logo
Published : 30 Jun 2022 04:53 IST

అనుమతి కొంత.. అక్రమ రవాణా కొండంత!

గుల్లవుతున్న లంక భూములు

పాలకొల్లు, న్యూస్‌టుడే

ఇటుక బట్టీల దగ్గర తువ్వమట్టి నిల్వలిలా

యలమంచిలి మండలం కాంబోట్లపాలెం, బూరుగుపల్లి, యలమంచిలిలంక సరిహద్దుల్లోని పెరుగులంక భూముల్లోని తువ్వ మట్టిని జిల్లాలోని పలుప్రాంతాలతోపాటు కొనసీమ జిల్లాకు టిప్పర్లతో నిత్యం రవాణా చేస్తున్నారు. ఈ విధంగా ఏటా రూ. కోట్లలో మట్టి దందా మూడు ట్రాక్టర్లు.. ఆరు లారీలుగా సాగిపోతుంది.

ఆచంట మండలం కరుగోరుమిల్లి నుంచి చుట్టూ ఉన్న పేదల లేఅవుట్ల పూడిక నిమిత్తం తువ్వ మట్టి రవాణాకు ఇటీవల అధికారులు అనుమతించారు. దీని ముసుగులో సమీపంలోని యలమంచిలి, పాలకొల్లు మండలాల్లోని ఇటుక బట్టీలకు, ప్రైవేటు లేఅవుట్లకు కరుగోరుమిల్లి నుంచి వందలాది ట్రక్కుల మట్టి రేయింబవళ్లు రవాణా అవుతోంది. అక్కడ ఉచితంగా లభించే మట్టిని ట్రక్కు రూ. 2 వేల నుంచి రూ. 3 వేలకు బయట విక్రయిస్తున్నారు.

తువ్వ దందా.. గోదావరి తీరంలో విస్తరించిన పెరుగులంక భూముల్లో తువ్వమట్టి లభిస్తోంది. దీనికి గిరాకీ ఉండటంతో అధికార పార్టీ నాయకులు, అక్రమార్కులు తువ్వపై కన్నేసి లంకలన్నీ గుల్లచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకున్న నాథుడు లేడు. కొత్తగా ఇళ్లు నిర్మించుకునేవారు మట్టి రవాణాకు స్థానిక వీఆర్వోకు దరఖాస్తు చేస్తున్నారు. దానిపై ఎన్ని ట్రక్కుల మట్టి అవసరమనేది లబ్ధిదారు పొందుపరచడం లేదు. దానిని రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. కొందరు అక్రమార్కులు దీనిని అవకాశంగా మలచుకుంటున్నారు. ఇటీవల ఇదే తరహాలో నరసాపురం మండలం సీతారామపురం నుంచి యలమంచిలికి నాలుగు రోజులపాటు విచ్చలవిడిగా మట్టి రవాణా జరిగింది. అధికారులను అడిగితే ఇంటి నిర్మాణానికి మట్టి కావాలని దరఖాస్తు చేసుకున్నారని దానిపై ఎంతనేది రాయలేదని పేర్కొనడం గమనార్హం.

తువ్వకు మంచి గిరాకీ..

లంక తువ్వతో తయారైన ఇటుకలకు నాణ్యత ఉంటుందని పేరు. అందువల్ల బట్టీలకు ఎక్కువగా తువ్వమట్టిని తెచ్చుకుని కొంత నల్లమట్టితో కలిపి ఇటుక తయారు చేస్తుంటారు. దీనికోసం గుట్టలుగా నిల్వ చేస్తున్నారు. గృహనిర్మాణశాఖ అధికారులిచ్చిన కూపన్‌ ఉంటే కరుగోరుమిల్లిలో తువ్వ ఉచితంగా ఇచ్చి కేవలం ఎగుమతి, రవాణా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అక్కడ ఉచితంగా వచ్చిన దాన్ని బయట టిప్పర్‌ లోడు రూ.10వేల వరకు విక్రయిస్తున్నారు. దీనిపై ఏలూరు మైనింగ్‌ ఏడీ శ్రీనివాస్‌ను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతి తీసుకుని బయటకు విక్రయించడం నేరమని, ఇటువంటి వాటిని స్థానిక రెవెన్యూ అధికారులు తనిఖీ చేసి పట్టుకోవచ్చని చెప్పారు.

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని