logo

పేర్ల నమోదుతో సరి!

‘‘గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుని దివ్యసముఖమునకు.. నా చరవాణిని ఈ రోజు పాఠశాలకు  తీసుకురాలేదు.

Published : 17 Aug 2022 06:05 IST

ఈ-హాజరుకు ‘సర్వర్‌’ సమస్య

హాజరు నమోదు కాక ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులు

‘‘గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుని దివ్యసముఖమునకు.. నా చరవాణిని ఈ రోజు పాఠశాలకు  తీసుకురాలేదు. చరవాణి వినియోగాన్ని తగ్గించాలని భావిస్తున్నాను. ‘ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ యాప్‌’ ద్వారా మంగళవారం  నుంచి హాజరు వేయాలని ఆదేశించారు. నాలాగా చాలా మంది చరవాణి తీసుకు   రానందున యాప్‌ ద్వారా హాజరు వేయలేకపోతున్నారు. ఈ దృష్ట్యా ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు ఏర్పాటు  చేయగలరు.’’
- ఒక ఎంపీయూపీ ఉపాధ్యాయుడు  హెచ్‌ఎంకు రాసిన లేఖ ఇది.

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ-హాజరు నమోదుకు సర్వర్‌ సమస్య తలెత్తింది. మంగళవారం నుంచి ఉపాధ్యాయులు ‘ఇంటిగ్రేటెడ్‌ స్కూలు యాప్‌’ ద్వారా హాజరు వేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఆ మేరకు హాజరు వేయడానికి ఉపాధ్యాయులు ఏకకాలంలో యత్నించడంతో సాంకేతిక సమస్య ఎదురైంది. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు సంబంధించిన హాజరునూ ఇదే యాప్‌లో నిక్షిప్తం చేయడంతో సర్వర్‌పై ఒత్తిడి పెరిగింది.
ఉపాధ్యాయుల హాజరుకు సంబంధించి కొత్తగా ప్రవేశపెట్టిన యాప్‌లో తొలిరోజు పేర్ల నమోదుతోనే సరిపోయింది. ఏలూరు జిల్లాలో సుమారు 7 వేల మంది ఉపాధ్యాయులు ఉండగా 50 శాతం మంది మాత్రమే తమ పేర్లను నమోదు చేయించుకోగలిగారు. ఇందులో 992 మంది మాత్రమే యాప్‌ ద్వారా హాజరు వేశారు. ఇదే యాప్‌లో విద్యార్థుల హాజరు కూడా వేయాలంటూ ఆదేశాలు జారీకావడంతో సర్వర్‌పై భారం పెరిగింది. కొత్త యాప్‌లో మొదటి రోజు 84 శాతం పాఠశాలలకు సంబంధించిన విద్యార్థుల హాజరును  వేయగలిగారు. జిల్లాలో 2,335కి గాను 1,963 పాఠశాలలకు చెందిన విద్యార్థుల హాజరును యాప్‌ ద్వారా వేయగలిగారు. ఉపాధ్యాయుల హాజరుకు పాత విధానం అమలు చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని