logo
Published : 29 Jun 2022 04:27 IST

భీమడోలులో ఉద్రిక్తత

ఒక హత్య కేసు ఆరోపణలపై సోదరులను అరెస్టు చేసిన పోలీసులు

అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ తెదేపా నాయకుల ఆందోళన

తహశీల్దారు కార్యాలయం ఎదుట బైఠాయించిన నాయకులు

భీమడోలు, న్యూస్‌టుడే: ఒక హత్య కేసు విషయమై ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెదేపా నాయకులైన ఇద్దరు అన్నదమ్ములను పోలీసులు అరెస్టు చేసిన వ్యవహారం ఏలూరు జిల్లా భీమడోలులో మంగళవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హత్యకేసుతో పాటు గంజాయి వ్యాపారం చేస్తున్నారంటూ పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ తెదేపా నాయకులు తహశీల్దారు కార్యాలయం వద్ద బైఠాయించారు. వర్షంలోనూ ఆందోళన కొనసాగించారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. అధికారుల నుంచి స్పందన రాకపోవటంతో కార్యకర్తలు తహశీల్దారు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించటం, పోలీసులు నిలువరించటం నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో తెదేపా ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు తదితర నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ ఒక నేరస్థుడు చెప్పిన విషయాన్ని పట్టుకుని తమ పార్టీ నాయకులను అరెస్టు చేయటం అన్యాయమన్నారు. హత్యకు సంబంధించిన ఆధారాలున్నాయని అదుపులోకి తీసుకుని ఐదురోజులవుతున్నా వారిని ఎందుకు కోర్టుకు హాజరుపరచలేదని ప్రశ్నించారు.  తహశీల్దారు జె.వి.సుబ్బారావుకు  నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

కేసు విచారణ కోసం అంటూ..  

భీమడోలుకు చెందిన తెలుగుయువత నాయకులు సోదరులైన గంజి మజేష్‌, గంజి మనోజ్‌లను తొమ్మిది నెలల కిందట జరిగిందంటున్న ఓ హత్య కేసు విచారణలో భాగంగా స్థానిక పోలీసులు గత శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టుకు హాజరుపరిచే క్రమంలో సీఐ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ చావా సురేష్‌ పొలసానిపల్లిలోని ఆయిల్‌పామ్‌ తోట (గంజి మజేష్‌ సోదరులకు చెందినది) వద్దకు మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఒక కారులో తీసుకెళ్లారు. తహశీల్దారు జె.వి.సుబ్బారావును పిలిపించారు. పోలీసుల వెనుకే తెదేపా నాయకుడు గన్ని వీరాంజనేయులు కుమారుడు గన్ని భరత్‌ మరికొంతమంది కార్యకర్తలు, మనోజ్‌ తల్లిదండ్రులు సుబ్బారావు, మంగతాయారు, వారి బంధువులు వెళ్లారు. అక్కడ గంజాయి సంచులను పోలీసులే పెట్టి వాటి తమ నాయకులపై కొత్త కేసులు బనాయించేందుకు కుట్ర చేస్తున్నారని పార్టీ నాయకులు విమర్శించారు. పోలీసులే తమ వెంట తీసుకొచ్చిన గంజాయి సంచిని పొలంలో పెడుతున్నప్పుడు తమ కార్యకర్త చరవాణిలో వీడియో తీస్తుండగా అడ్డుకున్న పోలీసులు ఆ ఫోనును తీసుకుని అందులోని సమాచారాన్ని డిలీట్‌ చేశారని నాయకులు ఆరోపించారు. పోలీసులే తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ అక్రమ కేసులు పెట్టడమేమింటూ గన్ని భరత్‌ వారిని నిలదీశారు. సమాధానం చెప్పకుండా తమ అదుపులో ఉన్నవారిని తీసుకుని వెళ్లిపోవటంతో నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుమారులపై అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారని మనస్తాపంతో వారి తల్లి మంగతాయారు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ వ్యవహారంపై తెదేపా నాయకులు, కార్యకర్తలు తహశీల్దారు కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. ‘హత్యకేసులో మనోజ్‌, మజేష్‌ పాత్ర ఉందనడానికి ఆధారాలున్నాయని, గంజాయి వ్యాపారులతో సంబంధాలున్నాయని భావించి అరెస్టు చేశాం’ అని భీమడోలు ఎస్సై చావా సురేశ్‌ తెలిపారు.
 

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts