logo

ముంపు ముంగిట..భయం గుప్పిట!

ఎర్రకాలువ మళ్లీ కన్నెర్ర చేసింది. నందమూరు అక్విడక్టు వద్ద ప్రవాహ ఉద్ధృతి పెరగడంతో ఇప్పటికే ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Updated : 10 Aug 2022 04:53 IST

ప్రమాదకరంగా యనమదుర్రు డ్రెయిన్‌ గట్లు

పాలకోడేరు మండలం గరగపర్రు సమీపాన బలహీనంగా గట్టు

భీమవరం పట్టణం, గణపవరం, న్యూస్‌టుడే

ఎర్రకాలువ మళ్లీ కన్నెర్ర చేసింది. నందమూరు అక్విడక్టు వద్ద ప్రవాహ ఉద్ధృతి పెరగడంతో ఇప్పటికే ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పరీవాహక ప్రాంతాలకు ముంపు ముప్పు పొంచి ఉండటంతో యనమదుర్రు డ్రెయిన్‌ పరిధిలో రైతులు ఆందోళన చెందుతున్నారు. డ్రెయిన్‌ నిర్వహణ, శాశ్వత నిర్మాణాలపై యంత్రాంగం దృష్టి సారించకపోవడంతో ఏటా సార్వా సాగుపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాద ఘంటికలు..
ఎర్రకాలువ తాడేపల్లిగూడెం మండలం నందమూరు అక్విడక్టు నుంచి యనమదుర్రు డ్రెయిన్‌గా మారుతుంది. తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం, తణుకు, పాలకోడేరు, ఉండి, భీమవరం మండలాల్లో పలు గ్రామాల మీదుగా 61.5 కిలోమీటర్లు ప్రవహించి మొగల్తూరు మండలంలో సముద్రంలో కలుస్తుంది. డెల్టా ఆధునికీకరణలో భాగంగా 2008లో రూ.60 కోట్లు మంజూరవగా.. మట్టి పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. చాలా చోట్ల గట్టు బలహీనంగా ఉంది. ఔట్‌లెట్లు, ఇన్‌లెట్లను పటిష్ఠపరచలేదు. ప్రవాహ ఉద్ధృతి పెరిగితే గట్టుకు గండిపడటంతో పాటు షట్టర్లు లేచిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ పరిస్థితి
* పాలకోడేరు మండలం గరగపర్రు సమీపాన యనమదుర్రు డ్రెయిన్‌ గట్టు బలహీనంగా మారడంతో తడికలు, కర్రలతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. అవి ప్రవాహ ఉద్ధృతికి దిగబడిపోవడంతో గట్టు కోతకు గురవుతుంది.  గతంలో ఇదే ప్రాంతంలో గట్టు బలహీనంగా మారి వరద నీరు పొంగి ప్రవహించగా ఇసుక, మట్టి సంచులు వేసి తాత్కాలిక మరమ్మతులు చేశారు.
* గణపవరం మండల పరిధిలో యనమదుర్రు డ్రెయిన్‌ ఇన్‌లెట్లు శిథిల దశకు చేరుకున్నాయి. చిలకంపాడు సెక్షన్‌ పరిధిలో కుడిగట్టుకు పెంటపాడు మండలం బి.కొండేపాడు, గణపవరం మండలం కోమర్రు, పిప్పర, కేశవరాల్లో ఇన్‌లెట్లు ఉన్నాయి. వీటి మరమ్మతులకు వేసవిలో రూ.8.60 లక్షలు మంజూరయ్యాయి. గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో ఆ పనులు చేపట్టలేదు.
* మండపాక సెక్షన్‌ పరిధిలోకి వచ్చే ఎడమ గట్టుకు గణపవరం మండల పరిధిలో ఆరు ఇన్‌లెట్లు ఉన్నాయి. వీటిలో మూడు చోట్ల కొత్తవి ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.1.14 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు.
* భీమవరం పరిధిలో శిథిల షట్టర్ల మరమ్మతులు, కొత్తగా తలుపులు బిగించేందుకు రూ.10 లక్షలు కేటాయించారు. ఇంకా పనులు పూర్తికాలేదు.

గండ్లు పడి..
గతంలో యనమదుర్రు డ్రెయిన్‌కు అనేకచోట్ల గండ్లు పడి పలు ప్రాంతాలు ముంపు బారినపడ్డాయి. ఉండి మండలం యండగండి వద్ద, గణపవరం మండలం కేశవరం, పిప్పర వద్ద గట్టుపై నుంచి వరదనీరు పొంగి గ్రామాల్లోకి చేరింది. 1986లో గండి పడటంతో భారీస్థాయిలో ఆస్తి నష్టం జరిగింది. పలు మండలాల్లో దాదాపు 50 వేల ఎకరాల్లో వృథా నీటితో పాటు మేజర్‌ డ్రెయిన్ల నుంచి వచ్చే మురుగంతా యనమదుర్రులోకే చేరుతుంది. కొన్నిచోట్ల ఈ డ్రెయిన్‌ వెడల్పు తగ్గిందని, ప్రవాహ సామర్థ్యానికి తగ్గట్టుగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని జలవనరుల నిపుణులు సూచిస్తున్నారు.

ఇటీవల కొద్దిపాటి వర్షానికే పిప్పరలో జలమయమైన కాలనీ

గుర్తించి చర్యలు చేపడతాం
దువ్వ ప్రాంతానికి ఎగువన యనమదుర్రు డ్రెయిన్‌ గట్టు బలహీనంగా ఉన్నచోట ఇటీవల మరమ్మతులు చేయించామని జలవనరుల శాఖ ఈఈ దక్షిణామూర్తి చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడైనా గట్టు కోతకు గురైనా, బలహీనంగా ఉన్నా గుర్తించి తగు చర్యలు చేపడతామన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని