logo

కార్పొరేషన్‌లో అవకతవకలపై విచారణ

‘ఏలూరు కార్పొరేషన్‌లో కాంట్రాక్టుల విషయంలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నాం.. అర్హులందరికీ వరద నష్టపరిహారం ఇస్తున్నాం’ అని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు.

Published : 16 Aug 2022 05:38 IST

అవినీతి జరిగితే చర్యలు తీసుకుంటాం
బడుల విలీన ప్రక్రియలో సమస్యలు లేవు
పారిశుద్ధ్యంపై ప్రత్యేక కార్యాచరణ
‘ఈనాడు’ ముఖాముఖిలో కలెక్టర్‌
ఈనాడు డిజిటల్‌, ఏలూరు

‘ఏలూరు కార్పొరేషన్‌లో కాంట్రాక్టుల విషయంలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నాం.. అర్హులందరికీ వరద నష్టపరిహారం ఇస్తున్నాం’ అని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. పాఠశాలల విలీన ప్రక్రియలో ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. జిల్లాలో పారిశుద్ధ్యం సమస్యలు, ధాన్యం బకాయిల చెల్లింపులు తదితర అంశాలపై ఆయన  ‘ఈనాడు’ ముఖాముఖీలో వివరించారు.

ఈనాడు: ఏలూరు కార్పొరేషన్‌లో నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు కట్టబెడుతున్నట్లు వస్తున్న ఆరోపణలపై చర్యలు ఏమిటి?    
కలెక్టర్‌:
అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై జేసీని విచారణాధికారిగా నియమించాం. అన్ని కోణాల్లో విచారించారు. అవినీతి జరిగిందని నిరూపణ అయితే చర్యలు తీసుకుంటాం.

వరద నష్టపరిహారం విషయంలో చాలా మంది అర్హుల పేర్లు గలం్లతయినట్లు ఆరోపణలున్నాయి.?  
జాబితాను పారదర్శకంగా తయారు చేశాం. ఒక్క గ్రామంలో సమస్య వచ్చింది. ప్రత్యేక బృందాలతో పునఃపరిశీలన చేయించాం. ఒకటి, రెండు శాతం మందికి అర్హత ఉన్నా పేర్లు గల్లంతయ్యాయని తెలిసింది. వారి వివరాలు మళ్లీ నమోదు చేశాం. భవనాల్లోకి నీరు వచ్చిన వారు కూడా నష్టపరిహారం ఇవ్వాలంటున్నారు. దాని వల్లే ఈ ఆరోపణలు వచ్చి ఉండొచ్చు.. నష్టం జరిగితేనే నిబంధనల ప్రకారం పరిహారం ఇస్తాం.'

పాఠశాలల విలీన ప్రక్రియ సక్రమంగా జరగలేదని.. సమస్యలు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి.?    
ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. తల్లిదండ్రుల కమిటీ, ఉపాధ్యాయు లతో స్వయంగా నేనే వీడియో సమావేశం ద్వారా సమస్యలు తెలుసుకున్నాను.  43 పాఠశాలల్లో సమస్యలు ఉన్నట్లు తెలిసింది.  అందులో 22 చోట్ల నిర్ధారించుకుని  మ్యాపింగ్‌ నుంచి తొలగించాం. ఎక్కడైనా వాస్తవంగా సమస్యలుంటే పరిష్కరిస్తాం. విలీన ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేస్తున్నాం.

జిల్లావ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదు
క్షేత్రస్థాయిలో అక్కడక్కడా సమస్యలున్నట్లు నా దృష్టికి  వచ్చింది. సిబ్బంది కొరత కూడా ఉంది. పారిశుద్ధ్య నిర్వహణలో కొత్త కార్యాచరణ రూపొందిస్తున్నాం పుర, నగరపాలక అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. చర్చించి పరిష్కారానికి కృషి చేస్తాను. 

జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. పరిష్కారం ఏమిటి.
అప్రోచ్‌ రోడ్లు లేక నిర్మాణ సామగ్రి తీసుకువెళ్లటంలో సమస్యలున్న విషయం వాస్తవమే. ఇప్పటికే గ్రావెల్‌ రహదారులు ఉన్నాయి. లోడ్‌ లారీలు ప్రయాణించటంతో గుంతలు పడి వర్షాలకు ఇబ్బంది అవుతోంది. జిల్లావ్యాప్తంగా లేఅవుట్లలో రహదారుల నిర్మాణానికి దాదాపు రూ.40 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. తాగునీరు, విద్యుత్తు, డ్రెయినేజీ వ్యవస్థ కూడా 50 శాతం నిర్మాణాలు పూర్తైన వెంటనే ఏర్పాటు చేస్తాం.

ఖరీఫ్‌ మొదలై చాలా రోజులవుతున్నా.. రబీ ధాన్యం నగదు రైతులకు ఇంకా జమ కాలేదు. పరిష్కారం ఏమిటి    
రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. జిల్లాలో 4 వేల మంది రైతులకు ఇంకా రూ.130 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.   నగదు విడుదల కాగానే వారి ఖాతాల్లోకి నేరుగా జమవుతాయి. త్వరలోనే నగదు వచ్చే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని