logo
Published : 16 Aug 2022 05:38 IST

అభయ హస్తంపై స్పందన అంతంతే!

పథకానికి దూరమవుతున్న మహిళలు

పోడూరు, న్యూస్‌టుడే


పోడూరులో సభ్యులకు అవగాహన కల్పిస్తున్న సిబ్బంది

నిరుపేదలైన స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యుల్లో 60 ఏళ్లు పైబడిన వారికి పింఛన్‌ అందించేందుకు అభయహస్తం పథకం 2009లో ప్రారంభమైంది. ఈ పన్నెండేళ్లలో పథకానికి దూరమైన వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. గతేడాది కొవిడ్‌ కారణంగా లబ్ధిదారుల నుంచి నగదు తీసుకోకుండా ప్రభుత్వం రెన్యువల్‌ చేసింది. ప్రస్తుతం వైరస్‌ ప్రభావం తగ్గడంతో 2021-22, 2022-23లకు సంబంధించి రెండేళ్ల ప్రీమియం వసూలు చేయాలని సూచించింది. దీంతో పథకం కింద ప్రీమియం వసూళ్లకు అధికారులు సిద్ధమయ్యారు. ఎస్‌ఏహెచ్‌జీకి చెందిన మహిళల నుంచి నగదు కట్టించుకుని, పునరుద్ధరణ చేస్తున్నారు. జులై 1 నుంచి ప్రీమియం కట్టించుకున్నా ఇప్పటి వరకు 35.23 శాతం మంది చెల్లించగా 63.03 శాతం మంది కట్టాల్సి ఉంది.

ఈ పథకంలో 92,307 మంది లబ్ధిదారులు ఉన్నారు. అయితే కొన్నేళ్లుగా కొత్తవారి చేరికలను నిలిపివేశారు. దీంతో పాతవారే కొనసాగుతున్నారు. అర్హులైనవారు ఏడాదికి రూ.365 కట్టాలి. దీనికి వినియోగ రుసుం ఏడాదికి రూ.20 అదనం. ఈ లెక్కన రెండేళ్లకు కలిపి మొత్తం రూ.770 వంతున జమ చేయిస్తున్నారు. రెండు విడతల్లో భాగంగా ఇప్పటి వరకు సుమారు రూ.1.68 కోట్లు వసూలు చేశారు. ఈ ప్రక్రియలో ఇంకా 59,789 మంది నుంచి సుమారు రూ.3.96 కోట్ల వరకు రావాల్సి ఉంది. అయితే ఇందులో చాలా మంది కట్టేందుకు వెనుకాడుతున్నారు.

సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నాం
సద్వినియోగం చేసుకొనేలా పథకాన్ని కొనసాగించుకోవాలని లబ్ధిదారులకు సూచిస్తున్నాం. ముందుకొచ్చిన వారితో ప్రీమియం కట్టిస్తున్నాం. పూర్తిస్థాయిలో నగదు జమ చేస్తే 60 ఏళ్లు నిండాక నెలకు రూ.500 చొప్పున పింఛను వస్తుంది. అర్హులైతే దీంతో సంబంధం లేకుండా వైఎస్సార్‌ పింఛను కూడా పొందవచ్చు. ఇష్టం లేనివారు స్వచ్ఛందంగా ముందుకొస్తే ఇప్పటివరకు కట్టిన మొత్తం ఇచ్చేస్తాం.

- వేణుగోపాల్‌, డీఆర్డీఏ పీడీ, భీమవరం

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని