logo

లేదంటే..రాదంతే

పెరిగిన ఎరువుల ధరలు, అప్పుల బాధలు, ప్రకృతి వైపరీత్యాలు.. మరోపక్క గిట్టుబాటు లేని ధరలు.. ఇలా ప్రతికూల పరిస్థితులన్నీ అన్నదాత వెన్ను విరుస్తుంటే.. గోరుచుట్టుపై రోకటి పోటులా కొందరు రెవెన్యూ అధికారులు రాబందుల్లా పీక్కు తింటున్నారు.

Published : 24 Sep 2022 05:59 IST

ముడుపు కడితేనే పాసుపుస్తకం
 ఆగని వీఆర్వోల దందా

పెరిగిన ఎరువుల ధరలు, అప్పుల బాధలు, ప్రకృతి వైపరీత్యాలు.. మరోపక్క గిట్టుబాటు లేని ధరలు.. ఇలా ప్రతికూల పరిస్థితులన్నీ అన్నదాత వెన్ను విరుస్తుంటే.. గోరుచుట్టుపై రోకటి పోటులా కొందరు రెవెన్యూ అధికారులు రాబందుల్లా పీక్కు తింటున్నారు. 1బీ, పట్టాదారు పాస్‌ పుస్తకాల జారీలో వసూళ్ల పర్వానికి తెర తీస్తున్నారు.ఎకరానికి పాస్‌పుస్తకం ఇప్పించాలంటే రూ.3 వేలు-రూ.10 వేల వరకూ డిమాండ్‌ చేస్తున్నారు.చాలా చోట్ల మండల స్థాయి అధికారులకు కూడా ఇందులో వాటాలుంటున్నాయి. ఈనాడు డిజిటల్‌, భీమవరం, న్యూస్‌టుడే-భీమవరం అర్బన్‌, పెనుమంట్ర, చాట్రాయి

విధానం ఇది
పట్టాదారు పాస్‌ పుస్తకానికి దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లోగా రెవెన్యూ సిబ్బంది నోటీసులు ఇవ్వాలి. 15 రోజుల వరకు దరఖాస్తులో మార్పులు, తప్పులు సరిదిద్దటం, ఇతర అభ్యంతరాలు స్వీకరించాలి. మరో నాలుగు రోజుల్లో వీఆర్వో, తహశీల్దారు పరిశీలించాలి. ఈ ప్రక్రియ మొత్తం 21 రోజుల్లో పూర్తి చేయాలి. అన్నీ సవ్యంగా ఉంటే 1బీ ఇవ్వాలి. వీలైనంత త్వరగా రైతు దరఖాస్తులో ఇచ్చిన చిరునామాకు పాస్‌పుస్తకం పోస్ట్‌ద్వారా పంపాలి. క్షేత్రస్థాయిలో అసలు విధానంపై రైతులకు అవగాహన లేదు. అధికారులు కల్పించరు కూడా. దీని మంజూరులో వీఆర్వోలే దళారుల పాత్ర పోషిస్తున్నారు. దరఖాస్తు పై స్థాయికి వెళ్లాలంటే వీరి వాటా చెల్లించాల్సిందే. ఈ వాటాలు ఒక్కో చోట ఒక్కోలా ఉన్నాయి. కొందరు రూ.3 వేల నుంచి రూ.5 వేలు తీసుకుంటే..అత్యవసరంగా పాసుపుస్తకం కావాలంటే రూ.5 వేలు-రూ.10వేల వరకూ వసూలు చేస్తున్నారు. ముడుపు కడితేనే పని జరుగుతుందని తేల్చి చెబుతున్నారు.

రైతుల అవసరాలను అలుసుగా
పాస్‌పుస్తకాలను ప్రామాణికంగా తీసుకునే బ్యాంకర్లు పంట రుణాల మొదలు దీర్ఘకాలిక రుణాల వరకూ మంజూరు చేస్తున్నారు. వారసత్వంగా వచ్చిన పొలాలను తమ పూర్వీకుల పేరు నుంచి తమ పేరుకు మార్చుకోవడానికి రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇలా రైతుల అవసరాలను అధికారులు ఆసరాగా తీసుకుని పావులు కదుపుతున్నారు. డబ్బులు ఇవ్వని వారి దరఖాస్తు విషయంలో ఏదో మెలిక పెట్టి కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు. పలుకుబడి ఉన్నవారికి వెంటనే పని జరిగిపోతున్నా.. సాధారణ ప్రజలకు మాత్రం కాలయాపనే మిగులుతోంది.

నగదు డిమాండ్‌ చేస్తే చర్యలు
దరఖాస్తు చేసుకున్న వారికి నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోనే పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందించాలి. నగదు డిమాండ్‌ చేస్తే ఫిర్యాదు చేయండి. చేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. ఎవరికీ నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. డిమాండ్‌ చేస్తే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటాం.-అరుణ్‌బాబు, జేసీ ఏలూరు,   -జె.వెంకటమురళి, జేసీ పశ్చిమగోదావరి

* పెనుమంట్ర మండలంలోని ఓ మేజర్‌ పంచాయతీలో ఓ రైతు తన కుమారుడు, కోడలుకు చెందిన భూమికి సంబంధించి పట్టాదారు పాసు పుస్తకానికి దరఖాస్తు చేశారు. అన్నీ సక్రమంగా ఉన్నా మాకేమిటి అంటూ స్థానిక రెవెన్యూ ఉద్యోగి అడిగారు. రూ.రెండు వేలు చేతిలో పెట్టగా తిరస్కరించారు. పాసు పుస్తకం వచ్చాక మరికొంత ఇస్తానులే అంటే... అలా కుదరదు పుస్తకం పోస్ట్‌లో వస్తుంది అంటూ మరో నాలుగు వేలు డిమాండ్‌ చేశారు. చివరకు మరో రెండు వేలు ఇస్తే గాని పని ముందుకు సాగలేదు.
* కొన్ని నెలల కిందట చాట్రాయి మండలం చీపురుగూడెంకి చెందిన కోటేశ్వరరావు అనే రైతు వారసత్వంగా వచ్చిన పొలాలకు పాస్‌పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అన్నీ సరిగ్గా ఉన్నా వీఆర్వో పట్టించుకోక పోవటంతో దాదాపు ఐదారు నెలలు కార్యాలయం చుట్టూ తిరిగారు. విసిగిపోయిన ఆ రైతు వీఆర్వోపై దాడి చేశారు. తన దగ్గర డబ్బులు తీసుకుని కూడా పని చేయలేదని ఆరోపించారు. వీఆర్వో ఫిర్యాదుతో స్థానిక పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు.  
* ఏలూరు విద్యానగర్‌కు చెందిన హరి ప్రసాద్‌ విశ్రాంత ఉపాధ్యాయుడు. ఉద్యోగ విరమణ సమయంలో వచ్చిన నగదుతో భీమడోలు మండలంలో రెండెకరాల పొలం కొన్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొత్తం పూర్తికాగానే పాస్‌ పుస్తకానికి దరఖాస్తు చేశారు. నాలుగు నెలలు గడిచినా అక్కడి వీఆర్వో మాత్రం ఇవ్వాళ రేపు అంటూ వాయిదాలు వేస్తున్నారు. దీంతో విషయం అర్థం చేసుకుని రూ.4 వేలు సమర్పించుకున్నారు. వారంలోగా పాస్‌ పుస్తకం వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు