logo

జోరుగా జూదాలు.. ప్రశ్నిస్తే దాడులు

జూద క్రీడలకు మెట్ట మండలాలు కేంద్రాలుగా మారాయి. సామాజిక బాధ్యతతో సామాన్యులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా దాడులకు తెగబడుతున్నారు. పోలీసుల అండదండలతో..నాయకుల కనుసన్నల్లో పేకాట, కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Published : 10 Aug 2022 06:28 IST

నాయకులు, పోలీసుల అండతో యథేచ్ఛగా పేకాట, కోడిపందేలు


* ‘నా పొలం సమీపంలో కొందరు పేకాడుతున్నారు. మద్యం తాగి ఖాళీ సీసాలను నా పొలంలో వేస్తున్నారు. ఎన్ని సార్లు చెప్పినా లెక్క చేయలేదు. వైకాపా కనుసన్నల్లో పని చేస్తున్నారని తెలియక స్థానిక ఎస్సై పేకాట ఆడుతున్న వీడియో పంపించి, చర్యలు తీసుకోవాలని కోరాను. వెంటనే దానిని ఆయన వైకాపా నాయకులకు పంపించారు. ద్విచక్రవాహనంపై వెళుతుండగా వారు నా పై దాడి చేశారు.  కర్రలతో చితకబాదారు. విలువైన నా ఫోన్‌ లాక్కున్నారు. ఏలూరు ఆసుపత్రికి వెళితే కనీసం చేర్చుకోకుండా ప్రథమ చికిత్స చేసి చేతులు దులుపుకున్నారు. ఎస్సై అన్యాయం చేశారని చెప్పినా అక్కడ సిబ్బంది ఎంఎల్‌సీ కూడా నమోదు చేయలేదు. నాపై  దాడి చేసి తిరిగి నామీదే కేసు పెట్టారు’ అని పెదవేగి మండలం రాయన్నగూడెంకు చెందిన సునీల్‌ అనే యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈనాడు డిజిటల్‌, ఏలూరు, న్యూస్‌టుడే-పెదవేగి: జూద క్రీడలకు మెట్ట మండలాలు కేంద్రాలుగా మారాయి. సామాజిక బాధ్యతతో సామాన్యులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా దాడులకు తెగబడుతున్నారు. పోలీసుల అండదండలతో..నాయకుల కనుసన్నల్లో పేకాట, కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. స్థావరాల నిర్వాహకులు మాత్రం రూ.లక్షలు దండుకుంటున్నారు.

శ్రుతి మించి
పెదవేగి, దెందులూరు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో పేకాట, కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. పెదవేగి మండలం కొండలరావుపాలెం-కలరాయగూడెం మధ్యలో ఉన్న తోటల్లో, పాండా చెరువు సమీపంలోని తోటల్లో షెడ్డు వేసి మరీ జూదం నిర్వహిస్తున్నారు. రాయన్నపాలెం సెంటర్‌కు సమీపంలోని టవర్స్‌ దగ్గర కూడా పేకాట స్థావరాలున్నాయి. ఒక్కో స్థావరంలో రోజుకు రూ.10లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ పేకాట నిర్వహణ సాగుతోంది. దెందులూరు మండలం పెరుగుగూడెంలో ఒక్క రోజుకు రూ.20-రూ.25 లక్షల వరకూ  చేతులు మారతాయంటే పరిస్థితి అర్థమవుతుంది. పేకాట ఆడేందుకు హనుమాన్‌ జంక్షన్‌, గన్నవరం తదితర ప్రాంతాల నుంచీ బడా బాబులు కార్లలో వస్తుంటారు. రాయన్నపాలెం వెంకటేశ్వరస్వామి ఆలయం దగ్గర, కొండలరావు పాలెం తోటల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారు.

అందరూ కుమ్మక్కు
ఓ వైపు పేకాట స్థావరాలు..మరోవైపు కోడి పందేల కోలాహలం యథేచ్ఛగా సాగుతున్నా నియంత్రించిన దాఖలాలు లేవు. స్థావరాల నిర్వాహకులకు రాజకీయ అండ పుష్కలంగా ఉందని చెబుతున్నారు. స్వయానా  ఓ ప్రజాప్రతినిధి బాబాయే నిర్వహిస్తున్నారని విమర్శలున్నాయి. నిర్వాహకులు, స్థానిక నాయకులు, పోలీసులు కుమ్మక్కై పేకాట స్థావరాలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని సమాచారం. పెదవేగి మండలంలో పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నారని వాటిని అరికట్టాలని రాయన్నపాలెం గ్రామస్థులు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోకపోగా వాళ్లు ఆడితే మీకెందుకు..మీ పని చూసుకోండని బెదిరించారని ఆ గ్రామస్థుడొకరు తెలిపారు. ఇలాగే ఫిర్యాదు చేసినందుకు తనపై వైకాపా నాయకులు మూకుమ్మడి దాడులు చేశారని పెదవేగికి చెందిన సునీల్‌ వాపోయారు. దీనిపై ఎస్సై సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ఘటనపై తనకు సమాచారం లేదని, ఎమ్మెల్సీ నివేదిక కూడా రాలేదని, అసలు వీడియో గురించి కూడా తనకు తెలియదని చెప్పారు.

ముడుపులు.. పేకాట స్థావరాలు ఏర్పాటు, పోలీసులతో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకునే బాధ్యత నిర్వాహకులదే. దీని కోసం భారీగానే ముడుపులు తీసుకుంటున్నారు. కొందరు ఎంత పందెం వేస్తే అందులో 10 శాతం కమీషన్‌గా వసూలు చేస్తున్నారు. రూ.2 లక్షల పందెం వేస్తే రూ.20 వేలు చెల్లించాల్సిందే. కొందరు రూ.2వేలు ప్రవేశ రుసుంగా వసూలు చేస్తున్నారు. ఇదంతా అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల నిర్వహణలోనే సాగుతున్నాయని విమర్శలున్నాయి.

విచారణ చేస్తున్నాం
పెదవేగి, దెందులూరు మండలాల్లో పేకాట స్థావరాలు ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. స్థానికంగా పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని స్పందనలో వినతి ఇచ్చారు. దీనిపై   విచారణ చేస్తున్నాం. పేకాట, కోడిపందేల నిర్వహణను నిరోధించేందుకు ఎస్‌ఈబీ బృందాలను పంపిస్తాం.
- రాహుల్‌దేవ్‌శర్మ, ఎస్పీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని