logo

నేపథ్యం గ్రామీణం.. ప్రతిభ జాతీయం!

జంగారెడ్డిగూడెం సీఎస్‌టీఎస్‌ డిగ్రీ కళాశాల విద్యార్థినులు కబడ్డీ, వాలీబాల్‌ క్రీడల్లో మేటిగా రాణిస్తున్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం జట్టులో చోటు సాధించడమే కాకుండా దక్షిణ భారతదేశ స్థాయిలో నిర్వహించిన అంతర విశ్వవిద్యాలయాల పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు.

Updated : 10 Aug 2022 05:10 IST

వాలీబాల్‌ సాధన చేస్తున్న క్రీడాకారిణులు

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం సీఎస్‌టీఎస్‌ డిగ్రీ కళాశాల విద్యార్థినులు కబడ్డీ, వాలీబాల్‌ క్రీడల్లో మేటిగా రాణిస్తున్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం జట్టులో చోటు సాధించడమే కాకుండా దక్షిణ భారతదేశ స్థాయిలో నిర్వహించిన అంతర విశ్వవిద్యాలయాల పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు. పూర్తి గ్రామీణ నేపథ్యం కలిగిన ఈ విద్యార్థినులు కళాశాల పీడీ, ప్రిన్సిపల్‌, ఇతర అధ్యాపకులు అందిస్తున్న ప్రోత్సాహంతో క్రీడల్లో మరింత రాణించేందుకు నిరంతర సాధన చేస్తున్నారు.

ఏడో తరగతి నుంచి ఆడుతున్నా
‘నన్నయ విశ్వవిద్యాలయం కబడ్డీ జట్టు సభ్యురాలిని. ఏడో తరగతి నుంచి ఆడుతున్నా. తమిళనాడు అలగప్ప యూనివర్సిటీలో నిర్వహించిన అంతర విశ్వవిద్యాలయాల కబడ్డీ పోటీల్లో పాల్గొన్నా. విజయవాడ, మార్టేరు, కర్నూలు, నెల్లూరులో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆడా. ప్రొకబడ్డీ జట్టులో ఆడాలన్నది నా కోరిక. వ్యాయామ ఉపాధ్యాయిని అవడం నా లక్ష్యం’ అని అంకన్నగూడేనికి చెందిన పైదా అనూష తెలిపారు.

క్రీడా కోటాలో ఉద్యోగమే లక్ష్యం
‘నాకు వాలీబాల్‌ అంటే ఇష్టం. నన్నయ యూనివర్సిటీ మహిళా జట్టుకు ఎంపికయ్యా. ఈ ఏడాది చెన్నైలో నిర్వహించిన సౌత్‌ జోన్‌ పోటీల్లో విశ్వవిద్యాలయం తరఫున ఆడా. జాతీయ క్రీడాకారిణిగా ఎదగాలనుకుంటున్నా. క్రీడా కోటాలో ఉద్యోగం సాధించాలనుకుంటున్నాను’ అని లచ్చిగూడేనికి చెందిన జోడే కీర్తి పేర్కొన్నారు.

కబడ్డీ, అథ్లెటిక్స్‌లో ప్రావీణ్యం
‘సీఎం కప్‌, తాడేపల్లిగూడెంలో అంతర్‌ కళాశాలల, ఏపీ రెసిడెన్షియల్‌ కళాశాలల ఛాంపియన్‌ షిప్‌ కబడ్డీ పోటీల్లో పాల్గొన్నా. జాతీయ స్థాయిలో మూడో స్థానం సాధించా. ఆరో తరగతి నుంచి ఆడుతున్నా. అనేక పతకాలు సాధించా. కబడ్డీతో పాటు అథ్లెటిక్స్‌లోనూ ప్రావీణ్యం ఉంది. ఇటీవల వైజాగ్‌లో నిర్వహించిన 400 మీటర్ల రిలేలో పాల్గొన్నా. ఎస్సై కావాలన్నది నా ఆశయం’ అని మామిడిగొందికి చెందిన సున్నం అంజలి చెప్పారు.

పీడీ అవుతా
‘ఆరో తరగతి నుంచి వాలీబాల్‌ ఆడుతున్నా. నాలుగుసార్లు జాతీయ స్థాయిలో ఆడా. పలు పతకాలు అందుకున్నా. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం జట్టులో సభ్యురాలిని. చెన్నైలో నిర్వహించిన దక్షిణ భారత అంతర్‌ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొన్నా. ఫిజికల్‌ డైరెక్టర్‌ కావాలనుకుంటున్నాను’ అని అరవపల్లికి చెందిన పాయం కీర్తి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని