logo

సరకు తీసుకెళ్లడానికి వచ్చి లారీ చోరీ

లారీ దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని ఠాణాలో శనివారం ఏసీపీ సారంగపాణి విలేకరులతో వివరాలు వెల్లడించారు.

Published : 14 Aug 2022 03:29 IST

ఇద్దరు నిందితుల అరెస్టు

సుల్తానాబాద్‌, న్యూస్‌టుడే: లారీ దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని ఠాణాలో శనివారం ఏసీపీ సారంగపాణి విలేకరులతో వివరాలు వెల్లడించారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం జగన్నాథపురానికి చెందిన వాలేపు బలం, గుంజి జ్వాల బావ, బావమరుదులు. లారీ డ్రైవర్లుగా పని చేస్తున్న వీరు ఈ నెల 6న ఏలూరు నుంచి కరీంనగర్‌ జిల్లా మొగ్ధుంపూర్‌ కోళ్లఫారం వద్దకు తౌడు లోడుతో వచ్చారు. తిరుగు ప్రయాణంలో సరకును తీసుకెళ్లేందుకు సుల్తానాబాద్‌లోని మండల బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద లారీతో రాత్రంతా వేచి ఉన్నారు. 7న తెల్లవారుజామున 2 గంటలకు తమ లారీ పక్కనే నిలిపి ఉన్న మరో లారీని దొంగిలించి వెంట తీసుకెళ్లారు. సదరు లారీ యజమాని ఫిర్యాదు మేరకు ఈ నెల 7న కేసు నమోదు చేసిన పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలించారు. కాగా మరో లారీ దొంగతనం కోసం 12న కరీంనగర్‌కు వచ్చిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విచారణలో తాము దొంగలించిన లారీని గుంటూరుకు చెందిన ఫిరోజ్‌కు రూ.3 లక్షలకు అమ్మినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఈ మేరకు శనివారం గుంటూరు నుంచి లారీని తెప్పించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని