logo

ముంచెత్తిన గోదావరి

గోదావరి వరద కారణంగా మరోసారి విలీన మండలం వేలేరుపాడులో ఇళ్లు నీట మునిగాయి. నాలుగు రోజులుగా అంతకంతకూ పెరుగుతూ వస్తున్న వరద గురువారం ఉదయం భద్రాచలం వద్ద 52 అడుగులకు చేరగానే వేలేరుపాడులోని

Published : 12 Aug 2022 02:46 IST

గుట్టలపై బాధితుల ఆశ్రయం

తాగునీరు, నిత్యావసరాల కోసం పాట్లు

వేలేరుపాడు సమీపంలోకి వరద నీరు

వేలేరుపాడు, న్యూస్‌టుడే: గోదావరి వరద కారణంగా మరోసారి విలీన మండలం వేలేరుపాడులో ఇళ్లు నీట మునిగాయి. నాలుగు రోజులుగా అంతకంతకూ పెరుగుతూ వస్తున్న వరద గురువారం ఉదయం భద్రాచలం వద్ద 52 అడుగులకు చేరగానే వేలేరుపాడులోని సంతబజారు, ఎస్సీకాలనీ, ఎస్టీకాలనీలోని ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. యడవల్లి సమీపంలోని ఎద్దువాగు వంతెన నీట మునగడంతో 5 రోజులుగా రహదారి సౌకర్యం లేని మండలంలోని కట్కూరు, కొయిదా పంచాయతీల్లోని 17 గిరిజన గ్రామాల ప్రజలు పెట్టేబేడాతో సమీపంలోని గుట్టలపైకి పరుగులు తీశారు. గత నెలలో వచ్చిన వరదలు తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న మండల కేంద్రానికి ఆనుకొని ఉన్న తాట్కూరుగొమ్ము, తిరుమలాపురం, నార్లవరం, చిగురుమామిడి గ్రామాల్లోని వేలాది మంది శివకాశీపురం, భూదేవిపేట, బండ్లబోరు గ్రామాల్లో బంధువుల ఇళ్లకు చేరుకుంటున్నారు. రుద్రంకోటలోని సుమారు 4 వందల కుటుంబాల వారు బతుకుజీవుడా అంటూ సమీపంలోని గుట్టపైన గుడారాల్లో పిల్లాపాపలతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తాగునీరు, నిత్యావసర సరకుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మిగిలిన రేపాకగొమ్ము, శ్రీరాంపురం, నడిమిగొమ్ముకాలని, తాట్కూరుగొమ్ముకాలనీ, జగన్నాథపురం గ్రామాల బాధితులు జంగారెడ్డిగూడెం మండలంలోని చల్లవారిగూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకు వెళ్లారు.

భూదేవిపేట-చాగరపల్లి గ్రామాల మధ్య నీట మునిగిన మేళ్లవాగు వంతెన


అంతర్రాష్ట్ర రహదారి మునక

కుక్కునూరు-భద్రాచలం రహదారిపై  వింజరం వద్ద చేరిన వరద

కుక్కునూరు, న్యూస్‌టుడే: అశ్వారావుపేట-భద్రాచలం వయా కుక్కునూరు అంతర్రాష్ట్ర రహదారి గోదావరి వరదలో గురువారం సాయంత్రం మునిగిపోయింది. దీంతో ఈ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, తెలంగాణలకు వెళ్లేందుకు ఈ రహదారి దగ్గర మార్గం కావటంతో ఇది అంతర్రాష్ట్ర రహదారిగా గుర్తింపు పొందింది. ఈ రహదారి వరదలో మునిగి పోవటంతో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో వచ్చే వాహనాలను అశ్వారావుపేట పోలీసులు వయా దమ్మపేట, ములకలపల్లి మీదుగా మళ్లిస్తున్నారు. గోదావరి వరద దాదాపు 53 అడుగులకు సమీపిస్తుండటంతో రహదారి ముంపునకు గురయ్యింది. కుక్కునూరు మండలంలో వింజరం వద్ద ఇప్పటికే మునిగిపోగా, వెంకటాపురం, ఎల్లప్పగూడెం, కోమట్లగూడెం పరిసర ప్రాంతాల్లో సమీపంలోకి వరద వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని బూర్గంపాడు వద్ద ఇప్పటికే రహదారి మునిగిపోయింది. ఈ మార్గంలో పయనించే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని కుక్కునూరు పోలీసులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని