logo

అయ్యయ్యో ఉల్లి!

తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్‌లో ఆలస్యంగా ఉల్లి విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఏటా కర్నూలు ఉల్లి సీజన్‌ జులైలో ప్రారంభమై, ఆగస్టులో ఊపందుకునేది. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులతో మార్కెట్‌ రద్దీగా ఉండేది. కానీ ఈ ఏడాది ఆలస్యంగా సీజన్‌ ప్రారంభమెంది. ఇప్పటికే వందల టన్నుల వ్యాపారం జరగాల్సి ఉన్నా...ఈ ఏడాది ఇంకా పుంజుకోలేదు. 

Published : 24 Sep 2022 05:59 IST

మందగమనంలో వ్యాపారం

తాడేపల్లిగూడెం మార్కెట్‌కు దిగుమతవుతున్న ఉల్లి

తాడేపల్లిగూడెం, న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్‌లో ఆలస్యంగా ఉల్లి విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఏటా కర్నూలు ఉల్లి సీజన్‌ జులైలో ప్రారంభమై, ఆగస్టులో ఊపందుకునేది. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులతో మార్కెట్‌ రద్దీగా ఉండేది. కానీ ఈ ఏడాది ఆలస్యంగా సీజన్‌ ప్రారంభమెంది. ఇప్పటికే వందల టన్నుల వ్యాపారం జరగాల్సి ఉన్నా...ఈ ఏడాది ఇంకా పుంజుకోలేదు.   ఏటా ఈ నెలలో కనీసం రోజుకు 70 నుంచి 90 లారీల వరకూ దిగుమతయ్యేవి. పంట తక్కువగా ఉండటంతోపాటు నాసిరకం రావడంతో ఇక్కడ వ్యాపారులేకాదు..ఒడిశా, పశ్చిమ బంగ నుంచి వ్యాపారులు కొనేందుకు అంతగా ముందుకు రావడం లేదు. దీంతో దిగుమతైన ఉల్లి వేలం వేయడానికి ఎక్కువ సమయం పడుతోంది. శుక్రవారం దిగుమతైన ఉల్లికి మధ్యాహ్నం అయినా వేలం పూర్తి కాలేదు. నాణ్యమైన మహారాష్ట్ర ఉల్లి అయితే గంటలోపే పూర్తయ్యేది.

ప్రారంభ ధర రూ.300
కర్నూలు ఉల్లి క్వింటా రూ.300 నుంచి ప్రారంభమైంది. నాణ్యతను బట్టి రూ.1400 వరకు వేలంలో పలికింది. నాసిరకమే ఎక్కువగా రావడంతో ధర పడిపోయింది. మహారాష్ట్ర ఉల్లి క్వింటా రూ.600 నుంచి రూ.1600 వరకూ వెళ్లింది. బంగ్లాదేశ్‌కు కూడా ఇక్కడి నుంచే గతంలో ఎగుమతి చేసేవారు. కానీ చైనా నుంచి తక్కువ ధరకే లభిస్తుండటంతో  అక్కడి వ్యాపారులు దిగుమతులను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌, నేపాల్‌ వంటి దేశాలతో ఉల్లి వాణిజ్యం భారీగా దెబ్బతింది. ఏటా 500  నుంచి వెయ్యి టన్నుల వరకు ఆయా దేశాలకు ఎగుమతులు చేసేవారు. ఈ ఏడాది మాత్రం 70 శాతం తగ్గిపోయింది.

కిసాన్‌ రైళ్లలో ఎగుమతులేవీ
కిసాన్‌ రైళ్లను 50 శాతం తక్కువ ధరకే వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు రైల్వేశాఖ అనుమతిచ్చింది. లారీ ఉల్లిని నాగాలాండ్‌ వంటి రాష్ట్రానికి రవాణా చేయాలంటే రూ.80 వేల వరకూ కిరాయి ఉండేది. ఒక్కో బోగీకి మూడు లారీల సరకును రూ.60 వేలకే రవాణా చేయవచ్చు. దీంతో ఈ రైళ్లకు డిమాండ్‌ ఉండేది. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో పంట విస్తారంగా పండటంతో ఇక్కడి నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో కిసాన్‌ రైళ్లకు డిమాండ్‌ తగ్గింది. స్థానిక మార్కెట్‌ కేంద్రంగా వాణిజ్యం జరుగుతోంది. గత ఏడాది ఈ సీజన్‌లో ఉల్లి రవాణా కోసమే 21 వరకు కిసాన్‌ రైళ్లను కేటాయించారు. కానీ ప్రస్తుతం వ్యాపారులు వీటి కోసం దరఖాస్తు కూడా చేయలేదు. గత ఆరేళ్లలో ఉల్లి వ్యాపారానికి ఇంత భారీ కుదుపు ఇదేనని వ్యాపారులు అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని