logo

అతిక్రమణలు కోకొల్లలు

పురపాలికల్లో అక్రమ నిర్మాణాలు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారుల దన్నుతో ఇదంతా సాగుతోందన్నది ఆరోపణ. దీంతో అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. భవన నిర్మాణాలకు అనుమతులు ఆన్‌లైన్‌లో తీసుకునే వెసులుబాటుంది. గ్రౌం

Published : 30 Jun 2022 04:53 IST

నిర్మాణాలపై పర్యవేక్షణలో అవినీతి పర్వం

యంత్రాంగం తీరుపై పురసమావేశాల్లో విమర్శలు

ఈనాడు డిజిటల్‌, ఏలూరు, జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే

జంగారెడ్డిగూడెం పట్టణంలో అపరాధ రుసుం విధించిన భవనం

పురపాలికల్లో అక్రమ నిర్మాణాలు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారుల దన్నుతో ఇదంతా సాగుతోందన్నది ఆరోపణ. దీంతో అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. భవన నిర్మాణాలకు అనుమతులు ఆన్‌లైన్‌లో తీసుకునే వెసులుబాటుంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌ వరకు ముందే నిర్మించి ఉన్న భవనంపై మరిన్ని అంతస్తులు నిర్మించాలన్నా దరఖాస్తు చేసుకోవచ్ఛు అయితే జిల్లాలోని చాలా పట్టణాల్లో, ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువుండే ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులూ లేకుండానే భవనాల్లో పోర్షన్లు, అంతస్తులు పెంచేస్తున్నారు. అవి ఎక్కడున్నాయో చిరునామాలతో సహా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు తెలుసు. వాటిలో చాలా వరకు నాయకులు, కొందరు ప్రజాప్రతినిధుల సన్నిహితులవడంతో, వాటి నుంచి తమకూ కావలసినంత ముడుతుండటంతో కనీసం తనిఖీ చేయడానికి కూడా అధికారులు అటువైపు అడుగులేయట్లేదన్నది ఆరోపణ.

ప్లానింగ్‌ కార్యదర్శులదే బాధ్యత..

‘సచివాలయ వ్యవస్థ వచ్చాక ఇలాంటి అక్రమాలు చాలా వరకు తగ్గాయి. వాటిపై కఠినంగా వ్యవహరించాలని పురపాలక కమిషనర్లకు ఆదేశాలిచ్చాం. నిబంధనలకు ఏమాత్రం వ్యతిరేకంగా నిర్మాణాలు జరిగినా సంబంధిత సచివాలయ ప్లానింగ్‌ కార్యదర్శులదే పూర్తి బాధ్యత అని కూడా స్పష్టంగా చెప్పాం. అక్రమ నిర్మాణాలపై మా దృష్టికి తెస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పురపాలక ఆర్డీ సత్యనారాయణ తెలిపారు.

నిబంధనలిలా..

పురపాలికల పరిధిలో అయిదంతస్తులకు మించి నిర్మాణాలు చేయకూడదు. ఇలాంటివి చేయాలంటే ప్రత్యేకంగా అనుమతులు కావాలి. ● అపార్ట్‌మెంట్‌లు నిర్మించేటప్పుడు భవనానికి కనీసం పదడుగుల మేర సెట్‌బ్యాక్‌ వదలాలి. పార్కింగ్‌లో ఇతర నివాస నిర్మాణాలు చేపట్టకూడదు. ● అగ్నిమాపక నిబంధనలు పాటించాలి. ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకునేందుకు వీలుగా రెండు మార్గాలు ఏర్పాటు చేయాలి. మెట్లు విశాలంగా ఉండాలి. తీసుకున్న అనుమతి మేరకే నిర్మాణాలు చేపట్టాలి. సీసీ కెమెరాలు, లిఫ్టు సౌకర్యం, జనరేటర్‌ వంటివి తప్పక ఏర్పాటు చేయాలి. ● వ్యాపార సముదాయాలు నిర్మించేటప్పుడు అనుమతులు తప్పనిసరి. సరైన పార్కింగ్‌ సదుపాయం ఏర్పాటు చేయాలి. ఇవన్నీ ఎక్కడా సరిగా పాటించలేదు.

ఉల్లంఘనల పాపం.. రూ.5 కోట్లు పైనే

జంగారెడ్డిగూడెంలో రూ.5 కోట్లకుపైగా అవినీతి జరిగిందని అధికార పక్ష సభ్యులు ఇటీవల నిర్వహించిన పురపాలక సమావేశాల్లో విమర్శలు చేశారు. లెక్క తేల్చాలని కొందరు డిమాండు చేశారు. భవన నిర్మాణాలు, అక్రమ కట్టడాలు, అనధికారిక లే అవుట్లు ద్వారా పట్టణ ఆదాయానికి గండి కొట్టారని ఆరోపించారు. న్యాయమూర్తితో విచారణ చేయిస్తే అవినీతి నిగ్గు తేలుతుందని కోరారు.

అక్రమ కట్టడాలు నిర్మిస్తుంటే ఎందుకు పనులు ఆపలేదంటూ కొందరు నిలదీశారు. లే అవుట్లలో పది శాతం స్థలం మున్సిపాల్టీకి దక్కకుండా ఎగవేశారని ఆవేదన చెందారు. మేము ఫిర్యాదు చేస్తే నోటీసులు ఇచ్చి నిర్మాణదారుల వద్దకు వెళ్లి డబ్బులు తెచ్చుకునేవారని ఎద్దేవా చేశారు. ఈ ఆరోపణలన్నీ జరగారెడ్డిగూడెం పురపాలక సంఘంలో సాగుతున్న అతిక్రమణలకు పరాకాష్ఠ.

జంగారెడ్డిగూడెం పట్టణంలో 204 భవనాలను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని అధికారికంగా తేలింది. అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందంటున్నారు. ప్రధానంగా పురపాలక సంఘానికి రిజి౉స్ట్రషన్‌ చేసిన స్థలాలను సైతం వదలకుండా వందలాది భవనాలు నిర్మించారు. సెట్‌ బ్యాక్‌ పాటించకపోవడం, రెండు, మూడు భవనాలను కలిపి కట్టేయడం, 300 గజాల స్థలాల్లో సెల్లార్లు, నివాసాలకు అనుమతులు తీసుకుని దుకాణాలు, అనుమతుల్లేకుండాపై అంతస్తులు నిర్మించడం వంటి అతిక్రమణలు జరిగాయి. వీటి మాటున కొందరు అధికారులు భారీగా సొమ్ముచేసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పురపాలక సంఘంలోని అధికార పక్ష సభ్యులే ఇక్కడ జరిగిన అవినీతి, అక్రమాలపై న్యాయవిచారణ చేయాలని డిమాండు చేశారు. ఆరోపణలు ఎదుర్కొన్న అధికారిని ఇక్కడ నుంచి సాగనంపారు. అవినీతిపై సమగ్ర విచారణ చేయించాలని కలెక్టర్‌కు గత సోమవారం జరిగిన పురపాలక సమావేశం ద్వారా విన్నవించారు. పురపాలక ఆర్‌డీ సత్యనారాయణ దీనిపై విచారణ చేస్తున్నారు. ఇప్పటికే నిబంధనలు పాటించకుండా నిర్మించిన ఏడు భవనాలకు రూ.కోటి మేరకు అపరాధరుసుము విధించారు. వీటితో పాటు మరో 80 భవనాల యజమానులకూ నోటీసులు జారీ చేశారు.

ఏలూరు శాంతినగర్‌లోని ఓ అపార్టుమెంటుకు కనీస సెట్‌ బ్యాక్‌లేదు. ప్రహరీకు.. అపార్ట్‌మెంట్‌ ప్లింత్‌ (నిర్మాణ) ఏరియాకు ఒక్క అడుగు కూడా దూరంలేదు. సరిగ్గా ప్రహరీ పైనే.. రోడ్డుకు ఆనుకునే నిర్మించి ఫ్లాట్లుగా అమ్మేశారు. నగరంలోని ఆర్‌ఆర్‌పేట, అశోక్‌నగర్‌ ప్రాంతాల్లో ఇలాంటి అపార్ట్‌మెంట్‌లు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వ్యాపార సముదాయాలు కోకొల్లలుగా వెలిశాయి. ఇంత స్పష్టంగా కళ్లెదుటే అయిదంతస్తుల అక్రమాలు కనిపిస్తోంటే అధికారులకు కనిపించలేదనే విమర్శలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని