logo

ఎప్పటిలానే..

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సమస్యలు స్వాగతం పలకనున్నాయి. నూతన విద్యా సంవత్సరం (2022-23) శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. విద్యారంగంలో నూతన విధానాల అమలులో భాగంగా ప్రతి మండలానికి ఒక ప్రభుత్వ బాలికల జూనియర్‌

Published : 01 Jul 2022 03:27 IST

జూనియర్‌ కళాశాలల్లో సమస్యల తోరణాలు

నేటి నుంచి పునఃప్రారంభం

తరగతిగదిలోనే ప్రయోగశాల

ఏలూరు విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సమస్యలు స్వాగతం పలకనున్నాయి. నూతన విద్యా సంవత్సరం (2022-23) శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. విద్యారంగంలో నూతన విధానాల అమలులో భాగంగా ప్రతి మండలానికి ఒక ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల నెలకొల్పనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇందుకోసం జడ్పీ ఉన్నత పాఠశాలలను వర్గోన్నతి చేయనున్నట్లు పేర్కొంది. వీటిని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తారా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత ఏర్పడలేదు.

వెంటాడుతున్న ఇబ్బందులు

* దాదాపు 60 వసంతాల చరిత్ర కలిగిన పాలకొల్లు ఏఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను జిల్లాల విభజనకు ముందు షిఫ్టుల విధానంలో డిగ్రీ కళాశాల ఆవరణలో నడిపేవారు. 1996లో విడిగా జూనియర్‌ కళాశాల ప్రారంభమైనప్పటి నుంచి ఏడు గ్రూపులను బోధిస్తున్నారు. ఏటా దాదాపు 600 మంది చదువుకుంటున్నారు. వీరికి తగినన్ని తరగతి గదులు లేనందున వరండాలో, సిబ్బంది విశ్రాంతి తీసుకునే గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు.  

* తణుకులోని చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థుల సంఖ్య బాగానే ఉన్నా మౌలిక సదుపాయాలు లేవు. మరుగు దొడ్ల వినియోగానికి నీటి సౌకర్యం లేదు. తాగునీటి సదుపాయమూ లేదు. తాగునీటిని బయటి నుంచి తెచ్చుకోవాల్సి వస్తోంది. విద్యార్థుల సంఖ్యకు తగినన్ని తరగతి గదులు, అవసరమైన ఫర్నిచర్‌ లేదు.


పాతికేళ్లుగా పరాయిపంచనే!

చిందరవందరగా తరగతి గది

యలమంచిలి, న్యూస్‌టుడే: యలమంచిలి జూనియర్‌ కళాశాల 1997లో ప్రారంభించారు. సొంత భవనం లేక స్థానిక ఉన్నత పాఠశాల పైఅంతస్తులో ఒక పక్కన తరగతుల నిర్వహణకు తాత్కాలికంగా కేటాయించారు. అప్పట్నుంచి భవనం నిర్మించింది లేదు. మొత్తం నాలుగు విభాగాలుండగా సుమారు వంద మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. కార్యాలయం, ప్రయోగశాలకు, గదులు సరిపడక తరగతి గదుల్లోనే ఇరుకిరుకుగా కొనసాగిస్తున్నారు. ప్రత్యేకంగా మరుగుదొడ్లు లేక ఉన్నత పాఠశాలకు ఉన్న వాటినే వినియోగిస్తున్నారు.


ఖరారుకాని విధి విధానాలు

మండలానికి ఒకటి చొప్పున ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. ఏలూరు జిల్లాలో 26, పశ్చిమగోదావరి జిల్లాలో 18 కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. వీటిలో కొన్నింటిని ఈ విద్యా సంవత్సరం, మరికొన్నింటిని వచ్చే సంవత్సరం ప్రారంభిస్తారంటూ ప్రచారం సాగుతోంది. కొత్తగా ఏర్పడే కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియను చేపట్టడం తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి రాతపూర్వక ఉత్తర్వులు వెలువడాల్సి ఉందని ఏలూరు డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని తెలిపారు.


 మరుగుదొడ్ల పరిస్థితి ఇలా..

అత్తిలి, న్యూస్‌టుడే: కరోనా పరిస్థితులకు ముందు అత్తిలి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పునాది వద్ద నిర్మాణ పనులు ఆగిపోయాయి. విద్యార్థులకు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో ఆంగ్లమాధ్యమ తరగతులు ప్రారంభమైతే జూనియర్‌ కళాశాల విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని