logo

పశ్చిమ తీరాన ఉద్యమ కెరటం

జాతీయోద్యమ స్ఫూర్తితో పశ్చిమలో రగిలిన స్వాతంత్య్ర కాంక్ష అది సిద్ధించే వరకు కొనసాగింది. రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో, సాంకేతికత అంటే తెలియని సమయంలోనే నాయకులు రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఉద్యమ కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగారు. ఈ ఉద్యమంలో పురుషులతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.

Published : 15 Aug 2022 04:41 IST

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే:


భీమవరంలో ప్రకాశం చౌక్‌ కూడలి

జాతీయోద్యమ స్ఫూర్తితో పశ్చిమలో రగిలిన స్వాతంత్య్ర కాంక్ష అది సిద్ధించే వరకు కొనసాగింది. రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో, సాంకేతికత అంటే తెలియని సమయంలోనే నాయకులు రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఉద్యమ కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగారు. ఈ ఉద్యమంలో పురుషులతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.

1907 ఏప్రిల్‌19న..

1907 ఏప్రిల్‌ 19న బిపిన్‌ చంద్రపాల్‌ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి విద్యాధిక యువతలో చైతన్యాన్ని రగిలించారు. ఏప్రిల్‌ 24న భీమవరం చేరుకున్న ఆయన వెంట కృష్ణాపత్రిక సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు, బోడి నారాయణరావు ఉన్నారు. భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం పాలకోడేరు మండలం గరగపర్రులో పాలకోడేటి సుబ్బారావు ఇంట్లో బస చేశారు. సుబ్బారావు బావమరిది నండూరి జానకిరామయ్య రాజమండ్రి వాసి. ఆయన ద్వారానే బిపిన్‌ పర్యటన భీమవరంలో ఏర్పాటు చేశారు. భీమవరం తాలూకాలో వందేమాతరం ఉద్యమాన్ని పతాక స్థాయికి చేర్చిన ఘనత బిపిన్‌చంద్రపాల్‌కే దక్కుతుంది.

పాలకొల్లులో..

క్విట్‌ ఇండియా ఉద్యమ కాలంలో పాలకొల్లు పట్టణం గర్జించింది. ఆంగ్లేయులు దేశం వదిలివెళ్లాలని 1942లో అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ఛైర్మన్‌గా, కలగ గన్నేశ్వరరావు వైస్‌ఛైర్మన్‌గా ఉన్న పాలకవర్గం తీర్మానం చేసింది. ఆగస్టు 14న విద్యాసంస్థలను మూసివేసి ఉద్యమంలోకి దిగడంతో బ్రిటిష్‌ ప్రభుత్వం కౌన్సిల్‌ను రద్దు చేసి ప్రత్యేకాధికారిని నియమించింది. 17న పురపాలక కార్యాలయం ఎదుట బహిరంగ సభ నిర్వహించగా దాట్ల సీతారామరాజు ప్రసంగంతో పాలకొల్లు వాసులు రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమంలో పాల్గొన్నారు.

ఎందరో  మహానుభావులు

* అలనాడు ఉద్యమంలో పాల్గొన్న వారికి భోజన ఏర్పాట్లను భీమవరం కర్ణాల సత్రంలో నిర్వహించే కోమల విలాస్‌ యజమాని ఆకెళ్ల పార్థసారథి చేసేవారు. 1942లో క్విట్‌ఇండియా ఉద్యమ సమయంలో గునుపూడికి చెందిన కోటమర్తి కనకమ్మ బ్రిటిష్‌వారిని అడ్డుకున్న వీర వనితగా పేరొందారు.

* ఉద్యమ కాలంలో ఈ ప్రాంతంలో సప్తరుషులుగా పేరొందిన అడవి బాపిరాజు, సత్యవోలు సుబ్రహ్మణ్య, వేమూరి హనుమంతరావు, తనికెళ్ల చలపతి, పాలకోడేటి సత్యనారాయణశర్మ, ముష్టి సుబ్రహ్మణ్యం, తటవర్తి కృష్ణమూర్తిలు స్వాతంత్య్ర కోసం అహర్నిశలు శ్రమించారు.

* భీమవరానికి చెందిన షేక్‌ అలీ సాహెబ్‌ 1930 నుంచి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. 1941లో వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని 6 నెలలపాటు కారాగార శిక్షకు గురయ్యారు. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించడంతో ఆయన నాలుగేళ్లపాటు కారాగార శిక్ష, కొరడా దెబ్బల శిక్ష అనుభవించారు.

టంగుటూరి ప్రకాశంతో నాటి స్వాతంత్రోద్యమకారులు


1909లో కృష్ణా మండల సభ

వందేమాతరం ఉద్యమం ముమ్మరంగా జరుగుతున్న రోజుల్లో 1909లో కృష్ణామండల సభ పేరుతో భీమవరంలో మహాసభ నిర్వహించారు. ఆంగ్లేయులకు పన్నులు కట్టకూడదని ఈ సమావేశం పేర్కొంది. ఈ సభ నిర్వహణలో నాటి కోపల్లె కరణం కాళ్లకూరి నరసింహం పంతులు ప్రముఖపాత్ర వహించారు. ముగింపు సభలో ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు సతీసమేతంగా పాల్గొని జాతీయభావాన్ని వివరించారు. మూడురోజులు జరిగిన ఈ సభలు ప్రజల్లో నూతనోత్తేజాన్ని నింపాయి.

శిక్షకు గురై..

1907లో రాజమండ్రిలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు నాయకత్వంలో వందేమాతరం ఉద్యమం చేపట్టగా అప్పటి కళాశాల ప్రధానాచార్యుడు మార్క్‌హంటర్‌ 138 మంది విద్యార్థులను సస్పెండ్‌ చేశారు. వారిలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 23 మంది ఉన్నారు. వీరిలో భీమవరం పట్టణానికి చెందిన జోస్యుల రామకృష్ణయ్య, పంగిమర్రి వెంకటనరసింహం, వీరవాసరం గ్రామానికి చెందిన కేశవరపు కామరాజు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని