logo
Published : 16 Aug 2022 05:58 IST

ఆజాదీకా అమృతోత్సాహం

భీమవరంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం


జాతీయ పతాకావిష్కరణ అనంతరం మువ్వన్నెల బెలూన్లను ఎగురవేస్తున్న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రాజా, కలెక్టర్‌ ప్రశాంతి

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: పునర్విభజన అనంతరం ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో స్వాతంత్య్ర వేడుకలు సోమవారం వైభవంగా జరిగాయి. కలెక్టరేట్‌కు ఎడమవైపున ఉన్న ఖాళీ స్థలాన్ని వేడుకల కోసం సుందరంగా తీర్చిదిద్దారు. అప్పటికప్పుడు తాత్కాలిక మార్గాలు వేశారు. ప్రత్యేక టెంట్లు, మూడు రంగుల జెండాలు, పూలతో ప్రాంగణాన్ని అలంకరించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన వేడుకలు మధ్యాహ్నం 1.30 వరకు నిరాటంకంగా కొనసాగాయి. కలెక్టర్‌ పి.ప్రశాంతి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దాడిశెట్టి రాజా, ఎస్పీ యు.రవిప్రకాశ్‌ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి దాడిశెట్ట రాజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. స్వాతంత్య్ర ఉద్యమ నేతల కుటుంబ సభ్యులను, సమాజ సేవకులను సత్కరించారు. క్రీడల్లో రాణిస్తున్న యువతకు ప్రోత్సాహకంగా జ్ఞాపికలు అందించారు. వివిధ శాఖలకు చెందిన వందల మంది అధికారులు, సిబ్బందిని ప్రశంసా పత్రాలతో సన్మానించడంతో ఉద్యోగుల మోములో ఆనందం వెల్లివిరిసింది.


గౌరవ వందనం సమర్పిస్తూ పోలీసుల కవాతు

ఆకట్టుకున్న విన్యాసాలు.. జిల్లాలోని పలు విద్యా సంస్థల విద్యార్థుల ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. మల్లఖంబ్‌, రోప్‌ మల్లఖంబ్‌ విన్యాసాలు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల బృందం బ్యాండ్‌ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేడుకలను నేరుగా వీక్షించేందుకు పలు ప్రాంతాల నుంచి ప్రజలు, ఉద్యోగులు కుటుంబ సభ్యులతో తరలివచ్చారు. యువత ప్రాంగణంలో స్వీయచిత్రాలు తీసుకుంటూ సందడి చేశారు.


ప్రాంగణంలో చిన్నారుల సందడి


నాయకుల వేషధారణలో విద్యార్థుల ప్రదర్శన


మహనీయుల స్మృతిలో..


సత్కారం పొందిన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహనీయులను స్మరించుకోవడంతో పాటు వారి కుటుంబ సభ్యులను అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. పస్తుల సాగరం, భూపతిరాజు సుబ్బతాతరాజు, షేక్‌ అలీ సాహెబ్‌, కోటమర్తి కనకమహాలక్ష్మి, బర్మా కేశవరావు, తటవర్తి కృష్ణమూర్తి, తటవర్తి సుబ్బారావు, అయ్యగారి అమ్మిరాజు, గరగ వెంకటరమణమ్మ, ఉద్దరాజు వెంకట్రాజు, అడవి బాపిరాజు, ప్రత్తి శేషయ్య, పాలకోడేటి సత్యనారాయణశర్మ, గొట్టుముక్కల రామచంద్రరాజు కుటుంబ సభ్యులను సత్కరించారు.


మువ్వన్నెల నీడలో ఆకివీడు

ఆకివీడు, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆకివీడులో సోమవారం వెయ్యి మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. బాలుర ఉన్నత పాఠశాల వద్ద నుంచి గుమ్ములూరు కూడలి వద్ద పోలీస్‌స్టేషన్‌ వరకు జరిగిన ఈ ప్రదర్శనలో లయన్స్‌క్లబ్‌ సభ్యులు, వ్యాపారులు, విద్యార్థులు, ప్రజలు దాదాపు 5 వేల మంది దేశభక్తి గీతాలు ఆలపిస్తూ.. భారత్‌ మాతకీ జై నినాదాలతో ముందుకు సాగారు.


విద్యా శాఖ శకటానికి ప్రథమ స్థానం

విద్యా శాఖ శకటం ప్రథమ స్థానంలో నిలవగా డీఈవో వెంకటరమణ బహుమతి అందుకున్నారు. పశుసంవర్ధక, వ్యవసాయ శాఖల శకటాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. డ్వామా శకటానికి ప్రత్యేక బహుమతి దక్కింది.

స్టాళ్ల పరిశీలన: చేనేత, సమాచార, వ్యవసాయ, ఉద్యాన, పోలీసు, పరిశ్రమలు, డీఆర్‌డీఏ తదితర శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఎస్పీ యు.రవిప్రకాశ్‌ తదితరులు పరిశీలించారు. సమాచార శాఖ స్టాల్‌లో అల్లూరి సీతారామరాజు జీవిత విశేషాలు, నాయకుల అరుదైన చిత్రాలను ప్రదర్శించారు.


సంక్షేమ పథకాలు చేరువ


ప్రసంగిస్తున్న రాజా

భీమవరం పట్టణం, వీరవాసరం, న్యూస్‌టుడే:  అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువ చేశామని జిల్లా ఇన్‌ఛార్జి, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) అన్నారు. సోమవారం భీమవరంలోని కలెక్టరేట్‌ ప్రాంగణం వద్ద జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు. నవరత్నాలను కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ అందిస్తున్నామన్నారు. అమ్మఒడి పథకం ద్వారా జిల్లాలో 1.4 లక్షల మందికి రూ.15 వేల చొప్పున రూ.221 కోట్లు అందించామన్నారు. మన బడి- నాడు నేడులో 727 పాఠశాలల్లో రూ.262 కోట్లతో మౌలిక వసతులు కల్పించామన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేసేలా 515 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశామన్నారు. ఇంటింటికీ సేవలు అందేలా 8,660 వాలంటీర్లను నియమించామన్నారు. జిల్లాలో 2.18 లక్షల మందికిపైగా పింఛన్లు ఇస్తున్నామన్నారు. కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఎస్పీ యు.రవిప్రకాశ్‌తో కలిసి శాంతి కపోతాలను, రంగుల బెలూన్లను ఆకాశంలోకి విడిచిపెట్టారు.


పోల్‌ మల్లఖంబ్‌లో క్రీడాకారుల విన్యాసం


రింగులతో యువతుల సందడి


కనకదుర్గలా అభినయం

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని