logo

రోడ్డెక్కిన రైతన్న

జూన్‌ 1న గోదావరి జలాలను విడుదల చేసిన యంత్రాంగం.. 150 రోజుల కాల వ్యవధిలో అంటే జూన్‌ 30 నాటికి నాట్లు వేసి అక్టోబరు ఆఖరుకు ఖరీఫ్‌ సాగు పూర్తిచేయాలని నిర్దేశించారు. ఇంత వరకు బాగానే ఉన్నా సాగుకు ముందుకెళ్లేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక అన్నదాతలు అయోమయంలో ఉన్నారు.

Updated : 28 Jun 2022 06:59 IST

ధాన్యం సొమ్ములు రాక ఇక్కట్లు

 

సాగు పెట్టుబడికి వెతుకులాట

ఆచంట, పెనుమంట్ర, న్యూస్‌టుడే: జూన్‌ 1న గోదావరి జలాలను విడుదల చేసిన యంత్రాంగం.. 150 రోజుల కాల వ్యవధిలో అంటే జూన్‌ 30 నాటికి నాట్లు వేసి అక్టోబరు ఆఖరుకు ఖరీఫ్‌ సాగు పూర్తిచేయాలని నిర్దేశించారు. ఇంత వరకు బాగానే ఉన్నా సాగుకు ముందుకెళ్లేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక అన్నదాతలు అయోమయంలో ఉన్నారు. మే 5 తర్వాత ధాన్యం విక్రయించిన రైతులకు ప్రభుత్వం ఇప్పటి వరకూ పైసా చెల్లించలేదు. రేపోమాపో సొమ్ములు వస్తాయి.. నారుమడులు సిద్ధం చేసుకోవచ్చని ఎదురుచూస్తున్న కర్షకులకు నిరాశే ఎదురైంది. మరోపక్క సాగు సమయం కూడా దాటిపోవడంతో ఖరీఫ్‌ భవిష్యత్తుపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ఫలితంగా ధాన్యం సొమ్ముల కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది.

ఉమ్మడి జిల్లాలో సుమారు 5.57 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ విస్తీర్ణం ఉండగా ఇప్పటి వరకు 30 శాతం కూడా నారుమడులు సిద్ధం కాలేదు. ప్రస్తుతం సాగు మొదలు పెట్టాలంటే దమ్ములు, విత్తనాలు, ఊడుపులకు ఎకరానికి సుమారు రూ.8 వేల వరకు పెట్టుబడి అవుతుంది. ఇప్పటికే రబీ సాగుకు చేసిన అప్పులకు వడ్డీ పెరగడం, ఎరువుల దుకాణదారులు బకాయిలు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడం వంటి పరిణామాలతో అన్నదాతలు సతమతమవుతున్నారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో 15 రోజుల నుంచి రైతులు రోడ్డెక్కి నిరసనలకు దిగుతున్నారు.

రబీలో 7.83 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలనేది లక్ష్యం కాగా ఇప్పటి వరకు 6.70 లక్షల టన్నులను రైతులు నుంచి కొనుగోలు చేశారు. మరో మూడు లేదా నాలుగు రోజుల్లో కొనుగోళ్లను నిలిపివేయనున్నట్లు అధికారులు తాజాగా ప్రకటించారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యానికి ప్రభుత్వం రూ.1265 కోట్లు చెల్లించాలి. కానీ రూ.265 కోట్లే చెల్లించింది. ఇంకా సుమారు 70 శాతం మందికి బకాయి పడింది. త్వరలోనే మిగిలిన రైతులకు సొమ్ములు చెల్లిస్తామని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు గణనాథ్‌ తెలిపారు.

వ్యయ భారం పెరిగింది

ప్రస్తుతం ఎరువులు, పురుగు మందుల ధరలు రెట్టింపయ్యాయి. మరోపక్క దమ్ము, విత్తనాలు, కూలీల వ్యయం కూడా భారీగా పెరిగింది. సాగు చేయాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ధాన్యం విక్రయించిన సొమ్ములు నెలల తరబడి చేతికి రాకపోవడంతో వడ్డీలు పెరిగి రైతులు మరింత నష్టపోతున్నారు. - నెక్కంటి సుబ్బారావు, అభ్యుదయరైతు, ఆచంట

పైసా రాలేదు

మే 9న ధాన్యం విక్రయించా. సుమారు రూ.3.5 లక్షల వరకు రావాలి. ఇప్పటికి 45 రోజులు దాటినా పైసా రాలేదు. ఖరీఫ్‌ సాగు చేయాలో మానాలో తెలియని పరిస్థితి. రబీకి చేసిన బ్యాంకు అప్పులు ఇంకా తీర్చలేదు. అవి చెల్లిస్తేనే కొత్తగా అప్పు ఇవ్వమంటున్నారు. బయట చేసిన అప్పులపై వడ్డీ పెరుగుతోంది. - మన్నె బుజ్జి, రైతు, ఆచంట

రూ.5.14 లక్షలు రావాలి

పది ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. రబీ ధాన్యానికి సంబంధించిన రూ.5.14 లక్షలు రావాల్సి ఉంది. మే 14న ధాన్యం విక్రయించా. ఇప్పటివరకు బ్యాంకులో జమకాలేదు. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్‌ సాగు చేయాలంటే భయంగా ఉంది. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితిని చూడలేదు. పెట్టుబడి కోసం మళ్లీ అప్పు చేయాలంటే బయట అధిక వడ్డీలు అడుగుతున్నారు. - చింతపల్లి ఆదినారాయణ, కౌలురైతు, పెనుమంట్ర

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని