logo

ధాన్యం బకాయిలు చెల్లించాలని దీక్షలు

ప్రభుత్వం ధాన్యం బకాయిలు చెల్లించాలని కోరుతూ దెందులూరు మండలం కొవ్వలిలో అన్నదాతలు మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బకాయిలు చెల్లించేవరకు దీక్షలు కొనసాగిస్తామన్నారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోతే ఆమరణ దీక్ష చేపడతామన్నారు.

Published : 29 Jun 2022 04:27 IST

రిలే దీక్షలో పాల్గొన్న రైతులు, రైతు సంఘం నాయకులు

దెందులూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం ధాన్యం బకాయిలు చెల్లించాలని కోరుతూ దెందులూరు మండలం కొవ్వలిలో అన్నదాతలు మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బకాయిలు చెల్లించేవరకు దీక్షలు కొనసాగిస్తామన్నారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోతే ఆమరణ దీక్ష చేపడతామన్నారు. కొవ్వలి గ్రామ రైతులు రబీలో అమ్మిన ధాన్యానికి సంబంధించి సుమారు రూ.19 కోట్లు రావాల్సి ఉండగా రూ.8 కోట్ల వరకు చెల్లించారు. రైతులు గ్రామంలో ప్రదర్శన నిర్వహించి రైతు భరోసా కేంద్రంలో వినతిపత్రం అందించారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. మూడు బొమ్మల కూడలిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దీక్ష కొనసాగింది. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నిమ్మగడ్డ నరసింహ, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఒక్క ఏలూరు జిల్లాలోనే 15 వేల మంది రైతులకు రూ.450 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఖరీఫ్‌ సాగుకు చేతిలో నగదు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీక్షకు జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ నాయకుడు కొఠారు ఆదిశేషు, పలు విభాగాల నాయకులు మద్దతు తెలిపారు. రైతు సంఘం దెందులూరు మండల అధ్యక్షుడు గండి రాజా, కార్యదర్శి సున్నా వెంకట్రావు, రైతులు పాల్గొన్నారు.

సొమ్ములు అందలేదని ఆవేదన.. గ్రామానికి చెందిన కౌలురైతు తోటకూర రాము ధాన్యం బకాయిలు రాని కారణంగా ఆవేదనకు గురయ్యారని, రిలే దీక్షకు వచ్చే క్రమంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినట్లు రైతులు తెలిపారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని