logo

తలదాచుకుందామని వస్తే.. తరమాలని చూస్తున్నారు!

చల్లావారిగూడెం పునరావాస కాలనీలో తలదాచుకుంటున్న రుద్రంకోట నిర్వాసితులను సోమవారం లోగా ఖాళీ చేయాలని కొందరు ఒత్తిడి చేయడం వివాదంగా మారింది. బంధువుల ఇళ్లలో ఆశ్రయం పొందినా ఉండడానికి వీలు లేదనడంతో వారంతా దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. గ్రామం నుంచి మంగళవారం అర్ధరాత్రి సుమారు

Published : 15 Aug 2022 04:41 IST

రుద్రంకోట నిర్వాసితుల ఆవేదన

జంగారెడ్డిగూడెం, గ్రామీణ, న్యూస్‌టడే: చల్లావారిగూడెం పునరావాస కాలనీలో తలదాచుకుంటున్న రుద్రంకోట నిర్వాసితులను సోమవారం లోగా ఖాళీ చేయాలని కొందరు ఒత్తిడి చేయడం వివాదంగా మారింది. బంధువుల ఇళ్లలో ఆశ్రయం పొందినా ఉండడానికి వీలు లేదనడంతో వారంతా దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. గ్రామం నుంచి మంగళవారం అర్ధరాత్రి సుమారు 15 కుటుంబాలు కట్కూరు పునరావాస కాలనీలో ఉంటున్న వారి బంధువుల ఇళ్లకు సామగ్రి పాడవకుండా దాచుకునేందుకు వచ్చారు. మళ్లీ వరద రావడంతో ఇక్కడే ఉండిపోయారు. పైగా రుద్రంకోట నిర్వాసితులకు ఇక్కడే పునరావాస కాలనీ నిర్మిస్తున్నారు. ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు. గుత్తేదారులే వారికి తాగునీరు సరఫరా చేస్తున్నారు. కేవలం నీళ్లు ఇవ్వడం భారమనే ఉద్దేశంతో మమ్మల్ని వెళ్లిపోవాలంటున్నారని నిర్వాసితులు వాపోతున్నారు. పోలీసులతో గెంటేస్తామని మరీ బెదిరిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆర్డీవో ఝాన్సీ రాణి వద్ద ప్రస్తావించగా.. నిర్వాసితులు అక్కడ ఉండొచ్చని, గుత్తేదారుతో మాట్లాడి ఇబ్బందుల్లేకుండా చేస్తామని తెలిపారు.


ప్రాణభయంతో వచ్చాం..

‘నిలువ నీడ లేక ప్రాణ భయంతో పిల్లా పాపలతో ఇక్కడకు చేరాం. నిర్వాసితులమైన మాకు సాయం చేయాల్సింది పోయి ఇక్కడ  నుంచి పొమ్మంటున్నారు. ఇదేమి తీరు. తహశీల్దారు నుంచి లేఖ తెమ్మంటున్నారు’ అని దారా కుమార్‌, రాములు తెలిపారు.


నాలుగు రోజులు గడువు అడిగినా..

‘నాలుగు రోజులు గడువు అడిగాం. అయినా ఖాళీ చేయాలంటున్నారు. నడుము లోతు నీళ్లు ఉన్న గ్రామం నుంచి బతుకు జీవుడా అంటూ బంధువుల ఇళ్లకు వచ్చాం. కేవలం మంచినీళ్లు ఇవ్వాల్సి వస్తుందని ఖాళీ చేయమంటే ఎలా. నీళ్లు సరఫరా చేయకపోయినా ఫర్వాలేదన్నా వినడం లేదు. జులుం ప్రదర్శిస్తున్నారు’ అని యడ్ల సావిత్రి, కుచ్చలపాటి చిన్నారి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని