logo

పరిశ్రమించవోయి!

ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన స్వాతంత్య్ర భారతావనికి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రగతి ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు అధిగమించిన దేశంలో ఉమ్మడి పశ్చిమకు విశిష్ట స్థానం ఉంది. మహిళా విద్య, వ్యవసాయం, రవాణా, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి పథంలో పయనించింది. ఇప్పటి వరకు సాధించింది ఒక ఎత్తయితే స్వాతంత్య్ర శత వసంతాల నాటికి సాధించాల్సింది

Published : 15 Aug 2022 04:41 IST

ప్రధాన రంగాల్లో ఉమ్మడి పశ్చిమ పురోగతి

సమష్టి కృషితో మరింత అభివృద్ధి

ఈనాడు డిజిటల్‌, భీమవరం,  న్యూస్‌టుడే, పాలకొల్లు

ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన స్వాతంత్య్ర భారతావనికి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రగతి ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు అధిగమించిన దేశంలో ఉమ్మడి పశ్చిమకు విశిష్ట స్థానం ఉంది. మహిళా విద్య, వ్యవసాయం, రవాణా, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి పథంలో పయనించింది. ఇప్పటి వరకు సాధించింది ఒక ఎత్తయితే స్వాతంత్య్ర శత వసంతాల నాటికి సాధించాల్సింది మరెంతో మన ముందుంది. ఈ దిశగా అన్ని వర్గాలు సంకల్పిస్తూ వందేమాతర గీతాన్ని సార్థకం చేసుకునేలా పయనించాల్సి ఉంది. కొన్ని రంగాల్లో ముందంజ వేయడానికి ఇప్పట్నుంచి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాల్సి ఉంది.  


త్రివర్ణ శోభితం

‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవం’ సందర్భంగా కలెక్టరేట్‌ను త్రివర్ణ శోభితంగా ముస్తాబు చేశారు. విద్యుత్తు దీపాలతో అలంకరించారు.


త్యాగాలను మరువొద్దు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర సమరంలో  ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను మరువొద్దని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు.  భీమవరంలో ఆదివారం రాత్రి నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో ఆమెతో పాటు ఎస్పీ యు.రవిప్రకాశ్‌, ఎమ్మెల్యే శ్రీనివాస్‌ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.


మదినిండా మన జెండా

ఆజాదీకా  అమృత్‌మహోత్సవ్‌ సందర్బంగా ఊరూవాడా తివ్రర్ణ పతాకాలు రెపరెపలాడుతున్నాయి.

వీరవాసరం మండలం కోరుకొల్లులో జాతీయ జెండాతో ప్రదర్శన

తణుకు అంబేడ్కర్‌ కూడలిలో విద్యుత్‌ కాంతులు


చైతన్యంతో ‘సాగు’తుండాలి

స్వాతంత్య్రం వచ్చే నాటికి ఉమ్మడి జిల్లాలో 1.2 లక్షల హెక్టార్లలో వరి సాగు చేసేవారు. ఆనకట్టల నిర్మాణం, కాలువల విస్తరణ, ఆయకట్టు స్థిరీకరణతో సాగు విస్తీర్ణం పెరిగి 2.25 లక్షల హెక్టార్లకు చేరింది. మరో 50 వేల హెక్టార్లలో కొబ్బరి, అరటి, నిమ్మ, పామాయిల్‌, కూరగాయలు పండిస్తున్నారు. ఆధునిక సాగు పద్ధతులను అందిపుచ్చుకోవడంతో దిగుబడి పెరిగింది. ఇదే సమయంలో పెట్టుబడి వ్యయం కూడా పెరగడంతో గిట్టుబాటు ధర దక్కడం లేదు. పలు పథకాలు, రాయితీలు అసలైన సాగుదారులకు చేరితే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. నవ్యాంధ్ర జీవనాడి పోలవరం నిర్మాణాన్ని వేగిరం చేయాలి. మన ప్రాంతంలోనూ  కొందరు సేంద్రియ పద్ధతుల్లో కొత్త వంగడాలు సాగుచేస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నారు. ఈ సాగును మరింత ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉంది.


ఊరూరా మంచినీరు

ఉమ్మడి జిల్లాలో జలవనరులు పుష్కలంగానే ఉన్నప్పటికీ తాగునీటి కాలుష్యం ఉంది. చుట్టూ నీరున్నా తాగడానికి చుక్కనీరు పనికిరాని దుస్థితి. ఉమ్మడి జిల్లాలో 8 పురపాలికలు, రెండు నగరపంచాయతీలు, ఒక కార్పొరేషన్‌, సుమారు వెయ్యి గ్రామాల్లో కలిపి పది లక్షల కుటుంబాల్లో దాదాపు 40 లక్షల మంది జీవిస్తున్నారు. వీరందరికి శుద్ధిచేసిన జలాలు అందివ్వగలిగితే ప్రస్తుత తరంతోపాటు భావితరాలు కూడా ఆరోగ్యంగా జీవించొచ్చు.


పెరగాలి రవాణా

రవాణా అభివృద్ధికి పర్యాయపదం లాంటిది. అనాది నుంచి ఆర్టీసీలో కూడా అనేక మార్పులు సంతరించుకున్నాయి. 1958లో ఈసేవలు 27 బస్సులతో మొదలయ్యాయి. అప్పట్లో అసలు జిల్లాలో బస్సులే లేవు. ఐదేళ్ల తరువాత జిల్లాలో మూడు బస్సులు నడిపారు. 30 ఏళ్ల క్రితం వరకూ కూడా 40 మార్గాల్లో 100 మాత్రమే తిరిగేవి. ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 454 బస్సులున్నాయి.  ఇంత ప్రగతి సాధించినా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంకా చాలా గ్రామాలకు వెళ్లటం లేదు. ఈ పరిస్థితిని అధిగమించాల్సిన బాధ్యత ఆర్టీసీపై ఉంది. ఇక రైల్వే రవాణాలోనూ అభివృద్ధి అవసరం. ఈ సేవలు విస్తృతం కావాల్సిన అవసరం ఉంది.


ప్రగతి‘దారుల్లో’

ఉమ్మడి జిల్లాలో 1960 నాటికి హైవేల పొడవు 507 కి.మీ. ఉండగా ప్రస్తుతం 1051 కి.మీలకు చేరుకుంది. ఆర్‌అండ్‌బీ రోడ్లు 3219 కి.మీ, జిల్లా ప్రధాన మార్గాలు 585 కి,మీ, గ్రామీణ రహదారులు:1,583 కి.మీ. విస్తరించటంతో రవాణా వ్యవస్థ పటిష్ఠమయింది. ఇన్ని ఉన్నా నిర్వహణ లోపాలు సమస్యగా పరిణమిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా రహదారుల్లో దాదాపు 70 శాతం వరకు ఛిద్రంగా ఉన్నాయి. రాష్ట్ర, జాతీయ రహదారుల పరిస్థితి కూడా కొన్నేళ్ల నుంచి అగమ్యగోచరంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం రహదారుల నిర్మాణంపై చొరవ చూపాల్సి ఉంది.


ఎగుమతుల రాబడి

ఉమ్మడి జిల్లాలో 1980 నుంచి ఆక్వారంగం ఊహించని రీతిలో దూసుకెళ్తుంది. శాస్త్రీయ పద్ధతుల్లో ఆక్వా సాగు చేయడం కలిసొచ్చింది. ఆక్వా ప్రాసెసింగ్‌, మేతల పరిశ్రమలు, శీతల గిడ్డంగులు ఏర్పాటవడంతో వేలాది మంది కార్మికులకు ఉపాధి లభించింది. పశ్చిమబంగ, బిహార్‌ వంటి రాష్ట్రాలకు నిత్యం వందలాది లారీల్లో చేపలు, రొయ్యలు ఇక్కడ్నుంచి ఎగుమతి అవుతున్నా.. వీటి ద్వారా ఆదాయం మరింత పెరగాల్సి ఉంది.


ఉపాధికి పునాది..

ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ఉపాధి వనరులు బాగుండాలి. ఉమ్మడి జిల్లాలో సుమారు 10 లక్షలమంది యువత ఉన్నారు. వీరంతా ఉపాధి పొందాలంటే సరైన మార్గాన్ని ఎంచుకునేలా మార్గదర్శకం చేసేలా పాఠశాలలు, కళాశాలలు తయారుకావాలి. అంతా ఒకే రంగంపై కాకుండా వారికున్న అభిరుచితో పాటు సమాజ అవసరాలను మేరకు ఉపాధి మార్గాలు ఎంచుకునేలా ప్రోత్సహించాలి. వ్యవసాయ, వైద్య కోర్సులకు ప్రోత్సాహకాలు పెంచి ఏటా ఎక్కువమంది ఆయా రంగాల్లోకి వచ్చేలా చూడాల్సిన అవసరం ఉంది.


అతివలే ఇంటికి వెలుగు

అతివకు అందలం పశ్చిమ ప్రజల చైతన్యం, విశాల దృక్పథం కారణంగా ఆడ బిడ్డల సంఖ్య మగపిల్లల కంటే ఎక్కువగా ఉంది. 2001లో లింగనిష్పత్తి 1000: 991 గా నమోదవగా 2011 నాటికి ప్రతి 1000: 1004కు చేరింది. ఆడ బిడ్డల అక్షరాస్యతలో 2001లో 68.99 ఉండగా, 2011 నాటికి అది 71.36 శాతానికి పెరిగింది. 2001లో పురుషుల అక్షరాస్యత శాతం 78.05 ఉండగా, 2011 నాటికి 77.92 శాతానికి పడిపోయింది. దీనిపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని