logo

పెరిగిన వరదపోటు

ఎగువ నుంచి వరదనీరు పోటెత్తడంతో గోదావరి మరింత ఉద్ధృతంగా మారింది. గురువారం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు సుమారు 13 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు విడుదల చేయడంతో జిల్లాలోని లంక గ్రామాలు దాదాపు రాకపోకలు నిలిచిపోయాయి. తీరం వెంబడి పెనుగొండ నుంచి

Published : 12 Aug 2022 02:46 IST

లంక గ్రామాలకు రాకపోకలు బంద్‌

పెదమల్లం మాచేనమ్మ ఆలయాన్ని చుట్టుముట్టిన వరద నీరు

ఆచంట, న్యూస్‌టుడే: ఎగువ నుంచి వరదనీరు పోటెత్తడంతో గోదావరి మరింత ఉద్ధృతంగా మారింది. గురువారం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు సుమారు 13 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు విడుదల చేయడంతో జిల్లాలోని లంక గ్రామాలు దాదాపు రాకపోకలు నిలిచిపోయాయి. తీరం వెంబడి పెనుగొండ నుంచి యలమంచిలి వరకు లోతట్టు లంక భూముల్లోకి వరదనీరు చేరుతోంది. ఆచంట మండలం పెదమల్లంలోని మాచేనమ్మ ఆలయాన్ని వరద చుట్టుముట్టింది. ఆలయ ఆవరణలోకి క్రమేపీ నీరు ప్రవేశిస్తోంది. పలు విశ్రాంతి భవనాలు ముంపు బారిన పడ్డాయి. కరుగోరుమిల్లి పుష్కరఘాట్‌తో సహా మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు నీట మునిగాయి. అయోధ్యలంక పరిధిలోని మర్రిమూల, పుచ్చల్లంక, రావిలంకలో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. యలమంచిలి మండలంలోని కనకాయలంక కాజ్‌వేపై సుమారు నాలుగు అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు. లంకవాసులు పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు. యలమంచిలి లంక, గంగడపాలెం, పెదలంక, బాడవలోని లంక భూములు ముంపు బారిన పడుతున్నాయి. వరద ఉద్ధృతి మరింత పెరిగితే లోతట్టు ప్రాంతాల్లోని లంక గ్రామాల్లోకి నీరు ప్రవేశించే ప్రమాదం పొంచి ఉంది. మరో పక్క నీటి ప్రవాహం వేగంగా ఉండటంతో నదిపై నాటు పడవల రాకపోకలు ఆగిపోయాయి.

కరుగోరుమిల్లిలో  మునిగిన పుష్కరఘాట్‌

ముందే జాగ్రత్త పడుతున్న లంక రైతులు.. గత నెలలో వరదతో తీవ్రంగా నష్టపోయిన రైతులు ముందే మేల్కొంటున్నారు. లంక భూముల్లోని కొబ్బరితోటల్లో నిల్వ చేసిన కొబ్బరికాయలను ఆఘమేఘాలపై సురక్షిత ప్రాంతాలకు చేర్చుతున్నారు. పలువురు పడవలపై కోడేరు, కరుగోరుమిల్లి, భీమలాపురం పుష్కరఘాట్లకు చేర్చి అక్కడ నుంచి ట్రాక్టర్లపై గట్టుకు తరలిస్తున్నారు.

తగ్గిన ఎర్రకాలువ ప్రవాహ ఉద్ధృతి

తాడేపల్లిగూడెం, న్యూస్‌టుడే: ఎర్రకాలువ ప్రవాహ ఉద్ధృతి తగ్గింది. కొంగువారుగూడెం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల తగ్గించారు. బైనేరు, పులి వాగులు తగ్గుముఖం పట్టాయి. తాడేపల్లిగూడెం మండలం మాధవరం వద్ద సాధారణ స్థాయిలో ప్రవహిస్తోంది. నందమూరు అక్విడక్టు వద్ద 28.3 అడుగులకు తగ్గింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే మాత్రం నీటి విడుదల పెంచుతామని ఎర్రకాలువ రెగ్యులేటరీ అథారిటీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం కేవలం 600 క్యూసెక్కుల నీటినే విడుదల చేస్తున్నట్లు ఏఈ చదలవాడ సత్యనారాయణ వివరించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని