logo

ఎన్నో జ్ఞాపకాలు ఉద్యమ ఘట్టాలు

తణుకు ప్రాంతం స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించింది. నాటి ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన అనేక మంది సమరయోధుల జ్ఞాపకాలు ఇప్పటికీ ఉన్నాయి. జాతీయ ఉద్యమం ప్రారంభం నుంచి చివరి వరకు జరిగిన....

Published : 14 Aug 2022 03:51 IST

స్వాతంత్య్ర సమరంలో తణుకు కీలకపాత్ర

తణుకు, న్యూస్‌టుడే


తణుకులో దండి మార్చ్‌ విగ్రహాలు

తణుకు ప్రాంతం స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించింది. నాటి ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన అనేక మంది సమరయోధుల జ్ఞాపకాలు ఇప్పటికీ ఉన్నాయి. జాతీయ ఉద్యమం ప్రారంభం నుంచి చివరి వరకు జరిగిన ప్రధాన ఘట్టాల్లో తణుకు ప్రముఖంగా నిలిచింది. పలు సందర్భాల్లో జాతిపిత మహాత్మాగాంధీ తణుకు పట్టణంలో పర్యటించారు. వందేమాతర ఉద్యమంలో బ్రిటిష్‌ అధికారులు విద్యార్థులను కళాశాల నుంచి బహిష్కరించి లొంగదీసుకోవాలని ప్రయత్నించారు. ఈ సందర్భంలో క్షమాపణ చెప్పడానికి తిరస్కరించి బహిష్కృతులైన వారిలో పట్టణానికి చెందిన నోరి మాధవరావు, జనమంచి సత్యనారాయణ, జీడిగుంట మాధవరావులతో పాటు మండపాక గ్రామానికి చెందిన గాడేపల్లి సీతారామయ్య, ఈమని సుబ్బయ్యలు ఉన్నారు. 1929లో  విదేశీ వస్తు బహిష్కరణ నినాదంతో స్వదేశీ వస్తు తయారీతో చేపట్టిన ఖద్దరు ధరించాలని చేపట్టిన ఖాదీ ఉద్యమంలో భాగంగా ఏప్రిల్‌ 27న తణుకులో గాంధీజీ పర్యటించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో వివిధ సమస్యలపై చర్చించారు.   ముదిగంటి జగన్నశాస్త్రి, మంగిపూడి పురుషోత్తమశర్మ, యర్రమిల్లి రామనాథం, కొవ్వలి గోపాలరావు, శనివారపు సుబ్బారావు, బందా సియన్న తదితరులు పాల్గొన్నారు. 1933 సంవత్సరంలో తిరిగి హరిజన యాత్రలో భాగంగా డిసెంబరు 28న రాత్రి 11 గంటలకు తణుకు చేరుకొన్నారు. ఆ రోజు రాత్రి యర్రమిల్లి రామనాథం నివాసంలో బస చేశారు. మరుసటి రోజు నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్‌, హరిజన కార్యకర్తలు పాల్గొన్నారు.

త్యాగాలకు పుట్టినిల్లు..
స్వాతంత్య్రోదమ చరిత్రలో కొవ్వలి గోపాలరావు కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. 1921 లో సహాయ నిరాకరణ ఉద్యమం తణుకు తాలుకాకు విస్తరించింది. ఈ  ఉద్యమంలో గోపాలరావు సింహ గర్జన చేయడంతో అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం దీన్ని భరించలేక ఆయనను అరెస్ట్‌ చేసి జైలుకు పంపింది. దీంతో మొట్టమొదటి సారిగా ఆయన జైలుకు వెళ్లిన వ్యక్తిగా నిలిచారు. అనంతరం 1942 క్విట్‌ ఇండియా ఉద్యమం సందర్భంగా వంక సత్యనారాయణ, భూపతిరాజు సుబ్బరాజులు అరెస్టయి సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించారు. 1944 లో కోడూరి రామరాయవర్మ రెండేళ్లు పాటు జైలు శిక్ష అనుభవించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని