లిరావాలంటే 30 నుంచి 50 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి ఉంటుంది. అంటే 10 నుంచి 12 లీటర్లు డీజిల్‌ అవసరమవుతుంది. ఇక మంటలను ఆర్పే సమయంలో వాహన ఇంజిన్‌ పనిచేయాలి. 20 నిమిషాల పాటు ఇంజిన్‌ పనిచేస్తే 2 లీటర్ల ఇంధనం అవసరమవుతుంది.

ఇదీ పరిస్థితి..

పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం, నరసాపురం, పాలకొల్లు, అత్తిలి, తణుకు, తాడేపల్లిగూడెం, ఆకివీడులలో అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. కొన్ని కేంద్రాలకు రూ.లక్ష నుంచి రూ. 1.20 లక్షల వరకు ఇంధన బిల్లుల బకాయిలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఈ మొత్తం రూ.20 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. ప్రతి మూడు నెలలకోసారి బిల్లుల వివరాలు, చెల్లింపులకు సంబంధించిన ప్రతిపాదనలు అందజేస్తుంటామని జిల్లా అగ్నిమాపక ముఖ్య అధికారి కె.శ్రీనివాసరావు చెప్పారు. త్వరలోనే నిధులు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. తాడేపల్లిగూడెం కేంద్రానికి ఇటీవల కొంత సొమ్ము వచ్చినా ఇంకా రూ.75 వేల వరకు బకాయిలు ఉన్నాయి. నరసాపురంలో ఆరు, తణుకులో నాలుగు నెలలుగా, పాలకొల్లులో ఏడాదిగా, ఏలూరు జిల్లా కైకలూరులో 8, ఉంగుటూరులో 6 నెలలుగా బకాయిలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని