logo

చేతులు తడిపితేనే ప్యాకేజీ!

పోలవరం పునరావాసంలో 41.15 కాంటూరు పరిధిలోని గ్రామాలకు వచ్చే సెప్టెంబరు నెలాఖరులోగా ప్యాకేజీ చెల్లిస్తామని చెబుతున్న నేపథ్యంలో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కాంటూరు పరిధిలోని గ్రామాల్లో దళారులు రంగప్రవేశం చేశారు.

Updated : 06 Aug 2022 06:57 IST

నిర్వాసితుల నుంచి డబ్బులు గుంజుతున్న దళారులు

కుక్కునూరు, న్యూస్‌టుడే: పోలవరం పునరావాసంలో 41.15 కాంటూరు పరిధిలోని గ్రామాలకు వచ్చే సెప్టెంబరు నెలాఖరులోగా ప్యాకేజీ చెల్లిస్తామని చెబుతున్న నేపథ్యంలో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కాంటూరు పరిధిలోని గ్రామాల్లో దళారులు రంగప్రవేశం చేశారు. ముందుగా  పరిహారం ఖాతాల్లో జమ కావాలంటే రూ.5 వేలు చెల్లించాలనే ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. ఇస్తే ఏమౌతుందో, ఇవ్వకపోతే పరిహారం పోతుందేమో అన్న సందిగ్ధంతో నిర్వాసితులు కొట్టుమిట్టాడుతున్నారు. పోతే రూ.5 వేలే కదా.. ఇవ్వకుంటే రూ.6 లక్షలు పోతాయనే భయంతో కొద్దిమంది చెల్లిస్తున్నారు. ఐటీడీఏ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్‌అండ్‌ఆర్‌ కార్యాలయంలో కొందరు అధికారులు ఈ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కుక్కునూరు మండలంలో ఇది బహిరంగరహస్యంగా ఉంది. దళారులు యథేచ్ఛగా ఈ ప్రచారం కొనసాగిస్తూ, ఇచ్చినవారి నుంచిడబ్బులు వసూలు చేస్తున్నారు.

ఇళ్ల కేటాయింపుల్లోనూ చేతివాటం..

పునరావాసంలో భాగంగా తాడువాయి సమీపంలో నిర్వాసితులకు కేటాయిస్తున్న ఇళ్లల్లోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. వేల సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతం పెద్ద పట్టణంగా మారే సూచనలు ఉన్నాయి. దీంతో 41.15 కాంటూరు పరిధిలోని కొందరు నిర్వాసితులు ముందుగానే అక్కడ ఇళ్లను కేటాయింపజేసుకుంటున్నారు. ప్రధాన కూడలి, రహదారుల పక్కన ఉన్న గృహాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో ఓ డిప్యూటీ తహసీల్దార్‌ అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. వేలేరుపాడుకు చెందిన ఓ నిర్వాసితురాలు ఈ విషయమై స్పందన కార్యక్రమంలో ఇప్పటికే ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం అయితే ఎస్‌ఈఎస్‌(సామాజిక, ఆర్థిక సర్వే) సర్వే ప్రకారం పాత గ్రామాల్లో కేటాయించిన నంబర్లు మేరకు ఇళ్లు కేటాయించాలి. కానీ ఆ నిబంధనలను పాటించకుండా చేతులు తడిపిన వారికి రహదారుల పక్కన, ప్రధాన కూడళ్లలో ఇళ్లు కేటాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంతో ఆ నిర్వాసితురాలు వివరాలతో ఫిర్యాదు చేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని