logo

వైరస్ గుబులు

రొయ్యల్లో తెల్ల మచ్చల (వైట్‌ స్పాట్‌) వ్యాధి సాగుదారులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటికే ధరలు పడిపోయి కుదేలు అవుతున్న ఆక్వా రైతుల పాలిట ఈ వైరస్‌ గోరుచుట్టుపై రోకలిపోటులా తయారైంది. దీని ఉద్ధృతితో రెండు వారాల వ్యవధిలోనే వేల ఎకరాల్లో చెరువులు

Published : 29 Jun 2022 04:27 IST

రొయ్యల్లో తెల్లమచ్చల వ్యాధి విజృంభణ

ఆక్వా రైతులు విలవిల

భీమవరం అర్బన్‌, మండవల్లి, న్యూస్‌టుడే

ఎగుమతికి సిద్ధంగా ఉన్న రొయ్యలు

రొయ్యల్లో తెల్ల మచ్చల (వైట్‌ స్పాట్‌) వ్యాధి సాగుదారులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటికే ధరలు పడిపోయి కుదేలు అవుతున్న ఆక్వా రైతుల పాలిట ఈ వైరస్‌ గోరుచుట్టుపై రోకలిపోటులా తయారైంది. దీని ఉద్ధృతితో రెండు వారాల వ్యవధిలోనే వేల ఎకరాల్లో చెరువులు ఖాళీగా మారాయి. చెరువుల్లో స్థాయికి మించి రొయ్య పిల్లలు వేయడం, చెరువుల నిర్వహణ సరిగా లేకపోవడంతో ఈ వ్యాధి సోకుతుంది. ఒక్క చెరువులో ఇది బయటపడినా చెరువులన్నిటికీ గంటల వ్యవధిలోనే వ్యాపిస్తుంది.

జిల్లాలో 90 వేల ఎకరాల్లో రొయ్యలసాగు చేపడతున్నారు. ప్రస్తుతం పిల్ల వేసిన 20 నుంచి 45 రోజుల వ్యవధిలోని 70 శాతం చెరువులు వైరస్‌ ప్రభావంతో ఖాళీగా మారాయి. కిలోకు 300 నుంచి 600 వరకు రొయ్యలు తూగే సైజులోనే చనిపోతున్నాయి. ఇవి మార్కెట్‌లో కిలో రూ.30 నుంచి రూ.60 మాత్రమే ధర పలుకుతాయి. మొదటి నెలలో ఒక్కో ఎకరాకు రూ.1.20 లక్షలు ఖర్చు అవుతుండగా.. వైరస్‌ సోకితే కనీసం వల ఖర్చులు (ఎకరాకు రూ.20 వేలు) వచ్చే పరిస్థితి లేదు.  

అనుకూలించని  వాతావరణం..

రొయ్యల సాగుకు ముఖ్యంగా పొడి వాతావరణం అనుకూలం. కానీ ఈ సీజన్‌లో దీనికి విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. గడచిన 20 రోజుల్లో రెండు రోజులు మాత్రమే 35 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రత చేరింది. మిగిలిన రోజుల్లో మబ్బులతో చల్లని వాతావరణమే కనిపించింది. ఈ తరహా పరిస్థితులు వైరస్‌ వ్యాప్తిని మరింత పెంచుతాయి. ఎండ ఉంటే వైరస్‌ తీవ్రత కాస్త తగ్గి ఉండేదని నిపుణులు చెబుతున్నారు.


తెల్లమచ్చల వ్యాధి సోకిన రొయ్య తలభాగం

భీమవరం మండలం లోసరికి చెందిన రైతు కె.వెంకటసత్యనారాయణ రెండెకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. తెల్లమచ్చల వ్యాధి సోకడంతో చెరువులో వేసిన రొయ్యల్లో 20 రోజుల వ్యవధిలోనే చనిపోయి రూ.2.30 లక్షల నష్టం వాటిల్లింది. ఇప్పుడు కొత్తగా పెట్టుబడి తెచ్చే పరిస్థితి లేక ఏం చేయాలో పాల్పోని స్థితిలో ఆయన ఉన్నారు. జిల్లాలోని చాలా మంది ఆక్వా రైతులది ఇదే పరిస్థితి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని