logo

త్యాగాల దీప్తి.. ఉద్యమ స్పూర్తి..!

స్వాతంత్య్ర సంగ్రామంలో కొల్లేటి ప్రాంత వాసుల పాత్ర అజరామరంగా నిలిచిపోతుంది. బ్రిటిష్‌ పాలకుల ఉన్మాదాలు..     భారతీయులకు ఊపిరాడనివ్వని ఉదంతాలు ఇక్కడ ప్రజల్లో ఉక్రోశాన్ని నింపాయి. వారి త్యాగాలు ఇప్పటికీ ప్రజా హృదయాల్లో నిలిచే ఉన్నాయి.

Published : 10 Aug 2022 04:52 IST

జీవితాన్ని ప్రేమిస్తాం..

మరణాన్ని ప్రేమిస్తాం..

మేము మరణించి, ఎర్రపూలవనంలో పూలై పూస్తాం..  -భగత్‌సింగ్‌

స్వాతంత్య్రానికి పూర్వం, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జిల్లా ఆవిర్భవించింది. 1925లో ఏలూరు ప్రధాన కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడింది. అప్పటి వరకూ ఉభయ గోదావరి జిల్లాలు గోదావరి జిల్లా పేరుతో ఉండేవి. 1925లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలుగా విభజించారు.
-న్యూస్‌టుడే, కుక్కునూరు

కలిదిండి, న్యూస్‌టుడే : స్వాతంత్య్ర సంగ్రామంలో కొల్లేటి ప్రాంత వాసుల పాత్ర అజరామరంగా నిలిచిపోతుంది. బ్రిటిష్‌ పాలకుల ఉన్మాదాలు..     భారతీయులకు ఊపిరాడనివ్వని ఉదంతాలు ఇక్కడ ప్రజల్లో ఉక్రోశాన్ని నింపాయి. వారి త్యాగాలు ఇప్పటికీ ప్రజా హృదయాల్లో నిలిచే ఉన్నాయి.  
ఎందరో మహానుభావులు.. కైకలూరు ప్రాంతానికి చెందిన అనేక మంది ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆంగ్లేయుల  బెదిరింపులు.. దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలిచారు. గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, ఘంటా పేరయ్య, మాగంటి సత్యనారాయణ, కంతేటి కాశీవిశ్వనాథం, మాగంటి నాయుడమ్మ, రుద్రరాజు సత్యనారాయణరాజు, చిర్రవూరి అచ్యుతరామయ్య, మేకా తిరుపతయ్య, పొన్నాడ శ్రీరామచంద్రుడు, ఉన్నూరు నరసింహరాజు, గుంటూరు రామదాసు వంటి వారెందరో ఉద్యమానికి ఊపిరి పోశారు. మహిళలు సైతం కదంతొక్కారు.

బుడిబుడి అడుగులు వేశా..
భారతగడ్డపై మువ్వన్నెల జెండా ఎగిరే నాటికి నాకు పన్నెండేళ్లు. చిరుప్రాయంలోనే గాంధీ, నెహ్రూ వంటి జాతీయ నేతల మాటలు ఎంతగానో ప్రభావం చూపించేవి. కొల్లేరు ప్రాంత ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమంలో పాలుపంచుకునేవాళ్లు. రాత్రి, పగలు తేడా లేకుండా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ..   పోరాట పటిమ చూపించేవారు. ఎన్నోసార్లు ఆ సభల వైపు  బుడిబుడి అడుగులు వేశా.87 ఏళ్ల వయసులోనూ ఆ ఉత్తేజం.. ఉద్వేగం ఇప్పటికీ నా నరనరాల్లో ఉరకలేస్తూనే ఉంది.   - చెరుకువాడ శివరామరాజు, రామకృష్ణ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, దొడ్డిపట్ల  

ఊరంతా ఒక్కతాటిపై..
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించే నాటికి నాకు ఏడేళ్లు. ఊరంతా ఒకటే బాట.. బడికెళ్లినా అదే మాట. ‘ఆంగ్లేయులను తరిమికొట్టాలి.. దేశాన్ని కాపాడుకోవాలి’ అన్న తలంపే అందరిలోనూ ఉండేది. ‘ఎక్కడెక్కడ సభలు పెట్టారు.. ఎవరెవరు హాజరయ్యారు?’ అనే విషయాలు నాన్న తన మిత్రులతో చర్చిస్తుంటే వినేవాణ్ని. రేడియోలో జాతీయ నాయకుల ఉపన్యాసాలు ప్రేరణ నింపేవి. ఆంధ్రరాష్ట్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నా. 9వ తరగతి చదువుతున్న సమయంలో ఉండిలో రైలును నిలిపివేసిన ఘటనలో పాలుపంచుకున్నా. - నంబూరి వెంకటపతిరాజు, పోతుమర్రు

జనం గుండెల్లో ‘కల్నల్‌ డీఎస్‌ రాజుగా’..
విద్యావంతునిగా.. వైద్యునిగా.. మేజర్‌గా బహుముఖ రూపాల్లో స్వాతంత్య్ర ఉద్యమానికి ఊతమిచ్చారు పశ్చిమగోదావరి జిల్లా పోడూరు గ్రామానికి చెందిన దాట్ల సత్యనారాయణరాజు. చిన్ననాటి నుంచి మానవతా దృక్పథంతో వైద్య వృత్తిని చేపట్టి.. 1934 నుంచి 1945 వరకు సైన్యంలోని వైద్య విభాగంలో విశిష్ట సేవలందించారు. వైద్య విద్యాభివృద్ధి, వైద్యపరమైన పరిశోధనలు, స్వచ్ఛంద వైద్య సాయం తదితర లక్ష్యాలతో 1958లో కాకినాడలో రంగరాయ మెడికల్‌ కళాశాల నిర్మాణానికి కృషి చేశారు. 1957, 1962, 1967లో కాంగ్రెస్‌ తరఫున రాజమహేంద్రవరం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. వైద్య, రక్షణ శాఖల్లో డిఫ్యూటీ మంత్రిగా పని చేశారు. 1973లో తుదిశ్వాస విడిచిన సత్యనారాయణరాజు జనం గుండెల్లో ‘కల్నల్‌ డీఎస్‌ రాజు’గా చెరగని ముద్ర వేసుకున్నారు.


దాట్ల సత్యనారాయణరాజు (పాతచిత్రం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని