logo
Published : 30 Jun 2022 04:53 IST

రెండేళ్లయినా పునాదులూ దాటలే!

ఆసుపత్రి భవనాల నిర్మాణంలో తీవ్ర జాప్యం

భీమవరం పట్టణ పరిధి గొల్లవానితిప్పరోడ్డు పరిధిలో రూ.10.15 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టిన ప్రాంతమిది. ఏడాదిన్నర క్రితం ఈ పనులు ప్రారంభించగా ఇప్పటికీ పునాది కూడా పడలేదు. ప్రధాన రహదారి నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం కొంతమేర పల్లంగానే ఉంది. వర్షం కురిస్తే నిర్మాణ సామగ్రిని తరలించడం కష్టమే.

భీమవరం పట్టణం, ఆచంట, న్యూస్‌టుడే: ప్రభుత్వ వైద్య సేవలను పేదలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో జిల్లాలో ప్రధాన ఆసుపత్రులను ఆధునికీకరణ పనులు చేపట్టారు. నిధులు మంజూరై రెండేళ్లు దాటినా అదనపు భవనాల నిర్మాణం పునాదుల దశను కూడా దాటలేదు.

ఆధునికీకరణలో భాగంగా వివిధ ఆసుపత్రుల్లో పడక సంఖ్యను పెంచారు. దీంతో తణుకు ఆసుపత్రిలో 150, తాడేపల్లిగూడెంలో 130, భీమవరం, పాలకొల్లుల్లో 100, నరసాపురంలో 50, ఆకివీడు, ఆచంట, పెనుగొండలలో 30కు పడకల సంఖ్య పెరిగింది. కొన్నిచోట్ల దీనికి తగ్గట్టుగా వసతులు లేవు. వైద్యులు, పరికరాలు ఉన్నా భవనాలు లేవు. ఇలాంటి చోట్ల కొత్త భవనాలను నిర్మించి పూర్తి స్థాయి సేవలు చేరువ చేస్తామంటూ అధికారులు, పాలకులు కాలం వెళ్లదీస్తున్నారు. భీమవరంలో సీహెచ్‌సీకి ప్రాంతీయ ఆసుపత్రిగా 2000 సంవత్సరంలో వర్గోన్నతి కల్పించారు. అప్పట్లో రూ.6.5 కోట్లతో నిర్మించిన భవనంలోనే 50 పడకలతో సేవలు కొనసాగుతున్నాయి. 100 పడకలకు తగ్గట్టుగా చేపట్టిన కొత్త భవన నిర్మాణానికి ఇప్పటికీ పునాదుల దశ దాటలేదు. జిల్లాలో పలు ప్రాంతాల్లో రూ.50.97 కోట్ల విలువైన పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి పూర్తయితే అదనపు పడకలతో పాటు కొన్నిచోట్ల మాతా, శిశువులకు ఒకేచోట వైద్యసేవలు అందించే భవనాలు అందుబాటులోకి వస్తాయి.

ఆచంటలో రూ.82 లక్షలతో చేపట్టిన 30 పడకల ఆసుపత్రి భవనం పనులు కొన్ని నెలలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇది పూర్తయి అందుబాటులోకి వస్తేనే ఆచంట, పోడూరు తదితర ప్రాంతాలకు చెందిన వందలాది మందికి వైద్య సేవలు చేరువవుతాయి.

నిధులు ఉన్నా..

ఆసుపత్రుల ఆధునికీకరణలో భాగంగా అదనపు భవనాలు నిర్మించి వసతులు కల్పించేందుకు 2020లో నాబార్డు నిధులు విడుదలయ్యాయి. కొవిడ్‌ వ్యాప్తి, కొన్ని ప్రాంతాల్లో నిర్మాణ స్థలాలను సకాలంలో పూడ్చకపోవడం వంటి కారణాలతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. ప్రస్తుతం కొన్నిచోట్ల పనులు చేస్తున్నా వర్షాలు అవరోధంగా మారుతున్నారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఈ పనులు పూర్తి చేయాల్సి ఉంది.

వేగవంతం చేశాం..

కొవిడ్‌ కారణంగా ఆసుపత్రి భవనాల పనులు ఆలస్యమైనట్లు ఏపీ ఎంఎస్‌ఐడీసీ డీఈ శ్రీనివాసరెడ్డి చెప్పారు. బిల్లులకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు ఉన్న బకాయిలన్నీ విడుదలయ్యాయన్నారు. డిసెంబరు నాటికి కొత్త భవనాలను వినియోగంలోకి తీసుకొచ్చేలా పనులను వేగవంతం చేశామన్నారు.

నిత్యం వచ్చే రోగులు 4,500 , వైద్యశాలల్లో ఉండి సేవలు పొందేవారు 1,400

ప్రాంతాల వారీగా కేటాయించిన నిధులు మొత్తం (రూ.కోట్లలో)

భీమవరం  10.15

పాలకొల్లు  12.60

నరసాపురం  11.64

ఆచంట  0.82

పెనుగొండ  2.03

తాడేపల్లిగూడెం  11.73

ఆకివీడు  2.00

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని