logo

వామ్మో.. బెల్లం!

రోనా మహమ్మారి విజృంభణ అనంతరం బెల్లం విక్రయాలు పుంజుకున్నాయి. రోగనిరోధక శక్తి పెంచే ఆహార పదార్థాల వినియోగం పెరగడమే దీనికి కారణం. మార్కెట్లో డిమాండ్‌ ఉన్నా బెల్లం విక్రయాలపై వ్యాపారులు విముఖత చూపుతున్నారు. ఎలాంటి ఆంక్షలూ లేవని అధికారులు చెబుతున్నా కిరాణా దుకాణాల్లో తనిఖీలు చేస్తుండటంతో వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు.

Published : 16 Aug 2022 05:38 IST

విక్రయించాలంటే భయం
ఎస్‌ఈబీ దాడులతో ఆందోళన
భీమవరం పట్టణం, న్యూస్‌టుడే


వ్యాపారులతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఎస్‌ఈబీ అధికారులు

* కొద్దికాలం కిందట నాటుసారా తయారీదారుడ్ని ఎస్‌ఈబీ అధికారులు పట్టుకుని బెల్లం కొనుగోళ్లపై ప్రశ్నించారు. భీమవరంలో ఓ దుకాణంలో కొనుగోలు చేశానని అతడు చెప్పడంతో సంబంధిత వ్యాపారి విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది.
* జంగారెడ్డిగూడెం పరిధిలో బెల్లం విక్రయించిన ఓ చిన్న దుకాణదారుడ్ని పోలీసులు స్టేషన్‌కు పిలవడంతో వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
* బెల్లం విక్రయంపై కేసులు నమోదవడంతో మనస్తాపానికి గురైన ఇద్దరు వ్యాపారులు ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడటంతో వ్యాపారుల్లో మరింత ఆందోళన నెలకొంది.

కరోనా మహమ్మారి విజృంభణ అనంతరం బెల్లం విక్రయాలు పుంజుకున్నాయి. రోగనిరోధక శక్తి పెంచే ఆహార పదార్థాల వినియోగం పెరగడమే దీనికి కారణం. మార్కెట్లో డిమాండ్‌ ఉన్నా బెల్లం విక్రయాలపై వ్యాపారులు విముఖత చూపుతున్నారు. ఎలాంటి ఆంక్షలూ లేవని అధికారులు చెబుతున్నా కిరాణా దుకాణాల్లో తనిఖీలు చేస్తుండటంతో వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు.

సారా తయారీ, విక్రయాల నిర్మూలన లక్ష్యంతో పరివర్తన 2.0 పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా అధికార యంత్రాంగం చర్యలు ముమ్మరం చేసింది. నాటుసారా తయారీకి అవసరమైన బెల్లం, అమ్మోనియా తదితర ముడిసరకుల విక్రయాలపై దృష్టి సారించారు. సాధారణ బెల్లాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి సారా తయారీకి ఉపయోగిస్తున్నట్లు తేలడంతో ఎక్కడ ఎంత కొనుగోలు చేస్తున్నారనే వివరాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని సందర్భాల్లో వ్యాపారులను విచారిస్తున్నారు. ఇలాంటి బాధలన్నీ తమకు ఎందుకనే భావనతో వ్యాపారులు బెల్లం విక్రయాలు నిలిపివేస్తున్నారు. జిల్లా కేంద్రమైన భీమవరంలో కిరాణా దుకాణాల ఎదుట ఈ మేరకు ఇటీవల బ్యానర్లను కూడా ఏర్పాటు చేశారు. తరువాత ఎస్‌ఈబీ అదనపు ఏటీవీ రవికుమార్‌ సూచనల మేరకు అధికారులు భీమవరంలో వ్యాపారులతో మాట్లాడారు. గతంలో నాలుగు కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం ఎలాంటి కేసులు నమోదుకాలేదని సీఐ వర్మ చెప్పారు. 

ఇవేం బాధలు..
విక్రయాల పేరిట కేసులు నమోదు చేయడం కంటే మొత్తంగా బెల్లం తయారీ కేంద్రాలను మూసివేయిస్తే తమకు ఇలాంటి బాధలు తప్పుతాయని వ్యాపారులు అంటున్నారు. పండుగలు, వేడుకల సమయంలో పిండి వంటల తయారీ కోసం సాధారణ వినియోగదారులు 3 నుంచి 5 కిలోల వరకు కొనుగోలు చేస్తారు. వివాహ వేడుకల్లో బూరెలు, అరిసెలు తదితర పిండివంటల తయారీకి అధిక మొత్తంలో బెల్లం అవసరమవుతుంది. ఇలాంటి సందర్భాల్లోనూ కొనుగోలుదారుల వివరాలపై ఆరాతీస్తే దుకాణాలకు వచ్చేవారుండరని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని