logo

వైౖద్యం డొల్ల.. జేబులు గుల్ల!

 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిత్యం ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయి. జ్వరం వచ్చిందని ఆసుపత్రికి వెళ్తే చాలు అక్కడ వైద్యులు బాదుడే బాదుడు అన్న చందంగా రోగుల నుంచి అందినకాడికి

Published : 05 Aug 2022 05:23 IST

 వణికిస్తున్న బిల్లులు
 ప్రైవేటు ఆసుపత్రుల్లో నిలువు దోపిడీ
తణుకు, న్యూస్‌టుడే:

 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిత్యం ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయి. జ్వరం వచ్చిందని ఆసుపత్రికి వెళ్తే చాలు అక్కడ వైద్యులు బాదుడే బాదుడు అన్న చందంగా రోగుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. కొంత మంది ఆర్థిక స్థోమతలేని బాధితులు బిల్లులు చెల్లించేందుకు పుస్తెలు సైతం విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఎక్కడ చూసినా.. కాలానుగుణ వ్యాధుల ప్రభావంతో ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. పలు చోట్ల ఓపీ నమోదుకే ఒక పూటంతా నిరీక్షించాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వైద్యుడిని కలవాలంటే రూ.300 నుంచి రూ.600 వరకు వసూలు చేస్తున్నారు. కొన్నిచోట్ల నెల రోజులు ఉన్న ఓపీని పదిహేను రోజులకు కుదించడం గమనార్హం.  సూపర్‌ స్పెషాలిటీ పేరుతో సాధారణ గదిలో ఉన్న వారి నుంచి రోజుకు రూ. 8 వేల నుంచి రూ.10 వేల వరకు ఛార్జీ వేస్తున్నారు. సాధారణ జ్వరమైనా వైద్యుడు నాడి పట్టాలంటే ముందు పరీక్షలు, స్కానింగ్‌ తప్పనిసరి. సాధారణ జ్వరం, జలుబుతో ఆసుపత్రికి  వెళ్తే రూ.50 వేలు వసూలు చేస్తున్నారు. మరో వైపు పీఎంపీలు కమీషన్ల కోసం రోగులను కార్పొరేట్‌ ఆసుపత్రులకు సిఫార్సులు చేస్తున్నారు.

*తణుకులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో జ్వరంతో బాధపడుతూ వృద్ధుడు చికిత్స నిమిత్తం చేరారు. అతనికి రెండు రోజులు చికిత్స చేశారు. సుమారు రూ. 80 వేల వరకు బిల్లు వసూలు చేశారు. బిల్లు చెల్లించినా పరిస్థితి విషమంగా ఉందని మరో ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించడంతో అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. దీంతో బాధిత బంధువులు, సంఘ నాయకులు ఆసుపత్రి యాజమాన్యంతో ఘర్షణకు దిగారు. దీంతో ఆ నగదు మొత్తం తిరిగి ఇచ్చారు.
*భీమవరంలో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో వైద్యం వికటించి యువకుడు మృతి చెందారు.
*తణుకు మండలం మండపాక గ్రామానికి చెందిన బాలుడు జ్వరం, వాంతులతో బాధ పడుతూ తణుకులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరాడు. రెండు రోజుల పాటు చికిత్స అందించి రూ.40 వేల బిల్లు వసూలు చేశారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉందని రైల్వే స్టేషన్‌ రోడ్డులో ఉన్న ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స నిమి త్తం ముక్కు ద్వారా గొట్టం పంపే క్రమంలో బాలుడు మృతి చెందాడు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ కుమారుడు మృతి చెందాడని బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.
 
* ‘‘ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో రోగుల నుంచి అధికంగా వసూలు చేస్తున్నట్లు  ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఆసుపత్రులు, ప్రైవేటు ల్యాబ్‌ల్లో డెంగీ పరీక్షలు చేయకూడదు. కానీ కొన్ని ఆసుపత్రుల్లో చేస్తున్నారు. ప్రైవేట్‌ ల్యాబ్‌లను ఆశ్రయించి నగదు వృథా చేసుకోవద్దు.’’ అని వైద్యాధికారి బి.రవి తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు : సుమారు 600
నిత్యం రోగుల సంఖ్య  1.40 లక్షల మంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని