logo
Updated : 06 Aug 2022 06:49 IST

ఎమ్మెల్యేను మాట్లాడనివ్వరా?

 వ్యవస్థను కాపాడాల్సింది అధికారులే : నిమ్మల

కలెక్టర్‌ ఛాంబర్‌ ఎదుట బైఠాయింపు

కలెక్టర్‌తో మాట్లాడుతున్న  రామానాయుడు, పక్కన రామరాజు, రామ్మోహన్‌

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వాలు మారతాయి.. పదవుల్లో ఈ రోజు మేముంటాం.. రేపు మరొకరు ఉండొచ్చు. కానీ వ్యవస్థ శాశ్వతమని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులో టిడ్కో ఇళ్ల పంపిణీ సందర్భంగా అధికారులు ప్రొటోకాల్‌ పాటించలేదని, స్థానిక ఎమ్మెల్యేనైన తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోగా నెట్టివేశారంటూ భీమవరంలోని కలెక్టరేట్‌ వద్ద శుక్రవారం ఆయన ఎమ్మెల్సీ రామమోహన్‌, ఎమ్మెల్యే రామరాజుతో కలిసి నిరసనకు దిగారు. కలెక్టర్‌ ఛాంబర్‌ బయట దాదాపు నాలుగు గంటల పాటు బైఠాయించారు. ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యేను మాట్లాడనివ్వరా అంటూ కలెక్టర్‌ ప్రశాంతిని ప్రశ్నించారు. మంత్రులు మాట్లాడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యేకు అవకాశం లేకుండా మైక్‌ కట్‌ చేశారన్నారు. దీనిపై సబ్‌కలెక్టర్‌ను అడిగినా స్పందన లేదన్నారు. మంత్రులు, సబ్‌కలెక్టర్‌ సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి జారుకున్నారని విమర్శించారు. వైకాపా నాయకులు మాపై దాడి చేస్తుంటే డీఎస్పీ తన సిబ్బందితో అక్కడ ఉండి కూడా అడ్డుకునే ప్రయత్నం చేయకుండా పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఇక్కడ ఇళ్ల పంపిణీలో మాట్లాడలేదా.. తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ మాట్లాడలేదా? పాలకొల్లులో స్థానిక  ఎమ్మెల్యేనైన నేను, ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ మాట్లాడకూడదా.. ఇదెక్కడి న్యాయం.. అధికారులు పాటించే ప్రొటోకాల్‌ ఇదేనా అంటూ ప్రశ్నించారు. వేదికపైకి  రాకుండా అడ్డుకుని నెట్టివేస్తే అంత మంది పోలీసులు ఉండి ఏం చేస్తున్నారని నిలదీశారు. అందుకే తాను నిరసనకు దిగానని.. మీరేం చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. శిలాఫలకం మీరే పంపారా అని కలెక్టర్‌ను అడిగారు.. అది పైనుంచి వచ్చిందని కలెక్టర్‌ సమాధానమివ్వడంతో.. ఈ అంశాన్ని అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ దృష్టికి తీసుకెళ్తామని నిమ్మల తెలిపారు. దానిపై కలెక్టర్‌ స్పందిస్తూ పంపించండి అని బదులిచ్చారు. అనంతరం వీడియో సమావేశం ఉందంటూ కలెక్టర్‌ వెళ్లిపోయారు. తెదేపా జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు తదితరులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా నిమ్మల నిరసనను కొనసాగించారు. రెండు గంటల తర్వాత సమావేశం ముగించుకుని వచ్చిన కలెక్టర్‌తో నాయకులు మాట్లాడారు. చివరకు త్వరలోనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో రామానాయుడు నిరసనను విరమించారు. 

తరలి వచ్చిన శ్రేణులు 

రామానాయుడు కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టిన సమాచారం అందుకున్న తెదేపా కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.  తెదేపా రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి,  రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, పట్టణ కన్వీనర్‌ వేండ్ర శ్రీనివాస్‌, జిల్లా ఉపాధ్యక్షుడు మామిడిశెట్టి ప్రసాద్‌, మద్దుల రాము, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు తదితరులు నిమ్మలకు మద్దతుగా నేలపై బైఠాయించి నిరసన తెలిపారు.

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts