logo
Published : 17 Aug 2022 06:05 IST

అక్రమంలో మండపాక మడుగు

 రూ.41 కోట్ల భూమి అన్యాక్రాంతం

  వెలసిన తాత్కాలిక షెడ్లు

డ్రెయిన్‌ ఆనుకుని ఏర్పాటు చేసిన షెడ్లు

తణుకు, న్యూస్‌టుడే: కొంతమంది అక్రమార్కులు మురుగు నీరు ప్రవహించే మడుగులను దర్జాగా కబ్జా చేస్తున్నారు. దీంతో వర్షాలు, వరదల సమయంలో మురుగు వెళ్లే దారిలేక నివాసాల్లోకి చేరుతోంది. దీంతో అటు ప్రయాణికులు, ఇటు స్థానికులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు.
సంరక్షించాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంతో తణుకు మండలంలోని మండపాక మడుగు సుమారు 41 ఎకరాల మేర కబ్జా చెరలో ఉంది. ఇక్కడ ఎకరం ధర రూ.కోటి పలుకుతోంది. అంటే ఆ లెక్కన రూ.41 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణల పరమైంది. అదే భూమిలో కొంత మేర కొన్ని తాత్కాలిక షెడ్లు, వెదురు, టేకు మొక్కలు వంటివి దర్శనమిస్తున్నాయి. అక్కడితో ఆగకుండా మడుగుకు ఒకవైపు ఉన్న కాలువ గట్టుకు కంచె ఏర్పాటు చేసి రైతులు, సంబంధిత అధికారులను అటువైపు వెళ్లనివ్వకుండా దర్జాగా కొంత ఆక్రమించుకున్నారు.

తెర దీసిందిలా..
తణుకు పరిసర ప్రాంతాల్లో ఉన్న మురుగు నీటిని యనమదుర్రు డ్రెయిన్‌కు తరలించే మండపాక మడుగు (సత్యవాడ డ్రెయిన్‌) ఉండ్రాజవరం మండలం వట్లూరు నుంచి తణుకు మండలం వేల్పూరు వరకు 8 కిలో మీటర్ల మేర ఉంది. దీనిలో ప్రధానంగా పైడిపర్రు నుంచి మండపాక వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర 200 లింకుల(40 మీటర్లు) వెడల్పున ఉంది.
గతంలో 60 ఎకరాలు ఉన్న మండపాక మడుగు ప్రస్తుతం సుమారు 20 ఎకరాలకే పరిమితమైంది. అంటే సుమారు 40 ఎకరాల భూమిని కబ్జా చేశారు. ఇదే రీతిలో మండపాక నుంచి పైడిపర్రు వరకు 2.08 కిలో మీటర్ల మేర 50 లింకుల వెడల్పున ఉంది. ఇక్కడ సుమారు 3 ఎకరాల్లో మురుగు నీటి కాలువ ఉండగా 1.50 ఎకరాలు ఆక్రమణకు గురైంది. కొన్నిచోట్ల కాలువ సన్నగా ఉంది. అంటే మొత్తం 8 కిలో మీటర్ల వ్యవధిలో సుమారు 63 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సిన డ్రెయిన్‌ 21.50 ఎకరాలు మాత్రమే ఉంది. అంటే సుమారు 41.50 ఎకరాలు మురుగు నీటి పారుదల శాఖకు చెందిన భూమి ఆక్రమణకు గురైంది.

 కబ్జాల పర్వం
అత్తిలి సబ్‌ డివిజన్‌ పరిధిలో గోస్తనీ  నది డ్రెయిన్‌ వేల్పూరు నుంచి పెనుమంట్ర మీదుగా 37.60 కిలో మీటర్ల మేర ప్రవహించి పాలకోడేరు వద్ద యనమదుర్రు డ్రెయిన్‌లో కలుస్తుంది. తణుకు మండలం నుంచి అనేక గ్రామాల్లో మురుగు నీటిని యనమదుర్రు డ్రెయిన్‌కు మళ్లిస్తుంది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న డ్రెయిన్‌ ఆక్రమణకు గురవడంతో మురుగు నీటి పారుదల నిలిచిపోయింది.
* అత్తిలి మండలం డి.కుముదవల్లి నుంచి అత్తిలి మీదుగా పాలూరు, కొమ్మర నుంచి ఎస్‌.కొండేపాడు వరకు సుమారు 10.4 కిలో మీటర్ల ప్రవహించి రాజకోడు డ్రెయిన్‌ యనమదుర్రు డ్రెయిన్‌లో కలుస్తుంది. దీని వెంబడి చేపలు, రొయ్యిల సాగు పేరుతో ఆక్రమించి చెరువులు చేశారు. దీంతో మురుగు నీటి పారుదల డ్రెయిన్‌కు నిలిచిపోయింది.


త్వరలో సర్వే చేస్తాం
గతంలో మండపాక మడుగు సర్వే చేయాల్సి ఉండగా నిలిచిపోయింది. డ్రెయిన్‌ ఆక్రమణకు గురైన మాట వాస్తవం. డ్రెయిన్‌ పొడవునా ఆక్రమణలున్నాయి. ప్రజాప్రతినిధుల సహకారంతో త్వరలో డ్రెయిన్‌ను సర్వే చేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటాం.    

  - ఏవీ సత్యనారాయణ, మురుగు నీటి పారుదల శాఖ ఏఈ, అత్తిలి

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని