logo
Updated : 17 Aug 2022 10:12 IST

గూడు కట్టిన ఆవేదన

నిర్వాసితులకు  దక్కని ఇళ్లు

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే

చాలా కాలంగా కదలిక లేని నిర్మాణాలు

పోలవరం ప్రాజెక్టుతో ముంపు బారిన పడుతున్న 24 గ్రామాల్లోని నిర్వాసిత గిరిజనేతరులకు జంగారెడ్డిగూడెం మండలం చల్లావారిగూడెంలో పునరావాస కాలనీల నిర్మాణం జరుగుతోంది. ఏళ్లు గడుస్తున్నా ఇళ్లు వివిధ దశల్లో ఉండగా.. రోడ్లు, డ్రెయిన్లు తదితర మౌలిక వసతుల కల్పనకు మరికొంత సమయం పట్టేలా ఉంది. నిర్దేశిత గడువు మేరకు ఈ ఏడాది అక్టోబరుకు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఇంకో ఏడాదైనా అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పనులకు వర్షాలు ఆటంకం కలిగిస్తున్నాయి. మరోవైపు గుత్తేదారులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కూడా నిర్మాణాల ఆలస్యానికి కారణంగా ఉంది. ఇప్పటికే ఒక విడత వరదలు ముంచెత్తాయి. మళ్లీ వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో కాలనీలు ఎప్పుడు పూర్తవుతాయా అని నిర్వాసితులు ఎదురుచూస్తున్నారు. పనులు పూర్తి కాకున్నా.. 70 కుటుంబాల వారు సామగ్రి సహా వచ్చి ఇళ్లలో చేరినట్లు గృహ నిర్మాణ శాఖ ఈఈ నరసింహారావు తెలిపారు.
* చల్లావారిగూడెం కాలనీలో సుమారు 30 వేల మీటర్ల మేర గ్రావెల్‌ పనులు పూర్తి చేయగా మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మరుగుదొడ్లు 1,358 నిర్మించగా.. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.
* విద్యుత్తు సర్వీసులు 50 ఇళ్లకే ఇచ్చారు. దాదాపు 1,162 గృహాలకు ఇంటర్నల్‌ వైరింగ్‌ పూర్తయినా సర్వీసులు ఇవ్వడంలో జాప్యం నెలకొంది. వైరింగ్‌తో పాటు కొన్ని అసంపూర్తి పనులతో ఆ ఇళ్లలో ఉంటున్న నిర్వాసితులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
* పునరావాస కాలనీలు కడుతున్న నిర్మాణ సంస్థలకు సుమారు రూ.40 కోట్ల మేర బిల్లులు బకాయిలున్నాయి. దాదాపు అయిదు నెలలుగా రాకపోవడంతో పనుల్లో వేగం మందగించింది.
  జగన్నాథపురం గ్రామానికి చెందిన నిర్వాసిత ఫయాజ్‌ కుటుంబం కొద్ది రోజుల కిందట పునరావాస కాలనీకి వచ్చింది. వీరి ఇంట్లో గాలి పంకా తిరిగే పరిస్థితి లేదు. ఫ్యాన్‌ పెట్టుకునేందుకు ఇనుప కొక్కేలు లేవని ఫయాజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
‘మాకు పునరావాస పరిహారం ఇంకా రాలేదు. అయినా వరదల భయంతో ఇక్కడికి వచ్చాం. సామగ్రి తెచ్చుకోవడానికి ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించింది. మంచినీటి కుళాయిలు లేవు. రోజూ నీరు సరఫరా చేస్తున్నారు’ అని శ్రీరాంపురానికి చెందిన నిర్వాసితుడు వరకా లక్ష్మణ్‌ తెలిపారు.
 

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని