logo

దిక్కూ మొక్కూ లేక

వరద బాధితులకు ఎటువంటి కష్టం రానివ్వం.. వసతి సౌకర్యాలతో పాటు వారి కష్టాల్లో పాలుపంచుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటాం.. ఇవీ.. గత నెలలో ముంపు బాధితుల పరామర్శకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హమీలు..

Published : 14 Aug 2022 03:51 IST

బతుకుజీవుడా అంటూ గుట్టలపైకి..

ఆదుకొనేదెవరంటూ వరద బాధితుల ఆవేదన

వేలేరుపాడు, న్యూస్‌టుడే


గుడారంలో తలదాచుకుంటున్న బాధితులు

వరద బాధితులకు ఎటువంటి కష్టం రానివ్వం.. వసతి సౌకర్యాలతో పాటు వారి కష్టాల్లో పాలుపంచుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటాం.. ఇవీ.. గత నెలలో ముంపు బాధితుల పరామర్శకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హమీలు..
20 రోజుల ముందు ఆయన చెప్పిన మాటలకు.. మళ్లీ వచ్చిన వరదలతో బాధితులు పడుతున్న ఇబ్బందులకు.. పొంతన లేకుండా పోయింది.

గత నెల వరదల సమయంలో హడావుడి చేసిన అధికార యంత్రాంగం ప్రస్తుతం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో వేలేరుపాడు మండలంలోని ఏ ముంపు గ్రామానికి వెళ్లి చూసినా.. కన్నీటి గాథలు విన్పిస్తున్నాయి. కొందరు తిండి లేక.. మరికొందరు నిలువ నీడ లేక గుట్టలపై గుడారాలు, పశువుల కొట్టాలు, బస్సు షెల్టర్లలో కాలం వెళ్లదీస్తూ ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. బాధితులు పడుతున్న ఇబ్బందులు వారి మాటల్లోనే..


గంజి తాగి  కడుపు నింపుకొంటున్నాం

వరద ప్రవాహంతో మా ఇంటితో పాటు చుట్టుపక్కల   బంధువులకు చెందిన నాలుగు పూరిల్లు కొట్టుకుపోయాయి. ఇళ్లకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో నెల రోజులుగా శివకాశీపురంలోని ఓ పశువుల కొట్టంలో తలదాచుకుంటున్నాం.  ఇప్పటి వరకు ఏ అధికారీ వచ్చి ఎలా ఉన్నారు.. ఏం తింటున్నారు.. అని అడిగిన పాపాన పోలేదు. నెల క్రితం ఇచ్చిన 25 కిలోల బియ్యంతోనే గంజి కాచుకుని కాలం వెళ్లదీస్తున్నాం.

- ఎం.రమణ, రేపాకగొమ్ము


చావ లేక.. బతక లేక..

ఏటా వరదలకు అటు చావలేక..  ఇటు బతక లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. ఆగస్టు నుంచి అక్టోబరు వరకు ఏటా రెండు మూడు దఫాలుగా వస్తున్న వరదలతో రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన సొమ్ముతో కొనుక్కున్న ఇంటి సామగ్రితో పాటు తిండి గింజలను కూడా కోల్పోవాల్సి వస్తోంది. ఏటా ముందుగా వచ్చిన వరదకే బియ్యం ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. మళ్లీ రెండు, మూడు దఫాలుగా వచ్చిన వరదలకు కనీసం పట్టించుకోవడంలేదు.

- కుంజా భూలక్ష్మి, తిరుమలాపురం


నెల రోజులుగా గుడారంలోనే..

గత నెలలో వచ్చిన వరదతో ఇల్లు నీట మునగడంతో నిలువ నీడ లేక తట్టాబుట్టా సర్దుకొని పిల్లాపాపలతో గుట్టపైకి చేరుకున్నాం. ప్రభుత్వం వారు ఇచ్చిన టార్పాలిన్‌తో గుడారం ఏర్పాటు చేసుకొని ఇక్కడే కటిక చీకటిలో కాలం వెళ్లదీస్తున్నాం. ఇల్లు బాగు చేసుకుని తిరిగి వెళ్దామను కుంటున్న సమయంలో మళ్లీ వరద రావడంతో వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అటు పగటి పూట ఎండ వేడిమి, ఇటు రాత్రిపూట చీకటితో పాటు దోమల బారిన పడి నరకం అనుభవిస్తున్నాం.

మద్దినశెట్టి వెంకన్నబాబు, రుద్రంకోట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని