logo

పన్నుల సొమ్ము ఏమైనట్లు!

ఆకివీడు నగర పంచాయతీలో గతేడాది వెలుగు చూసిన పన్నుల సొమ్ము గోల్‌మాల్‌ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.

Published : 24 Sep 2022 05:59 IST

ఆకివీడు నగర పంచాయతీలో మళ్లీ గందరగోళం

ఆకివీడు నగర పంచాయతీ కార్యాలయం

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడు నగర పంచాయతీలో గతేడాది వెలుగు చూసిన పన్నుల సొమ్ము గోల్‌మాల్‌ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అప్పట్లో పక్కదారి పట్టిన సొమ్మును రివకరీ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మొత్తానికి సంబంధించిన లెక్కలు ఇప్పటికీ కొలిక్కి రాకపోవడంతో పన్ను చెల్లింపుదారులకు కొత్త కష్టాలు తప్పడం లేదు. తాజాగా జారీ చేసిన ఇంటి పన్ను డిమాండ్‌ నోటీసుల్లో పాత బకాయిలను వడ్డీ సహా చెల్లించాలని చూపడంతో నివాసితులు గగ్గోలు పెడుతున్నారు.
ఏం జరిగిందంటే..
ఆకివీడు నగర పంచాయతీగా వర్గోన్నతి చెంది మూడేళ్లు అవుతోంది. ఇప్పటికీ ఇంటి, కుళాయిల పన్నుల వ్యవస్థ గాడినపడలేదు. పర్యవేక్షణ లోపాల కారణంగా గతేడాది దాదాపు రూ.13 లక్షల వరకు పన్నుల సొమ్ము నగర పంచాయతీ ఖాతాల్లో జమకాలేదు. దీనిని ఆలస్యంగా గుర్తించిన అధికారులు విచారణ జరిపి వార్డు సచివాలయ సంక్షేమ సహాయకుడు ప్రజలు చెల్లించిన సొమ్మును పక్కదారి పట్టించినట్లు తేల్చి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో రూ.13 లక్షలు గోల్‌మాల్‌ అయినట్లు గుర్తించి ఆ మొత్తాన్ని రికవరీ చేసినట్లు కమిషనర్‌ ప్రకటించారు. ఈ నగదును సంబంధిత పన్ను అసెస్‌మెంట్‌లలో సర్దుబాటు చేయాల్సి ఉన్నా ఇప్పటికీ ఆ ప్రక్రియ కొలిక్కిరాలేదు. దీంతో అప్పట్లో పన్నులు చెల్లించిన వారికి కూడా పాత బకాయిలు ఉన్నట్లు ఆన్‌లైన్లో చూపుతోంది.

సందేహాలెన్నో..
నగర పంచాయతీకి ఏటా ఇంటి, కుళాయి తదితర పన్నుల రూపంలో సుమారు రూ.1.20 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఆరు నెలలకు ఒకసారి పన్నులు వసూలు చేస్తున్నారు. గతంలో అవకతవకల కారణంగా పక్కదారి పట్టిన నగదును రికవరీ చేసినట్లు అధికారులు చెబుతున్నా ఆ మొత్తం ఇప్పటికీ పన్నుల ఖాతాల్లో జమకాకపోవడంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జారీ చేసిన నోటీసుల్లో పాతబకాయిలు, దానికి వడ్డీతో కలిపి చెల్లించాలని చూపడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సిబ్బంది చేసిన తప్పిదాల కారణంగా తాము కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అధికారులకు స్పష్టత లేదు
నేను గతేడాది పన్ను మొత్తం చెల్లించా. ఇటీవల జారీ చేసిన కొత్త డిమాండ్‌ నోటీసులో గతేడాది బకాయిలను వడ్డీతో కలిపి చెల్లించాలని చూపారు. దీనిపై అధికారులను అడిగితే సమాధానం చెప్పడం లేదు. దానిలో చూపిన మొత్తం కట్టాల్సిందేనని చెబుతున్నారు. చేసేదిలేక అదనంగా రూ.1400, వడ్డీ కింద రూ.200 కట్టాల్సి వచ్చింది. -పి.శ్రీనివాసు, ఆకివీడు

ఆందోళన వద్దు
ఆన్‌లైన్‌ విధానంలో పన్నుల వసూలు ప్రక్రియ చేపట్టిన తర్వాత నగదు గోల్‌మాల్‌ అయినట్లు గుర్తించాం. తర్వాత ఆ నగదును రికవరి చేసి జమచేశాం. గతంలో చెల్లించిన వారు మళ్లీ కట్టాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి పూర్తిసమాచారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. ఈ ఏడాది నోటీసులు జారీచేయడం ఆలస్యమైన మాట వాస్తవమే.  - సీహెచ్‌ వెంకటేశ్వరరావు, నగర పంచాయతీ కమిషనర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని