logo

స్వరాజ్యపోరు.. పశ్చిమ హోరు

గడప దాటి మహిళలు బయటకు రావాలంటే ఎన్నో ఆంక్షలు, మరెన్నో కట్టుబాట్లు. స్త్రీ విద్య అంటేనే అదో అసాధ్యమైన అంశం. అటువంటి రోజుల్లో గాంధీ పిలుపును అందుకుని స్వరాజ్యపోరులో మేము సైతం అంటూ అడుగు ముందుకేసిన నారీమణులు మన జిల్లాలో ఎంతో మంది ఉన్నారు. స్వతంత్ర భారతావని 75 ఏళ్ల  ఉత్సవాల సందర్భంగా స్వరాజ్యపోరులో హోరెత్తించిన మహిళల గురించి..

Published : 12 Aug 2022 02:46 IST

జైలుకెళ్లిన ఉద్యమ వనితలు

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే

గడప దాటి మహిళలు బయటకు రావాలంటే ఎన్నో ఆంక్షలు, మరెన్నో కట్టుబాట్లు. స్త్రీ విద్య అంటేనే అదో అసాధ్యమైన అంశం. అటువంటి రోజుల్లో గాంధీ పిలుపును అందుకుని స్వరాజ్యపోరులో మేము సైతం అంటూ అడుగు ముందుకేసిన నారీమణులు మన జిల్లాలో ఎంతో మంది ఉన్నారు. స్వతంత్ర భారతావని 75 ఏళ్ల  ఉత్సవాల సందర్భంగా స్వరాజ్యపోరులో హోరెత్తించిన మహిళల గురించి..

ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమాల్లో పాల్గొన్న కారణంగా జిల్లాకు చెందిన పలువురు మహిళా స్వాతంత్య్ర సమరయోధులు నెలల తరబడి జైలు శిక్ష అనుభవించారు. వీరిలో ఏలూరు, పరిసర గ్రామాలకు చెందిన దాసరి కృష్ణవేణమ్మ, దామరాజు లక్ష్మమ్మ, శృంగారకవి లక్ష్మీనరసమ్మ, కంది నాగరత్నమ్మ, కలగర పిచ్చమ్మ, వద్దిపర్తి శకుంతల, కొటికలపూడి సరస్వతీదేవి, ముడుంబ వెంకటమ్మ తదితరులు ఉన్నారు.

అటు పోరు.. ఇటు రచనలు

* స్వరాజ్యపోరులో పాల్గొంటూనే ఏలూరుకు చెందిన ముడుంబ లక్ష్మీదేవి ఆయుర్వేద గ్రంథాలను అనేకం రాశారు. పలు వ్యాసాలకు బహుమతులను సొంతం చేసుకున్నారు. మద్రాస్‌ ఇండియన్‌ మెడిసిన్‌ కేంద్రసంఘం సభ్యురాలిగా చిరకాలం సేవలు అందించారు.

* ఏలూరుకే చెందిన లక్ష్మీనరసమ్మ స్త్రీల అంశాలపై నాలుగు గ్రథాలను రాశారు. మరో మహిళ ముడుంబ వెంకటమ్మ జాతీయ కవయిత్రి. తన గేయాల ద్వారా ప్రజలను ఉర్రూతలూగించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు వెల్లూరు జైలుకు తన మూడు నెలల కుమారుడిని కూడా వెంటతీసుకెళ్లారు.

గాంధీజీని కదిలించిన త్యాగం

మెడలోని మంగళ సూత్రం మినహా ఒంటిమీద ఉన్న బంగారు ఆభరణాలు అన్నింటిని జాతీయోద్యమానికి విరాళంగా మహాత్ముడి చేతికి అందించిన వనిత మాగంటి అన్నపూర్ణాదేవి. విదేశీవస్త్ర బహిష్కరణలో భాగంగా ఖద్దరు ధరించారు. తన భర్త మాగంటి బాపినీడుకు స్వదేశీ దీక్షను ఉపదేశించారు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రచారం చేస్తూ యువతలో ఉత్సాహాన్ని రగిలించారు. ఏలూరులో మోహన్‌దాస్‌ ఖాదీ పరిశ్రమను స్థాపించారు. బెంగాలీ భాషలోనూ ప్రావీణ్యం పొందారు. రామకృష్ణ పరమహంస రచన లీలామృతం, స్వాతంత్య్ర పోరాటంలో అరవిందఘోష్‌ లేఖలను బెంగాలీ నుంచి తెలుగులోకి అనువదించారు. ఆరోగ్యం క్షీణించడంతో 27 ఏళ్ల వయసులో అన్నపూర్ణాదేవి మరణించారు. ‘ఆమె మరణంతో దేశభక్తురాలిని మాత్రమే కాదు.. నా పుత్రికను కోల్పోయాను’ అని గాంధీజీ భావోద్వేగంతో పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధులుగానూ..

ఏలూరుకు చెందిన చోడగం అమ్మన్నరాజా మౌంట్‌ఫర్డ్‌ సంస్కరణలను అనుసరించి దేశంలో జరిగిన ఎన్నికల్లో ఏలూరు శాసనసభ  సభ్యురాలిగా గెలుపొందారు. 1940లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఏడాదిపాటు జైలుశిక్ష అనుభవించారు. ఉమ్మడి మద్రాసు  రాష్ట్ర ఉపసభాపతిగా పని చేశారు. 1962-68లో రాజ్యసభ సభ్యురాలిగానూ సేవలు అందించారు. రాష్ట్రమహిళా విద్యామండలి అధ్యక్షురాలిగా, ఆంధ్రవిశ్వవిద్యాలయం సెనేట్‌ సభ్యురాలిగా వ్యవహరించారు.

* తనతోపాటు కుమార్తె ఆభరణాలు సైతం జాతీయోద్యమానికి విరాళమిచ్చిన పసల అంజలక్ష్మి తాడేపల్లిగూడెం వాసి. జన్మస్థలం అత్తిలి. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నందుకు జైలు శిక్ష అనుభవించారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించారు. ప్రభుత్వ శాసనాలను ఉల్లంఘించి భీమవరం తాలూకు కాంగ్రెసు సమావేశంలో భర్త కృష్ణమూర్తితో కలిసి పోలీసులు కళ్లు గప్పి రహస్యంగా పాల్గొన్నారు. అనంతరం భర్తతో కలిసి తాలూకా కార్యాలయ భవనంపైకెక్కి ఆంగ్లేయుల పతాకాన్ని తొలగించి మువ్వన్నెల కాంగ్రెసు పతాకాన్ని ఎగరేశారు. ఈ ఘటనలో పోలీసులు అరెస్టు చేస్తే పది నెలలు జైలు శిక్ష విధించారు. ఆరు నెలల గర్భిణిగా ఉన్న అంజలక్ష్మి తన అయిదేళ్ల కుమారుడితోపాటు శిక్ష అనుభవించారు. 1931 అక్టోబరు 29న జైలులోనే కుమార్తెకు జన్మనిచ్చారు. ఆరు నెలల పసిపాప కృష్ణ భారతితో జైలు నుంచి విడుదలయ్యారు. ఇటీవల భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ సభలో ఈమె కుమార్తె కృష్ణభారతికి ప్రధాని మోదీ పాదాభివందనం చేశారు.

* పాలకొల్లు సమీపంలోని జిన్నూరుకు చెందిన అల్లూరి అన్నపూర్ణాదేవి మద్యనిషేధం, అస్పృశ్యత నివారణ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించారు. కాశీపట్నం జమీందారీరైతు ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలుశిక్ష అనుభవించారు. శాసనమండలి సభ్యురాలి గా పని చేశారు.

* నరసాపురం సమీపంలోని ముత్యాలపల్లికి చెందిన ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ కవయిత్రి. గాంధీ సిద్ధాంతాలైన బేసిక్‌ విద్య, హిందీ భాషోద్యమం, ఖద్దరు ప్రచారాల్లో విశేష కృషి చేశారు. 1958-66 మధ్య శాసనమండలి సభ్యురాలిగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని