logo

చుట్టూ నీరు.. ఆపై చీకటి!

చుట్టూ నీరు.. ఆపై కటిక చీకటి.. గోడు చెప్పుకునేందుకు ఎవరూ రాని వైనం.. ఇదీ నెల రోజులుగా విలీన మండలం వేలేరుపాడులోని 47 గ్రామాల్లోని వరద బాధితుల దుస్థితి. గత నెల 10న ప్రారంభమైన వరద ప్రవాహం మహోగ్రరూపం దాల్చి వేలాది మందిని నిలువ నీడలేకుండా చేసింది. 15 రోజుల క్రితం తగ్గుముఖం పట్టి సాధారణ

Published : 15 Aug 2022 04:41 IST

నెల రోజులుగా బాధితుల పాట్లు

నిత్యావసరాల కోసం పడవలో వస్తున్న చిగురుమామిడి గ్రామస్థులు

వేలేరుపాడు, న్యూస్‌టుడే: చుట్టూ నీరు.. ఆపై కటిక చీకటి.. గోడు చెప్పుకునేందుకు ఎవరూ రాని వైనం.. ఇదీ నెల రోజులుగా విలీన మండలం వేలేరుపాడులోని 47 గ్రామాల్లోని వరద బాధితుల దుస్థితి. గత నెల 10న ప్రారంభమైన వరద ప్రవాహం మహోగ్రరూపం దాల్చి వేలాది మందిని నిలువ నీడలేకుండా చేసింది. 15 రోజుల క్రితం తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొంటుండగా, మళ్లీ ఈ నెల 9 నుంచి వరద అంతకంతకూ పెరుగుతూ భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగులు దాటి 52 అడుగులకు చేరుకుంది. మండలంలోని కొయిదా, కట్కూరు, నార్లవరం, తిరుమలాపురం, తాట్కూరుగొమ్ము, రేపాకగొమ్ము, రుద్రంకోట పంచాయతీల్లోని 5600 కుటుంబాల వారు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. గత నెలలో వచ్చిన వరదకు బియ్యం, ఇతర నిత్యావసరాలు అందించిన ప్రభుత్వం రెండో దఫా బాధితులను కనీసం పట్టించుకోకపోవడంతో గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక మిన్నకుండి పోతున్నారు.  

బాహ్యప్రపంచానికి దూరంగా..

యడవల్లి-బోళ్లపల్లి గ్రామాల మధ్యలో గల ఎద్దువాగు వంతెన భద్రాచలం వద్ద వరద 40 అడుగులకు చేరగానే నీట మునుగుతోంది. కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని 17 గిరిజన గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిలోని వంతెన మునిగిపోతుండడంతో అక్కడి గిరిజనులు వరద పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టేంత వరకు బయటకు వచ్చే పరిస్థితి లేక బాహ్య ప్రపంచానికి దూరంగా కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి నెలకొంటుంది. దీనికి తోడు విద్యుత్తు స్తంభాలు, పరివర్తకాలు తరచూ నీట మునగడంతో సరఫరాను నిలిపివేస్తున్నారు. దీంతో అక్కడి గిరిజనులు వరద తగ్గేంత వరకు అంధకారంలో మగ్గుతూ దోమకాటుకు గురై జ్వరాల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

గుడారాల్లో బిక్కుబిక్కుమంటూ..

రుద్రంకోట, తిరుమలాపురం, తూర్పుమెట్ట, నార్లవరం, చిగురుమామిడి గ్రామాల్లోకి నీరు వచ్చి చేరడంతో సమీపంలోని గుట్టలపైకి చేరి గుడారాల్లో జీవనం సాగిస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా వచ్చిన వరదతో ప్రభుత్వం ఇచ్చిన టార్పాలిన్లతో గుడారాలు ఏర్పాటు చేసుకుని పిల్లా పాపలతో కంటిమీద కునుకులేని రాత్రులు గడుపుతున్నారు. వీరికి నిత్యావసరాల సంగతి దేవుడెరుగు. కనీసం తాగునీటిని కూడా సరఫరా చేయకపోవడంతో వరద నీటితోనే గొంతులు తడుపుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని